ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 5న ప్రారంభం: మంత్రి తలసాని

Minister Talasani Srinivas Yadav held Video Conference with Officials of Fisheries Department of All Districts, Minister Talasani Srinivas Yadav Meet With Fisheries Department, Talasani Srinivas Yadav Fisheries Department Review Meet, Minister Talasani Srinivas Yadav , Mango News, Mango News Telugu, Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav Fish Seed Meet, Free Fish Seed In Telangana, Telangana Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav Latest News And Updates

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సమర్దవంతంగా అమలు చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయం నుండి పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లతో కలిసి అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మత్స్య మిత్ర యాప్ ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. చేప పిల్లలను సరఫరా చేసే వాహనం నెంబర్, డ్రైవర్ వివరాలు, ఫోన్ నెంబర్, తదితర వివరాలను ఈ యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. చేప పిల్లలను ఏ నీటి వనరులో ఎన్ని విడుదల చేశారు, ఏ రకం విడుదల చేశారు అనే వివరాలు, ఫోటోలు తదితర వివరాలు ఏ రోజుకు ఆ రోజు ఈ యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ యాప్ వినియోగం వలన కలిగే ఉపయోగాలను మత్స్యకారులకు కూడా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల లో చేప పిల్లల విడుదల ప్రక్రియను పర్యవేక్షించడానికి కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 5న ప్రారంభం:

ఈ సంవత్సరం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 5 వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 5వ తేదీన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని ఘన్ పూర్ రిజర్వాయర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప పిల్లలను విడుదల చేసి, ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం 26,778 నీటి వనరులలో 68 కోట్ల రూపాయల వ్యయంతో 88.53 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5న ప్రారంభమయ్యే ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా ఆహ్వానించి భాగస్వాములను చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా సంబంధిత మత్స్య సొసైటీల సభ్యులను కూడా ఆహ్వానించి వారి సమక్షంలో చేప పిల్లలను విడుదల చేయాలని, ఈ ప్రక్రియను విడియో చిత్రీకరణ చేయాలని స్పష్టం చేశారు. సరఫరదారుడు తీసుకొచ్చిన చేప పిల్లలను నిశితంగా పరిశీలించి సైజ్, నాణ్యత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న చేప పిల్లలను మాత్రమే విడుదల చేయాలని, నిబంధనల ప్రకారం లేని చేప పిల్లలను తిరస్కరించాలని ఆదేశించారు.

ఉదయం 9 గంటల లోపే చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని పూర్తిచేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి అధికారులకు చెప్పారు. ప్రతిరోజూ పంపిణీ చేసిన చేప పిల్లల వివరాలను టీ మత్స్య పోర్టల్ నందు నమోదు చేసి నిర్ణీత నమూనాలో నివేదికను కమీషనర్ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా పంపించాలని ఆదేశించారు. ముందుగా సీజనల్ చెరువులలో చేప పిల్లలను విడుదల చేయాలని ఆదేశించారు. రిజర్వాయర్ లలో నీటి నిల్వల మేరకే చేప పిల్లలను విడుదలకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చేప పిల్లల సంఖ్య విషయంలో స్పష్టంగా వ్యవహరించాలని, అందుకోసం ప్రస్తుతం ఉన్న కౌంటింగ్ మిషన్ లకు అదనంగా జిల్లాకు ఒకటి చొప్పున కౌంటింగ్ మిషన్ లను కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చేప పిల్లలు విడుదల చేసిన ప్రాంతంలో నీటి వనరు పేరు, విస్తీర్ణం, సంఘం పేరు వివరాలతో కూడిన వివరాలను ప్రదర్శించాలని ఆదేశించారు. అంతేకాకుండా విడుదల చేసిన చేప పిల్లల రకం, సంఖ్య వివరాలను సంబంధిత సొసైటీ మత్స్యకారులకు తెలియజేసి నిర్దేశించిన నమూనా పత్రంలో నమోదు చేసి సభ్యుల సంతకాలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

కమిషనర్ కార్యాలయంలో ఉన్న జేడీ స్థాయి ఉన్నతాధికారులు వారికి కేటాయించిన జిల్లాలలో వారంలో మూడు రోజులపాటు పర్యటించి క్షేత్రస్థాయిలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైతే ఆకస్మిక సందర్శనలు చేసి పర్యటనకు సంబంధించిన వివరాలను కమిషనర్ కార్యాలయానికి సమర్పించాలని చెప్పారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం అమలులో ఎలాంటి విమర్శలకు తావులేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలను తీసుకుందని వివరించారు. రాష్ట్రంలోని చెరువులలో నీటి నిల్వలను పర్యవేక్షించేందుకు 26 వేలకుపైగా నీటి వనరులను జియోట్యాగింగ్ చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 18 =