త్వరలో భవన నిర్మాణ అనుమతుల కోసం వేగవంతమైన విధానం – మంత్రి కేటీఆర్

Mango News Telugu, Policy Fast Track Building Permissions In Telangana, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Building Permissions, Telangana Minister KTR, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019
  • పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టం అమలు
  • దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనితీరుపై ఉన్న అనుమానాలు తొలగించేలా నూతన భవన నిర్మాణ అనుమతుల విధానం
  • టీఎస్ ఐపాస్ మాదిరే నూతన భవన నిర్మాణ అనుమతులు విధాన రూపకల్పన
  • సెల్ఫ్ డిక్లరేషన్, సింగిల్ విండో పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు
  • నూతన విధానాన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు అనుమతులు తీసుకున్నా, అక్రమ నిర్మాణాలు చేపట్టిన కూల్చివేతలు తప్పవన్న మంత్రి
  • నూతన విధానాన్ని అమలు చేసే బాధ్యత టౌన్ ప్లానింగ్ సిబ్బందిదే
  • నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే టౌన్ ప్లానింగ్ సిబ్బంది పైన నూతన చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవు
  • టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఖాళీల భర్తీ, ఇతర మౌలిక వసతుల కల్పనకు పురపాలక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి
  • రాష్ర్టస్ధాయి టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమావేశంలో ప్రసంగించిన మంత్రి

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు డిసెంబర్ 20, శుక్రవారం నాడు బుద్దభవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమావేశంలో ప్రసంగించారు. పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇల్లు కట్టుకోవాలనుకునే వ్యక్తి సులభంగా అత్యంత పారదర్శకంగా, వేగంగా భవన నిర్మాణ అనుమతులను పొందే విధంగా నూతన విధానం తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ భవిష్యత్తు కార్యాచరణను, అందులో టౌన్ ప్లానింగ్ సిబ్బంది నుంచి ఆశిస్తున్న పనితీరుపైన కూలంకశంగా వివరించారు. దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ శాఖ సిబ్బంది పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించి, అత్యంత పారదర్శకంగా, వేగంగా అనుమతులు ఇచ్చే నూతన విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ విధానంలో రాష్ట్రంలో 75 గజాల లోపు భవన నిర్మాణం చేపట్టే వారికి కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని, 600 గజాలలోపు భవన నిర్మాణాలకు సెల్ఫ్ డిక్లరేషన్ విధానం, 600 గజాలపైన భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులకు ఈ నూతన విధానం వీలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు. సాంప్రదాయికంగా ఉన్న అనుమతుల ప్రక్రియను పూర్తిగా మార్చేటప్పుడు కొన్ని సవాళ్లు ఎదురవుతాయని, అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకత్వం, మార్గదర్శనంలో మార్పు సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో పరిశ్రమల శాఖ అనుమతుల విధానం పూర్తిగా మార్చి సింగిల్ విండో పద్ధతి విధానాన్ని తీసుకొచ్చి విజయం సాధించామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే విధంగా అత్యంత పారదర్శకంగా ఉండే భవన నిర్మాణ అనుమతుల విధానాన్ని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అనుమతుల ప్రక్రియలో సమయాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.

నూతన విధానాన్ని అమలు చేసే బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారులదే

నూతన విధానంలో ప్రజలు మరియు అధికారులపైన అత్యంత విశ్వాసం నుంచి ఈ నూతన విధానాన్ని తీసుకువస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే ప్రజలు ఈ విధానాన్ని దుర్వినియోగం చేసి, తప్పుడు అనుమతులు తీసుకున్నా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా వాటిని ఎలాంటి నోటీసు లేకుండా కూల్చే అధికారం నూతన పురపాలక చట్టంలో ఉందని, ఈ విషయాన్ని ప్రజల దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. నూతన విధానాన్ని అమలు చేసే బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారులదే అని అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నూతన విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలకు పూర్తి బాధ్యత అధికారులు వహించాల్సి ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలన్నారు. టౌన్ ప్లానింగ్
విభాగంలో అవినీతి ఆరోపణలపైనా కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే అధికారులను ఉపేక్షించబోమని తెలిపారు. నూతన పురపాలక చట్టంలో పురపాలక ఉద్యోగులు, పాలక మండళ్లపైనా కఠిక చర్యలు తీసుకునే వీలున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలోగ్గాల్సిన అవసరం లేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంలో సిబ్బందికి నేను అండగా ఉంటానని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకురానున్న నూతన విధానంలో ప్రజల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా పని చేద్దామని కోరారు. దీంతోపాటు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఖాళీల భర్తీ, వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పన విషయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

పురపాలికలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన క్యాలెండర్

మెరుగైన జీవన ప్రమాణాలు ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పట్టణాలవైపు చూస్తున్నారని, పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణాలు మౌలిక వసతుల కల్పనతో పాటు, పట్టణాన్ని సమగ్ర కార్యచరణతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రణాళికాబద్ధ అభివృద్ధిలో టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని మంత్రి అన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పురపాలక చట్టం దోహదం చేస్తుందని తెలిపారు. ఇందుకోసం ప్రతి పురపాలికకు ఒక మాస్టర్ ప్లాన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పన క్యాలెండర్ను కూడా తయారు చేయాలని డిటిసిపి అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న ఆరు పట్టణాభివృద్ధి సంస్థలు, ప్రస్తుతం హెఛ్ఎండీఏ విజయవంతంగా అనుసరిస్తున్న ల్యాండ్ పూలింగ్ వంటి పద్ధతులను అనుసరించాలని కోరారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు హైదరాబాద్ సిసిపి దేవేందర్ రెడ్డి, మరియు డిటిసిపి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − two =