246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీ ప్రాజెక్ట్, భూమి పూజలో పాల్గొన్న మంత్రి తలసాని

Minister Talasani Participated in Laying Foundation Stone for Mega Dairy Plant of Vijaya Dairy

చిన్న సన్నకారు రైతాంగానికి, పాడి పరిశ్రమకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని రావిర్యాల గ్రామ పరిధిలో 32 ఎకరాల విస్తీర్ణంలో 246 కోట్ల వ్యయంతో తెలంగాణ విజయ డెయిరీ ఆధ్వర్యంలో అత్యాధునిక మెగా డైరీ ప్రాజెక్ట్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సహకార రంగానికి సంబంధించి దేశంలో పాడి పంట ఇబ్బంది వచ్చినప్పుడు పాడి పైన ఆధార పడే సన్నకారు చిన్నకారు రైతాంగానికి చేయూత నివ్వాలనే సంకల్పంతో విజయ డెయిరీ ప్రారంభమైనదని, 2014 తెలంగాణ రాష్ట్రం రాకముందు విజయ డెయిరీ మూతపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అప్పట్లో ఒక లక్ష లీటర్ల పాలు సేకరించేవారని అన్నారు.

2014లో 300 కోట్ల టర్నోవర్ ఉండేది, నేడు 750 కోట్ల టర్నోవర్:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతాంగాన్ని ప్రోత్సహించి ఆర్థికంగా తోడ్పాటునందించి దేశంలో ఫ్రైవేట్ పోటీ రంగంలో విజయ డెయిరీ మొదటి స్థానంలో ఉందన్నారు. 2014 లో 300 కోట్ల టర్నోవర్ ఉండేదని నేడు 750 కోట్ల టర్నోవర్ తో విజయ తెలంగాణ ముందుకు వెళుతుందన్నారు. నాలుగున్నర లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతుందని అన్నారు. విజయ డెయిరీ ప్రాజెక్టును రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలనే లక్ష్యం ఉండగా ఒకటిన్నర సంవత్సరంలో పూర్తిచేయాలనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆలోచన అని అన్నారు. 8 లక్షల లీటర్లవరకు ఈ ప్రాంతంలో కొత్త టెక్నాలజీ ఉత్పత్తులను నిర్వహిస్తున్నామని, విజయ డెయిరీ ఉత్పత్తులు 28 వరకు సంస్థలు ఉన్నాయని, మన రాష్ట్రంలో నే కాకుండా ఆంధ్రప్రదేశ్ ,ఢిల్లీ , ముంబయిలో డిమాండ్ ఉన్నాయని తెలిపారు. ఒకవైపున సన్నకారు చిన్నకారు రైతులను ప్రోత్సహిస్తూ అదేవిధంగా వేలాదిమంది యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. సీజన్ ఉన్న లేకున్నా ప్రభుత్వం 365 రోజులు పాలను సేకరిస్తున్నామని, ఫ్రైవేట్ రంగంలో 365 రోజులు పాల సేకరణ చేయరని అన్నారు. పాడి రంగానికి ప్రభుత్వం ఇన్సెటివ్ కల్పిస్తుందని అన్నారు. రైతులను ఆదుకునేందుకు సబ్సిడీపై పాడి పశువులు, ఉచితంగా నట్టల మందు, మందులు ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతాంగానికి ఉచితంగా 24 గంటల కరెంటు కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన అన్నారు. రైతు బంధు రైతు బీమా వంటి పథకాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 అవుట్ లెట్లు ఉన్నాయని, 600 పార్లర్లు వీటిని ఇంకా పెంపొందించు కుంటూ ముందుకు వెళుతున్నామని ఆయన అన్నారు. 2 లక్షల 13 వేల మంది రైతులు సహకార సంఘంలో ఉన్నారన్నారు. చనిపోయిన గేదెల స్థానంలో ఇన్సూరెన్స్ ద్వారా గేదెలను అందజేస్తామని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని అన్నారు. కుల వృత్తులను ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి తలసాని అన్నారు. విజయ డైరీకి సంబందించిన 14 రకాల ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేశారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచే భాగంగా పాడి పంటలు రెండు బాగుండాలని సంకల్పంతో విజయ మెగా డెయిరీ శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలని, గొల్లకురుమల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశ్యంతో గొర్రెలను ఇవ్వడం జరుగుతుందన్నారు. 11 వేల కోట్ల రూపాయలుతో గొర్రెలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇంతకు ముందు చేపలు కావాలంటే ఈస్ట్ గోదావరి నుంచి తీసుకురావాలన్నారు. ఇప్పుడు మన చెరువులు కుంటలలో తెలంగాణలో ఎక్కడ వెళ్లిన చేపలు దొరుకుతున్నాయని అన్నారు. వృత్తి ఏదైనా ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ సమీపాన ఉన్నదని, హైదరాబాద్ సంబంధించిన పాల ఉత్పత్తికి డిమాండ్ కి అనుగుణంగా అందుకోలేకపోతున్నామని అన్నారు. కొత్తగా పాడి పరిశ్రమ పెట్టుకునే వారికి సబ్సిడీ కింద పాడి రుణాలను ఇస్తే బాగుంటుందని అన్నారు. మన వ్యవస్థని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయ డెయిరీని బలోపేతం చేసుకొని దానిపైన వచ్చిన లాభాలు రైతులకు వస్తాయని తెలిపారు. ప్రతి పాడి రైతు విజయడెయిరీకి పాలు ఇచ్చే విధంగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఇగ్గె మల్లేశం, సురభి వాణి దేవి, జిల్లా చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, అడిషనల్ డైరక్టర్ రాంచందర్, టీఎస్ఎస్ఎల్డిఏ సీఈఓ మంజువాణి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం, తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమేహన్ , వైస్ చైర్మన్ వెంకన్న, విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి, విజయ డైరీ ఎండి శ్రీనివాస్ రావు, సహకార సంఘాల సభ్యులు, రైతులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =