ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి: పీఎం మోదీ

Agricultural Reforms Bill, Agricultural Reforms Bill In Parliament, Agricultural Reforms Bill News, Agricultural Reforms Bill Updates, Agriculture reform bills will liberate farmers, Farmers Bill, Farmers have been Liberated by the Agricultural Reforms Bill, PM Modi Over Agricultural Reforms Bill

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు చారిత్రాత్మకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు చెందిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినట్లు పేర్కొన్నారు. ఇది మన రైతులను అనేక పరిమితులనుంచి విముక్తులను చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా గల రైతులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంస్కరణలవల్ల తమ ఉత్పత్తుల విక్రయం కోసం రైతులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రైతు సంపాదనలో అధికశాతం తన్నుకుపోయే దళారీ వ్యవస్థ నుంచి ఈ సంస్కరణలు రైతుకు రక్షణనిస్తాయన్నారు.

కాగా వ్యవసాయ సంస్కరణల బిల్లుపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కొందరు వ్యవసాయ సంస్కరణల బిల్లుపై రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. నేడు సంస్కరణలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు తమ ఎన్నికల హామీల్లోనూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీల చట్టాల్లో మార్పులు తెస్తామని ప్రకటించినట్లు ప్రధాని గుర్తుచేశారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బీహార్ రాష్ట్రంలో చారిత్రక ‘కోసి మహా రైలువారధి’ని జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, వ్యవసాయ సంస్కరణల బిల్లు గురించి వివరణ ఇచ్చారు.

కనీస మద్దతుధర ప్రయోజనాన్ని ప్రభుత్వం ఇక రైతులకు ఇవ్వదని కూడా దుష్ప్రచారం చేస్తున్నారని ప్రధాని అన్నారు. కనీస మద్దతు ధర ద్వారా రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వపరంగా పంట ఉత్పత్తుల సేకరణ ఎప్పటిలాగానే కొనసాగుతుందని ప్రధాని పునరుద్ఘాటించారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక రైతులు తమ పంట కోతల తర్వాత దేశంలో ఎక్కడైనా తమకు గిట్టుబాటయ్యే ధరకు అమ్ముకునే వీలుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ కల్యాణ్ యోజన, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన, నీమ్ కోట్ యూరియా, దేశంలో భారీ శీతల గిడ్డంగుల నెట్‌వర్క్‌ నిర్మాణం, ఆహార తయారీ పరిశ్రమలలో పెట్టుబడులు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి ఏర్పాటు వంటి ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చామని చెప్పారు.

దేశంలో రైతుల ఆదాయం పెంచడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యాధుల నుంచి పశువులకు రక్షణ దిశగా దేశవ్యాప్త కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తప్పుదోవ పట్టించేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. విమర్శకులు రైతులను రక్షించడం గురించి మాట్లాడుతున్నారని, వాస్తవానికి రైతులు ఇంకా బంధనాల్లోనే ఉండాలన్నది వారి మనోభావమని హెచ్చరించారు. వారు దళారీలకు మద్దతిస్తూ రైతుల ఆర్జన దోచేవారికి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. ఇలాంటివారిని దూరంగా ఉంచడం ప్రస్తుతం ఎంతో అవశ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =