తక్షణమే యూరియా సరఫరాపై సీఎం కేసీఆర్ ఆదేశాలు

CM KCR Directs Officials Over Shortage Of Urea, CM KCR Directs Officials Over Shortage Of Urea In the State, KCR Directs Officials Over Shortage Of Urea, KCR Directs Officials Over Shortage Of Urea In the State, Mango News Telugu, Political Updates 2019, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లోనే డిమాండుకు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలని చెప్పారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న స్టాకును రైళ్లు, లారీల ద్వారా వెంటనే తెప్పించి, స్టాకు పాయింట్లలో పెట్టకుండా నేరుగా గ్రామాలకే పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు ఎరువులు అందించే విషయంపై ప్రగతి భవన్ లో శుక్రవారం సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్ని యూరియా డిమాండ్ పై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ ఏర్పడడానికి గల ప్రధాన కారణాలను వ్యవసాయశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బినిఫిట్ ట్రాన్స ఫర్ విధానం ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని నిర్ణయించింది. దీంతో ప్రైవేటు కంపెనీలు, వ్యాపారులు ఎరువులను పెద్ద మొత్తంలో తెప్పించలేదని వివరించారు. గత నాలుగు సంవత్సరాలలో ఖరీఫ్ సీజన్లో 6 లక్షల టన్నులకు కాస్త అటూ ఇటూగా యూరియా అవసరం పడింది. ఈసారి ఆగస్టు చివరి నాటికే రాష్ట్రంలో 6 లక్షల టన్నుల యూరియా రైతులకు చేరింది. ఈసారి వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ఏకకాలంలో యూరియా అవసరం పడడంతో పాటు, పంటల విస్తీర్ణం పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది, రైతుల డిమాండ్ కు అనుగుణంగా వ్యవసాయ శాఖ జాగ్రత్త పడి వివిధ కంపెనీలకు యూరియా ఆర్డర్ పెట్టింది. ఆ యూరియా షిప్పుల ద్వారా రావడంలో ఆలస్యం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు.

ఐడిఎల్, ఇఫ్కో, సిఐఎల్, క్రిబ్ కో, ఎన్ఎఫ్ఎల్ కంపెనీల ద్వారా వచ్చిన దాదాపు లక్షా 15వేల టన్నుల యూరియా ప్రస్తుతం విశాఖపట్నం, కాకినాడు, గంగవరం, కృష్ణపట్నం, న్యూ మంగులూరు నౌకాశ్రయాలకు చేరింది. అక్కడి నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చేరాల్సి ఉంది. అయితే సాధారణ పద్ధతుల్లో యూరియా రవాణా జరిగితే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో, సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి చాలా తొందరగా యూరియా తెప్పించడానికి ఏర్పాట్లు చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ శివప్రసాద్, చీఫ్ ఫ్లీట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీ నాగ్యాతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. వివిధ పోర్టులో ఉన్న యూరియా స్టాకును వెంటనే తెలంగాణ జిల్లాలకు తరలించడానికి 25 ప్రత్యేక గూడ్సులను కేటాయించాలని అభ్యర్థించారు. ఆ గూడ్సు రైళ్ళలో వెంటనే లోడ్ చేయించి, చాలా వేగంగా జిల్లాలకు తరలించాలని కోరారు. జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, సనత్ నగర్, ఖమ్మం, కొత్తగూడెం, జడ్చర్ల, తిమ్మాపూర్ తదితర రైల్వే స్టేషన్లకు నేరుగా గూడ్సుల ద్వారా యూరియా పంపాలని కోరారు. దీనికి రైల్వే అధికారులు అంగీకరించారు. శుక్రవారమే తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు గూడ్సు రైళ్లు కేటాయిస్తామని చెప్పారు.

పోర్టుల నుంచి నేరుగా, రైల్వే స్టేషన్ల ద్వారా వచ్చేయూరియాను మళ్లీ స్టాక్ పాయింట్లకు తీసుకుపోకుండా ఏ మండలంలో ఎంత డిమాండ్ ఉందో ముందే నిర్దారించి, నేరుగా పంపాలని, ఈ పనిని పర్యవేక్షించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. మొత్తంగా మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు లక్ష టన్నుల యూరియా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అందాలని, యూరియా కోసం రైతులు ఎదురు చూసే పరిస్థితి తొలగిపోవాలని సీఎం ఆదేశించారు. వివిధ పోర్టులలో ఉన్న యూరియాను తెలంగాణకు రప్పించే పనిని ప్రగతి భవన్ లోనే ఉండి పర్యవేక్షించాలని వ్యవసాయ, రవాణా శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను, అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రగతి భవన్ నుంచే వారు రైల్వే అధికారులతో, లారీ యాజమానుల సంఘాలతో, వివిధ కంపెనీలతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతీ రైతుకు కావాల్సిన యూరియా అందే వరకు విశ్రమించవద్దని, రేయింబవళ్లు పర్యవేక్షించి, సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. సమీక్ష సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, పార్థసారథి, సునిల్ శర్మ, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె. సంతోష్ కుమార్, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here