త్వరలో వీఆర్వో సమస్యల పరిష్కారం, పలు శాఖల్లో ఉన్న ఖాళీలలో స‌ర్దుబాటు: సీఎం కేసీఆర్

CM KCR About Registration Charges and VROs Issues

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను ఈ రోజు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని మూడుచింత‌లప‌ల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ దేశంలోనే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందని చెప్పారు. ఒక కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో ఉన్నాయని, ఎక్కడినుంచైనా వారి భూముల వివరాలు ఈ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చని చెప్పారు. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లలలో ఎలాంటి అక్రమాలకు తావు ఉండదని చెప్పారు.

ఒక పైసా పెంచలేదు, పాత రిజిస్ట్రేషన్ చార్జీలే:

రాష్ట్రంలోని మొత్తం 570 ఎమ్మార్వో కార్యాలయాలను స‌బ్ రిజిస్టర్ కార్యాలయాలుగా మారాయ‌ని చెప్పారు. ఎలాంటి పైర‌వీ లేకుండా రైతుల‌కు ఇష్ట‌మున్న రోజునే స్లాట్ బుక్ చేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు. భూమి రిజిస్ట్రేషన్ల ఛార్జీలకు సంబంధించి ఒక్క పైసా కూడా పెంచలేదని, పాత రిజిస్ట్రేషన్ ఛార్జీలే వ‌ర్తిస్తాయ‌ని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. కొత్తగా జరిపే క్రయ,విక్రయాల నమోదు 15 నిమిషాల్లో పూర్తి అవుతుందని చెప్పారు. డాక్యుమెంట్ రైట‌ర్లు సహాయం అవసరమైతే వారు తీసుకునే ఫీజు కూడా ప్రభుత్వమే నిర్ణయించి, వాళ్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

వీఆర్వో సమస్యలను ప‌రిష్క‌రిస్తాం:

తెలంగాణ‌ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో, త్వ‌ర‌లోనే వీఆర్వోల స‌మ‌స్యలను ప‌రిష్క‌రిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను వీఆర్వోలతో స‌ర్దుబాటు చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామని, రాష్ట్రంలో వీఆర్వోలు బాధ‌పడే అవ‌స‌రం లేదని అన్నారు. మరోవైపు రైతుబంధు పథకంపై స్పందిస్తూ కేసీఆర్‌ బతికి ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితిలోనూ రైతుబంధు ఆగే ప్రసక్తే లేదని చెప్పారు. క‌రోనా స‌మ‌యంలో కూడా 48 గంట‌ల్లోనే 58 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లోకి రైతు బంధు న‌గ‌దు జ‌మ చేశామ‌ని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

సాదా బైనామాల గ‌డువు మ‌రో వారం రోజులు పొడిగింపు:

మరోవైపు రాష్ట్రంలో సాదా బైనామాల గ‌డువును మ‌రో వారం రోజులు పాటుగా పొడిగిస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. సాదాబైనామాలతో క్ర‌య‌, విక్ర‌యాలు చేసిన వాళ్ళు చివ‌రి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గడువు అనంతరం సాదా బైనామాల‌ నమోదుకు అవ‌కాశం ఉండ‌ద‌ని స్పష్టం చేశారు. ఇప్ప‌టికే సాదాబైనామాల ద్వారా ఒక ల‌క్ష 64 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని, రానున్న వారం రోజుల్లో కూడా మీ సేవ‌, క‌లెక్ట‌ర్ ఆఫీసుల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని పేర్కొన్నారు. రైతులకు రూపాయి ఖ‌ర్చు లేకుండా ప‌ట్టాలు చేసి, ప్రభుత్వం పాస్‌బుక్ జారీ చేస్తుందని చెప్పారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eighteen =