దసరా నాటికీ రైతువేదికల నిర్మాణం పూర్తి చేయాలి – సీఎం కేసీఆర్

Agriculture Sector, CM KCR Review Meeting, CM KCR Review Meeting on Rythu Bandhu Scheme, CM KCR Review Meeting on Rythu Bandhu Scheme and Agriculture Sector, Rythu Bandhu Scheme, Rythu Bandhu Scheme Laetst News, Rythu Bandhu Scheme News, telangana

రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 11, శనివారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమని, ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని అన్నారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ.25 కోట్ల వ్యయంతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజి నిర్మించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

‘‘కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశ్యంతో రైతుబంధు సాయం విడుదల చేసింది. అధికారులు ఎంతో సమన్వయంతో వ్యవహరించి రైతులందరికీ సకాలంలో రైతుబంధు సాయం అందించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందింది. ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయినా, వెంటనే వారిని గుర్తించి సాయం అందించాలి. ఏ ఒక్కరూ మిగలకుండా చిట్ట చివరి రైతు వరకు రైతుబంధు సాయం అందించాలి. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలను వెంటనే తెలుసుకుని, అందరికీ డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలి. కాస్తులో ఉన్నప్పటికీ కొంత మంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించాలి. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకా మైనా (స్పాట్ ఎంక్వైరీ) నిర్వహించాలి. చుట్టుపక్కల రైతులను విచారించి యాజమాన్య హక్కులు కల్పించాలి. అందరి సమస్యలు పరిష్కరించి, అందరికీ సాయం అందించాలి. ఈ విషయంలో రైతుబంధు సమితుల, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. ఒక సారి పరిష్కారం అయిపోతే, ఎప్పటికీ గొడవ ఉండదు. అది అన్ని తీర్లా మంచిది’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

‘‘మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదు. ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ వల్ల ప్రభుత్వం మొత్తం గ్రామంలో సర్వే జరిపింది. ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించడం జరిగింది. మిగతా చోట్ల కూడా అదే జరగాలి’’ అని సీఎం కోరారు. ‘‘రైతులందరికీ రైతుబంధు సాయం అందించడానికి ఎంత వ్యయం అయినా ప్రభుత్వం వెనుకాడదు. రైతుబంధు సాయం అందించడానికి టైమ్ లిమిట్ లేదు. చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించవద్దు. వందకు వంద శాతం రైతులందరికీ సాయం అందడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా తనకు రైతుబంధు సాయం అందలేదని అనవద్దు’’ అని సీఎం స్పష్టం చేశారు.

“రైతుబంధు సాయం ఎంత మందికి అందింది? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలపై వెంటనే నివేదిక సమర్పించాలి. క్లస్టర్ల వారీగా ఎంఇవోల నుంచి నివేదికలు తెప్పించాలి. రైతుబంధు సమితుల ద్వారా కూడా వివరాలు తెప్పించాలి. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి వెంటనే సాయం అందించాలి. భూముల క్రయ విక్రయాలు జరిగితే ఆ వివరాలను కూడా వెంటనే నమోదు చేయాలి’’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

‘‘రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించింది. రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే వానాకాలం పంటల సాగు చేస్తున్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదు. ఇది గొప్ప పరివర్తన. నియంత్రిత సాగు పద్ధతి వందకు వంద శాతం విజయవంతం కావడం గొప్ప పరిణామం. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికింది. ఇది శుభసూచకం. తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు. రైతుల స్పందన ప్రభుత్వానికి ఎంతో స్పూర్తినిస్తున్నది. రైతు సంక్షేమం-వ్యవసాయాభివృద్ధి కోసం మరింతగా పనిచేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నది’’ అని సీఎం ప్రకటించారు.

‘‘రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో మరెక్కడా లేని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేదికల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలి. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయి’’ అని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతున్నది. అందులో భాగంగా పెద్ద ఎత్తున విత్తన ఉత్పత్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైతులకు అవసరమైన మేలు రకమైన, నాణ్యమైన విత్తనాల తయారీని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టాయి. అలా తయారు చేసిన విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ.25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కావాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల అవుతాయి. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని” సీఎం కేసీఆర్ చెప్పారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here