ఎవ‌రిది డ్రామా.. పిల్‌ వెనుక ఎవ‌రున్నారు..?

Telangana, Kaleshwaram, BRS, Congress, Highcourt,Medigadda barrage,Revanth Reddy News And Live Updates,Telangana Politics,BRS government,Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party,Mango News Telugu,Mango News
telangana, Kaleshwaram, BRS, Congress, Highcourt

కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఎన్నిక‌ల ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టులోని అవినీతిపైనే దృష్టి పెట్టింది. ఇంత‌లో మేడిగ‌డ్డ వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డం ఆ పార్టీకి క‌లిసొచ్చింది. అలాగే.. మేడిగ‌డ్డకు ప‌గుళ్లు, కుంగ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పనులు పూర్తి కాకుండానే 2019 జూన్‌ 21 అప్పటి సీఎం కేసీఆర్‌ బ్యారేజీని ప్రారంభించారు. అప్పటికి బ్యారేజీ ముందు భాగంలో లాంచింగ్‌ అప్రాన్‌ పనులు జరుగుతున్నాయి. పనులు కాకున్నా అయినట్లు గ‌త ప్ర‌భుత్వం సర్టిఫికెట్లు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై అధికారంలోకి వ‌చ్చాక కాంగ్రెస్ విచార‌ణ ప్రారంభించింది. ఎమ్మెల్యేల‌తో క‌లిసి బ్యారేజీ సంద‌ర్శ‌న‌కు కూడా వెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లలో నిలువెల్లా వచ్చిన పగుళ్లను చూసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సహచరులు, వెంట వచ్చిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు నివ్వెరపోయారు. ఇలాంటి ప్రాజెక్టు గురించా కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ లీడర్లు అంత గొప్పగా చెప్పారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

బ్యారేజీలో కుంగిపోయిన 20 పిల్లర్‌ను, నిలువెల్లా చీలిన 21వ నంబర్‌ పిల్లర్‌ను పరిశీలించారు. ఆ ఫౌండేషన్‌ నుంచి పైన అప్రోచ్‌ బ్రిడ్జి వరకు ఏర్పడిన భారీ పగుళ్లను చూసి విస్మయం వ్యక్తం చేశారు. బ్యారేజీ నిర్మించిన నాలుగేళ్లకే ఇంతటి డ్యామేజీకి కారణాలు ఏమిటని ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ ఏకంగా ఐదు ఫీట్లు కుంగిపోవడం, 20వ పిల్లర్‌ ఎడమ వైపు కాస్త వంగిపోవడంతో అసలు బ్యారేజీ నిలిచి ఉండే అవకాశం ఉందా? వరద వస్తే కొట్టుకుపోతుందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లను చూసి ఆశ్చర్యపోయారు. ఈ ప్రాజెక్టునా తెలంగాణకు లైఫ్‌ లైన్‌ అని చెప్పింది? ఈ ప్రాజెక్టు గురించా డిస్కవరీ లాంటి ఛానెళ్లలో గొప్పలు ప్రసారం చేసింది? అని కామెంట్‌ చేశారు. ఎక్కడ నీళ్లు కనిపించినా అవి కాళేశ్వరం నీళ్లేనని చెప్పారని, బ్యారేజీకి ఇంత నష్టం జరిగితే నాలుగైదు పిల్లర్లు తిరిగి కడితే సరిపోతుందని బుకాయించారని ప్రస్తావించారు.  అసలు ఇంత పెద్ద పిల్లర్లను ఎలా తొలగించి కొత్తగా కడుతారని ఇంజనీర్లను ప్రశ్నించారు.

అయితే.. దీనిపై నాటి అధికార ప‌క్షం, ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్షం కూడా ధీటుగానే స్పందిస్తోంది. ప్ర‌భుత్వం మేడిగ‌డ్డ‌ను ప‌ట్టుకుని వేలాడుతోంద‌ని విమ‌ర్శిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదని, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌజ్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్‌, 98 కిలోమీటర్ల ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టీఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్‌, 240 టీఎంసీల ఉపయోగం… వీటన్నింటి సమాహారమే ప్రాజెక్టు అని ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీలో హరీశ్‌రావు వివరించారు. కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రంగనాయక సాగర్‌ను చూసి మెచ్చుకున్నారని గుర్తు చేశారు. కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా కూడా ప్రాణహిత -చేవెళ్లను ఎందుకు నిర్మించలేదో సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

మ‌రోవైపు బీజేపీ నాయ‌కులు మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారాన్ని ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధిపొందేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కూడబలుక్కుని డ్రామాలాడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఓ పార్టీ కృష్ణా జలాలపై, మరో పార్టీ కాళేశ్వరంపై రచ్చ చేస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధికి విన్యాసాలు చేస్తున్నాయని విమ‌ర్శిస్తున్నారు.  ‘‘ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్‌.. కృష్ణా జలాలపై నల్లగొండలో బహిరంగ సభకు వెళ్లడం విడ్డూరంగా ఉంది. కేసీఆర్‌కు పోటీగా సీఎం రేవంత్‌, మంత్రులు, ఎమ్మెల్యేలతో మేడిగడ్డకు పొలోమని బయలుదేరారు. అసెంబ్లీని బంద్‌పెట్టి వీరంతా అక్కడేం చేస్తారు? ఇంతకు ముందే మేడిగడ్డకు రాహుల్‌గాంధీ, ఒకరి వెనక ఒకరు క్యూకట్టి మంత్రులు వెళ్లారు కదా? ఇప్పుడు మళ్లీ వెళ్లాల్సిన అవసరమేంటి?’’ అని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్రశ్నించారు.

ఇప్పుడు తాజాగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతిపై న్యాయ‌స్థానంలో విచార‌ణ జ‌రిగింది.  కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం వెనుక ఎవరున్నారో తమకు తెలుసునని హైకోర్టు పేర్కొన్నది. ఏవో ఉద్దేశాలతో పిల్‌ దాఖలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యమా..? ప్రచార వ్యాజ్యమా..? అని ప్రశ్నించింది. పిటిషనర్‌ తనకు తాను సీనియర్‌ అడ్వకేట్‌గా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పిల్‌ వెనుక ఉద్దేశాలు ఏమిటో, పిల్‌ దాఖలు వెనుక ఎవరున్నారో విచారణలో తేల్చుతామని వెల్లడించింది. పిల్‌ను సవరించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలపై విచారణ జరిపించాలని, హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఎం విశ్వనాథరెడ్డి ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై హైకోర్ట్‌ సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, జడ్జి జస్టిస్‌ జే అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు సర్టిఫై చేయకుండా పిటిషనర్‌ తనను తాను సీనియర్‌ న్యాయవాది గా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. ఇవన్నీ చూస్తుంటే ప్రాజెక్టుపై పిల్‌ దాఖలు వెనుక ఎవరున్నారో అర్థమవుతున్నదని వ్యాఖ్యానించింది. ఈక్ర‌మంలో కాళేశ్వ‌రం వ్య‌వ‌హారం తెలంగాణ‌లో కాక రేపుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + four =