భారీ వర్షాల వలన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5 వేల కోట్లు నష్టం, 50 మంది మృతి

Heavy Rains Cause Loss of Rs 5000 Crore In Telangana, Heavy Rains In Telangana, Telangana Heavy Rains, telangana rain forecast, Telangana rains live updates, telangana rains news, telangana rains updates

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలను సమీక్షించారు. రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులను నిర్దేశించారు. హైదరాబాద్ లో ఎక్కువ ప్రభావం ఉన్నందున జీహెచ్ఎంసీలో పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రత్యేకంగా చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు.

సమీక్ష సందర్భంగా తమ శాఖల పరిధిలో జరిగిన నష్టాన్ని అధికారులు వివరించారు:

–> రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల గురువారం నాటికి 50 మంది మరణించారు. వారిలో జీహెచ్ఎంసీ పరిధిలోని వారు 11 మంది ఉన్నారు.

–> రాష్ట్ర వ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వీటిలో సగం పంటలకు నష్టం కలిగినా వాటి విలువ రూ.2 వేల కోట్లు ఉంటుంది.

–> జీహెచ్ఎంసీలో పరిధిలో 1916 తర్వాత ఒకేరోజు 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. దీనివల్ల చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా చెరువుల ఎఫ్.టి.ఎల్. పరిధిలో ఉన్న కాలనీల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. అపార్టుమెంట్ల సెల్లార్లలో కూడా నీరు రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగింది. హైదరాబాద్ నగరంలో 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో 20,540 ఇండ్లు నీటిలో చిక్కుకున్నాయి. 35 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఎల్.బి నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువుంది. హైదారాబాద్ నగరంలో 14 ఇండ్లు పూర్తిగా, 65 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జీహెచ్ఎంసీ, ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి. 445 చోట్ల బిటి రోడ్లు, 6 చోట్ల నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయి. అన్ని చోట్ల రోడ్ల పునరుద్ధరణ జరుగుతున్నది. హైదరాబాద్ నగరంలో 72 చోట్ల పునరావాస కేంద్రాలు ప్రారంభించి, ప్రభావిత ప్రజలకు తాత్కాలిక ఆవాసం, భోజనం కల్పించడం జరిగింది. ఇండ్లలో నీళ్లు చేరినందున రోజు దాదాపు లక్షా పది వేల మందికి భోజనం అందిస్తున్నాము.

–> జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 30 పట్టణాల్లో వర్షాలు, వరదల ప్రభావం ఉంది. 238 కాలనీలు జలమయమయ్యాయి. 150 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.

–> ట్రాన్స్ కో పరిధిలో 9 సబ్ స్టేషన్లు, ఎస్.పి.డి.సి.ఎల్. పరిధిలో 15 సబ్ స్టేషన్లు, ఎన్పీడిసిఎల్ పరిధిలో 2 సబ్ స్టేషన్లలోకి నీళ్లు వచ్చాయి. అన్ని చోట్ల యుద్ధ ప్రాతిపదికన నీళ్లను తొలగించడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు, సెల్లార్లలో నీళ్లున్న అపార్టు మెంట్లకు విద్యుత్ సరఫరా తొలగించడం జరిగింది. నీళ్లు తొలగించే పనులు జరుగుతున్నాయి. నీళ్ల తొలగింపు పూర్తయిన చోటల్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతున్నది. చెట్లు, కొమ్మలు పడిపోయిన చోట్ల వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్దరణ జరిగింది. చాలా చోట్ల వరదల వల్ల, ముఖ్యంగా మూసీ నదీ వెంట ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు, కరెంటు పోళ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ శాఖ పరంగా దాదాపు 5 కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా.

–> రాష్ట్ర వ్యాప్తంగా 101 చెరువు కట్టలు తెగాయి. 26 చెరువు కట్టలకు బుంగలు పడ్డాయి. జల వనరుల శాఖకు రూ.50 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా.

–> పంచాయతీ రాజ్ రోడ్లు 475 చోట్ల దెబ్బతిన్నాయి. 269 చోట్ల రోడ్లు తెగిపోయాయి. రూ.295 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా.

–> ఆర్ అండ్ బి రోడ్లు 113 చోట్ల దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బి పరిధిలో రూ.184 కోట్లు, నేషనల్ హైవేస్ పరిధిలో రూ.11 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా.

–> భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రైతులకు సహాయం అందించడానికి రూ.600 కోట్లు, జీహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాస, పునరుద్ధరణ చర్యల కోసం మరో రూ.750 కోట్లు సహాయం అందించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.

ఈ సమీక్షలో మంత్రులు కెటి రామారావు, ఎస్. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి రఘుమారెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్థన్ రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, జల వనరుల శాఖ ఇఎన్సి మురళీధర్ రావు, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =