రాష్ట్రానికి రావాల్సిన 1434 కోట్ల నిధులు విడుదలకై కేంద్ర ఆర్థికమంత్రికి మంత్రి కేటిఆర్ లేఖ

KTR Request Release of Pending Grants to ULBs, KTR urges Sitharaman to release pending dues, Minister for IT, Minister KTR, Minister KTR Letter to Union Finance Minister, Minister KTR Wrote a Letter to Union Finance Minister, Pending Grants to ULBs, telangana, Telangana News

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని పట్టణాలకు రావాల్సిన గ్రాంట్లకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని మిలియన్ ప్లస్ నగరాల కేటగిరిలో ఉన్న హైదరాబాద్ కి 468 కోట్ల రూపాయలను మరియు ఇతర పట్టణాలకు 421 కోట్ల రూపాయలు మొత్తం నిధులను కేటాయించిందని, వీటిని ఇప్పటికే విడుదల చేయాల్సి ఉందని మంత్రి కేటిఆర్ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే ఈ నిధుల కేటాయింపుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ని పార్లమెంటులో సైతం ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రికి గుర్తుచేశారు. ఇందులో హైదరాబాద్ కి రావాల్సిన నిధుల్లో ఇప్పటిదాకా ఒక్క రూపాయి విడుదల కాలేదని, మిగిలిన నగరాలకు సంబంధించి కేవలం 105 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా విడుదలయ్యాయని చెప్పారు. కరోనా సంక్షోభంలో రాష్ట్రాలు కూడా ముందువరుసలో ఉండి పోరాడుతున్నాయని, దీంతోపాటు ఆర్థిక కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మంత్రి కేటిఆర్ కేంద్రమంత్రికి లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నదని, వీటికి సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ ను కూడా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం జరిగిందని తెలిపారు. అయితే ఆయా పథకాలకు సంబంధించి కేంద్రం యొక్క నిధులు రాకపోవడంతో ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమాలను వేగంగా కొనసాగించడం కొంత ఇబ్బందిగా మారిందన్నారు. గతంలో 14వ ఆర్థిక సంఘం సూచించిన 2714 కోట్ల రూపాయలకు బేసిక్ గ్రాంట్ కి గానూ కేంద్రం కేవలం 2502 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, అప్పుడు కూడా 208 కోట్ల రూపాయల నిధులను కేంద్రం రాష్ట్రానికి చెల్లించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ గుర్తు చేశారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నా కేంద్ర నిధులు రాకలు జాప్యం జరిగిందన్నారు. దీంతో పాటు 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి పర్ఫామెన్స్ గ్రాంట్ కింద రావాల్సిన నిధుల్లో 441 కోట్ల రూపాయల బాకీ ఉన్నాయని అన్నారు. ఇలా మొత్తం 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి 650 కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. అయితే స్థానిక పట్టణ సంస్థలకు రావాల్సిన ఈ గ్రాంట్లను ఇతర రాష్ట్రాలకు పూర్తిగా చెల్లించిన విషయాన్ని మంత్రి కేటిఆర్ ప్రస్తావించారు. ఇలా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి హైదరాబాద్ కి రావాల్సిన 468 కోట్లు, ఇతర పట్టణాలకు రావాల్సిన 315 కోట్లు, 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి 650 కోట్ల రూపాయలు మొత్తం గా సుమారు 1,434 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి హౌసింగ్ శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరి కి కూడా మంత్రి కేటిఆర్ తన లేఖను పంపించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here