మూడు రాజధానులకు ఇది సమయం కాదు, రైతుల పక్షాన పోరాడతాం – పవన్ కళ్యాణ్

3 capitals Act, Andhra Pradesh, Andhra Pradesh Latest News, Andhra Pradesh three-capital bills, AP 3 Capitals, AP 3 capitals News, AP News, CRDA Repeal Act, Janasena President, Janasena President Pawan Kalyan, pawan kalyan, Pawan Kalyan Responds Over 3 Capitals

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. మూడు రాజధానులకు ఇది సమయం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు.

“ప్రజలను కోవిడ్ మహమ్మారి పీడిస్తున్న నేపథ్యంలో మూడు రాజధానులపై నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని జనసేన అభిప్రాయపడుతోంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్, చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ ను సుమారు మూడున్నర వేల ఎకరాలలోనే నిర్మించారు. అమరావతిని కూడా అంతే విస్తీర్ణంలో నిర్మించాలని అనేకమంది నిపుణులు చెప్పిన మాటలను నాటి తెలుగుదేశం ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. 33 వేల ఎకరాలను సమీకరించింది. కొత్త రాజధానిగా ఆవిర్భవిస్తున్న అమరావతిని అద్భుతమైన రీతిలో నిర్మించడానికి 33 వేల ఎకరాలు కావలసిందేనని నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో చాలా గట్టిగా మాట్లాడారు. ఈ మెగా రాజధానిని తరువాత వచ్చే ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది కేవలం జనసేన మాత్రమే. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని చెప్పినది కూడా జనసేన పార్టీ మాత్రమే. మూడు పంటలు పండే సారవంతమైన భూములలో భవంతుల నిర్మాణం అనర్ధదాయకమని చెప్పినది కూడా జనసేన పార్టీ యేనని” పవన్ కళ్యాణ్ అన్నారు.

“కేవలం మూడున్నర వేల ఎకరాలకు రాజధానిని పరిమితం చేసి, ఆపై రాజధాని సహజసిద్ధ విస్తృతికి అవకాశం కల్పిచి ఉన్నట్లయితే ఇప్పుడు రైతులు కన్నీరు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడేది కాదు. పెద్దలు, సీనియర్ రాజకీయవేత్త వడ్డే శోభనాద్రీశ్వర రావు చెప్పినట్లు గత ప్రభుత్వం నేల విడిచి సాము చేసింది. దానికి నాడు ప్రతిపక్షంలో ఉన్న వై.ఎస్.ఆర్.సి.పి. వంత పాడింది. రెండు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన తరుణంలో ఉత్పన్నమయ్యే రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తాము. రైతులకు ఏ విధమైన అండదండలు అందించాలో ఈ సమావేశంలో దృష్టిపెడతాం. రైతుల పక్షాన జనసేన తుదికంటూ పోరాడుతుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ప్రస్తుతం రోజుకు పది వేల కోవిడ్ కేసులు నమోదు అవుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని భయాందోళనతో వున్నారు. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటుపై కాకుండా కోవిడ్ నుంచి ప్రజలను రక్షించడానికి రాష్ట్ర మంత్రివర్గం, ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి కేంద్రీకృతం చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నానని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 13 =