ఏపీలో సిద్ధం.. తెలంగాణ‌లో మాట‌ల యుద్ధం..

AP, Telangana, CM Jagan, CM Revanth reddy, KCR, Telangana Assembly Session, War Of Words In Telangana Assembly, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, andhra pradesh, Mango News Telugu, Mango News
AP, Telangana, CM Jagan, CM Revanth reddy, KCR

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధం పేరుతో స‌భ‌లు పెడుతూ జ‌నాల్లో తిరుగుతున్నారు. టీడీపీ – జ‌న‌సేన కూట‌మిని ఎదుర్కోవ‌డానికి త‌మ పార్టీ సిద్ధం అని.. సింగిల్ గానే పోరాడి గెలిచి తీరుతామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ పై త‌న‌దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మ‌రోవైపు టీడీపీ నుంచి చంద్ర‌బాబునాయుడు, నారాలోకేశ్‌, జ‌న‌సేన నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌గ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టితీరుతామ‌ని శ‌ప‌థం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఏపీ రాజ‌కీయాలు ఇలా ఉంటే.. ఎన్నిక‌లు పూర్త‌యి మూడు నెల‌లు కూడా కాక‌ముందే తెలంగాణ‌లో మాట‌ల యుద్దాలు తీవ్ర‌స్థాయికి చేరుకుంటున్నాయి. ప్యాంటులు నుంచి అంగీలు ఇప్పే వ‌ర‌కూ ఆగ‌డం లేదు. అసెంబ్లీలోనూ బ‌య‌టా కూడా కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దాలు న‌డుస్తున్నాయి.

కోటి ఎకరాల మాగాణం అంటూ కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టుగా ప్ర‌చారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపైనే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫోకస్ పెట్టింది. కృష్ణాబోర్డు విషయంలో కొత్త ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు కేసీఆర్ వ్యూహం ర‌చిస్తున్నారు. మ‌రో ఉద్యమం పేరుతో ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు. గ‌త ప్ర‌భుత్వం క‌ట్టిన ప్రాజెక్టుల్లోని బొక్కలు బయటకు తీసి.. లెక్కలు తేలుస్తానంటూ రేవంత్‌ రెడ్డి బయలుదేరారు. ఎమ్మెల్యేల‌తో నేరుగా ప్రాజెక్టు వ‌ద్ద‌కే వెళ్లి అక్క‌డే బండారం బ‌య‌ట‌పెట్టారు. మొత్తం మీద రెండు పార్టీల హోరాహోరీకి రెడీ అవ్వడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. నువ్వు కృష్ణా ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నావు.. అని కేసీఆర్ అంటే.. నువ్వు గోదావరి ప్రాజెక్టుల్లో ఆల్రెడీ అన్యాయం చేసేశావ్  అని రేవంత్ అంటున్నారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం అని బీఆర్‌ఎస్ వాళ్లు మీటింగ్ తలపెడితే..  రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించి ఆ హక్కుల కాలరాసింది మీరే అంటూ కాంగ్రెస్ వాళ్లు తగులుకుంటున్నారు. ఫలితంగా డ్యాముల్లో నీళ్లకు బదలు నిప్పులు పారుతున్నట్లైంది పరిస్థితి.

మ‌రోవైపు అసెంబ్లీ స‌మావేశాల్లోనూ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు న‌డుస్తున్నాయి. ‘‘ కాళేశ్వరం, కృష్ణాజలాలకు సంబంధించి చర్చించుకుందాం అని నిర్ణయం తీసుకున్నాం. రైతులు, తెలంగాణ ప్రజల పై గౌరవం ఉంటే ఆ ప్రాజెక్టులను పరిశీలించి పరిష్కరించేందుకు  అవకాశం ఉండేది. కానీ అక్కడకు  రాకుండా ఉండటమే కాకుండా కొత్తగా వచ్చిన ప్రభుత్వం తప్పు చేసినట్లు మాట్లాడటం మంచిది కాదు. కేసీఆర్‌ మాజీ సీఎంగా, కేంద్రమంత్రిగా, ఎంపీగా, తదితర ఎన్నో బాధ్యతలు నిర్వహించానని జబ్బలు చరచుకునే   ఆయన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని.. ఏం పీకనీక  పోయినవ్‌ అంటారా ? రాష్ట్రప్రజలు  ఇప్పటికే నీ ప్యాంట్‌ ఊడబీకిండ్రు. చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్ల పడితే బొక్కలిరిగినయ్‌ అయినా బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకనీక పోయినవ్‌ అంటారా ?  ఇదేనా తెలంగాణ సంప్రదాయం. సభకు రాకుండా పారిపోయి,  సీఎంను పట్టుకొని  ఇలా వ్యాఖ్యానించడం సబబా ? నల్లగొండలో సంపుతరా అని కేసీఆర్‌ అన్నారు.ఇప్పటికే సచ్చిన పామును  మళ్లీ సంపుతామా? మీరు అవినీతికి పాల్పడకపోతే.. కేవలం రెండు మూడు పిల్లర్లే కూలిపోతే కేసీఆర్‌ను  సభలోకి రమ్మనండి. చర్చకు ప్రభుత్వం రెడీగా ఉంది. అక్కడకు పోయి మాట్లాడే బదులు ఇక్కడకు రమ్మనండి. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రానికి మా ప్రభుత్వం రెడీగా ఉంది. ఆ సందర్బంగా నైనా మాట్లాడండి.లేదా  కాళ్వేరంపై చర్చకైనా రెడీ‘‘ అని రేవంత్ రెడ్డి విరుచుకుప‌డ్డారు.

తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్‌ ఆనవాళ్లు తుడపలేరు. జాతిపితగా కేసీఆర్‌ ఉంటారు. హైటెక్‌సిటీని చంద్రబాబు, ఔటర్‌ రింగ్‌రోడ్డును వైఎస్‌ రాజశేఖరరెడ్డి కట్టారంటారు.అలాగే అంబేద్కర్‌ భారీ విగ్రహం, అమరవీరుల స్థూపం వంటివాటిని కేసీఆర్‌ కట్టారు. కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్‌ను ప్రభుత్వ చిహ్నంలో తొలగించడం సబబు కాదు. కాకతీయులు వ్యవసాయ, నీటిపారుదల  రంగాన్ని అభివృద్ధి చేశారు. గొలుసుకట్ట చెరువులు నిర్మించారు. వారివల్లే ఇప్పటికీ చెరువులున్నాయి. వారు కట్టిన కళాతోరణాన్ని తొలగిస్తారా ? చార్మినార్‌ను ఎందుకు తొలగిస్తారు. నగరంలో వచ్చిన కలరా వల్ల ఉపాధి పోయింది. అలాంటి వారందరికీ ఉపాధి కల్పించేందుకు మృతులకు స్మృతి చిహ్నంగా నిర్మించారు.. అంటూ కేసీఆర్ చేసిన ప‌నుల‌ను హైలెట్ చేస్తూ బీఆర్ ఎస్ నేత‌లు స‌భ‌లో స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మేము తప్పు మాట్లాడినా మంత్రులు సరిచేయాలి కానీ మేం 39 మంది. వారు 64 మంది. మా వాళ్లడిగితే మైకు రావడం లేదు. వారెప్పుడు అడిగినా మైక్‌  ఇస్తున్నారు. అంతేకాదు మీరే వారిని మోటివేట్‌ చేస్తున్నారు… అంటూ మంత్రి కేటీఆర్ అంటున్నారు. అంతేకాదు.. ప్ర‌భుత్వం త‌మ‌ను మాట్లాడ‌కుండా చేస్తోందంటూ అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ధ‌ర్నాకు కూడా దిగారు.

అసెంబ్లీలోను, బ‌య‌ట కూడా ఇరు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. ఓ వైపు కృష్ణా ప్రాజెక్టులపై దాడి కొనసాగిస్తూనే రేవంత్ పాత అస్త్రాన్ని బయటకు తీశారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ను టార్గెట్  చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడంతో బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఏ ప్రాజెక్టు గురించైతే బీఆర్‌ఎస్ ఘనంగా చెప్పుకుందో.. అదే తెలంగాణ తలమానికం అని చాటుకుందో దానినే దెబ్బతీసేందుకు రేవంత్ యత్నించారు. ఓ వైపు రేవంత్ మీటింగ్ జరుగుతుండగానే మేడిగడ్డలో “మీరేం తేలుస్తారు.. నేను మీ అందరి సంగతి తేలుస్తా”  అంటూ కేసీఆర్ నల్లగొండ నుంచి హుంకరించారు. ఎవ‌డ్రా కేసీఆర్ ను ఆపేది అంటూ తీవ్ర‌స్థాయిలో గ‌ర్జించారు. మొత్తంగా మూడు నెల‌లు కూడా కాక‌ముందే తెలంగాణ‌లో రాజ‌కీయాలు హీటెక్కాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 10 =