ఎర్రబాలెంలో రైతుల దీక్షలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు

మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత గ్రామాల రైతులు గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకలకు సైతం దూరంగా ఉంటూ అమరావతిని రాజధానిగా కొనసాగించేవరకు దీక్షలు విరమించేదని రైతులు స్పష్టం చేశారు. రాజధాని అమరావతి కోసం రైతుల ఆందోళనలు చేస్తుండడంతో వారికీ మద్దతుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. అంతేగాక ఈ రోజు ఆయన సతీమణి భువనేశ్వరితో పాటుగా ఎర్రబాలెంలో రైతుల దీక్షలో పాల్గొని వారికీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, మహిళలు వారి సమస్యలను చంద్రబాబుకు వివరించారు.

రైతుల దీక్షలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, నూతన సంవత్సరం సమయంలో ఆనందంగా కుటుంబంతో గడపాల్సిన సమయంలో రైతులు రోడ్లపైకి వచ్చి దీక్షలు చేస్తుండడం చూస్తుంటే బాధేస్తోందని చెప్పారు. రైతులు భూములు ప్రాణసమానంగా చూసుకున్నామని, రాజధాని కోసం భూమిని త్యాగం చేసి ఇలా ఇబ్బందిపడుతుంటే ఆవేదన కలుగుతుందని చెప్పారు. ప్రపంచమంతా తిరిగి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొచ్చానని అన్నారు. రైతుల పోరాటానికి టీడీపీ మద్దతుగా ఉంటుందని ధైర్యం చెప్పారు. నారా భువనేశ్వరి మాట్లాడుతూ తోటి మహిళగా ఇక్కడ మహిళలు పడుతున్న బాధను అర్థం చేసుకున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలోకి తెచ్చేందుకు చంద్రబాబు నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + fourteen =