కోవిడ్‌-19 నివారణపై సీఎం జగన్ సమీక్ష, రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు

CM YS Jagan held Review on Covid-19 Situation, Orders to Continue Night Curfew

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కోవిడ్‌-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, థర్డ్‌వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2.11 శాతానికి తగ్గిందని, మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్నిజిల్లాల్లో 3 శాతానికి లోపలే పాజిటివిటీ రేటు ఉంటుందని తెలిపారు. థర్డ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని అన్నిరకాల ఏర్పాట్లతో సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే 20,964 ఆక్సిజన్‌ కాన్సెన్ట్రేటర్స్, 27,311 ఆక్సీజన్‌ డి–టైప్‌ సిలిండర్లు సిద్ధంకాగా, మరో 2493 ఆక్సిజన్‌ కాన్సెన్ట్రేటర్స్ కూడా సమకూర్చుతున్నామని చెప్పారు.

రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగింపు:

రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా పండుగల సీజన్‌ లో జాగ్రత్తలు పాటించాలని సమావేశంలో పాల్గొన్న వైద్యులు సూచించారు. వినాయకచవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారుల సిఫార్సు చేశారు. ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని, పబ్లిక్‌ స్థలాల్లో విగ్రహాలు వద్దని, నిమజ్జన ఊరేగింపులు వద్దని వైద్యాధికారులు సిఫార్సు చేశారు. వైద్యాధికారుల సిఫార్సు మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవని సీఎం పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ జారీ చేయనుంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు గుర్తించి 90 రోజుల్లోగా వారిని నియమించేందుకు తీసుకుంటున్న చర్యలపై కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వైద్యులు లేరు, సిబ్బంది లేరనే మాటలు ఎక్కడా వినిపించకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 3,02,52,905 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగిందని, వచ్చే ఫిబ్రవరి చివరినాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 1 =