2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, AP Political Updates 2020, BJP-Janasena Alliance, Mango News Telugu, Pawan Kalyan Kanna Lakshminarayana Press Meet, Pawan Kalyan Latest News

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇకపై జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ముందుగా విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ హోటల్‌లో గురువారం ఉదయం జనసేన, బీజేపీలకు చెందిన కీలక నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, పొత్తు, ఇతర అంశాలపై దాదాపు మూడుగంటలకు పైగా కీలకంగా చర్చించారు. భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు నిర్ణయాలను వెల్లడించారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తమతో కలిసి పనిచేసేందుకు, ఎలాంటి షరతులు లేకుండా పవన్‌ కళ్యాణ్ ముందుకొచ్చారని చెప్పారు. రెండు పార్టీలూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించడమే లక్ష్యంగా, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, అమిత్ షా సూచనల మేరకు రెండు పార్టీలు కలిసి ముందుకు వెళతాయని అన్నారు. అలాగే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకించాలని ఇరుపార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని కన్నా ప్రకటించారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ, బీజేపీ అండదండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత అవసరమని చెప్పారు. ఏపీ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చామని స్పష్టం చేశారు. కలిసి పోరాటం చేసే అంశంపై గత కొన్ని నెలలుగా బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతూ వచ్చానని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని, ప్రతీ నెలకోసారి పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకు నడుస్తామని వెల్లడించారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. రాజధాని విషయంలో రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. మెజారిటీ ఉందని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు రాజధానిని మారుస్తామంటే కుదరదని, లీగల్ గా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కేవలం ఒక్క హైకోర్టు ఇచ్చినంత మాత్రాన కర్నూలుకు రాజధాని వచ్చినట్లు కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పాలెగాళ్ళ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. బీజేపీతో కలిసేందుకు ఎలాంటి షరతులు విధించలేదని, 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =