తెలంగాణ వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడుతాం: సీఎం కేసీఆర్

Allocate 50:50 Krishna water for AP TS, AP-TS Water Disputes, CM KCR Held High Level Review Meeting on Irrigation Department, CM KCR Review, CM KCR Review on Irrigation Department, Irrigation Department, KCR High Level Review meeting, Krishna Water Disputes Tribunal, Mango News, Telangana AP Water Disputes, Telangana Chief Minister, Telangana will start using 50% water in Krishna, Water Disputes, water disputes between Andhra and Telangana

నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకుండా, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వున్నప్పటికీ కృష్ణా నదిపై ఆంధ్ర ప్రదేశ్ నిర్మిస్తున్న చట్టవ్యతిరేక పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తీర్మానించింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చట్టవ్యతిరేకంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీం సాగునీటి ప్రాజెక్టులలో నీటి ఎత్తిపోతలు, తెలంగాణలో జల విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై శనివారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

తెలంగాణ వ్యవసాయం కోసం, రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడుతాం:

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘ప్రకృతి రీత్యా తెలంగాణ భూభాగం సముద్ర మట్టానికి ఎగువన ఉన్నది. చుట్టూ నదులు ప్రవహిస్తున్నా కూడా గ్రావిటీ ద్వారా సాగునీటిని తీసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో లిఫ్టులను ఏర్పాటు చేసుకొని, నీటిని ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితి తెలంగాణ ఉంది. దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన వలస పాలకులు ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తద్వారా తెలంగాణ వ్యవసాయాన్ని దండుగలా మార్చి, తెలంగాణ రైతులకు అన్యాయం చేసిండ్రు. పోరాటం చేసి సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధమ ప్రాధాన్యతగా కాళేశ్వరం వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాగునీటి గోసను తీర్చింది. దీంతో అత్యధిక దిగుబడులతో తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే అన్నపూర్ణగా నిలిచింది. ఇదంతా కూడా లిఫ్టుల ద్వారా నదీజలాలను ఎత్తిపోయడం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులను నిర్మించుకోబోతున్నాం. రెండు పంటలకూ నీరందాలంటే, జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ద్వారా కేటాయించబడిన నీటిని, విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుంటాం. పలు ట్రిబ్యునల్స్ ద్వారా రాజ్యాంగబద్దంగా తెలంగాణకు కేటాయించబడిన నదీ జలాలను సాగునీటికోసం వాడుకోవడంతోపాటు, సాగునీటిని ఎత్తిపోసుకోవాల్సిన అనివార్యతను అధిగమించడానికి కావాల్సిన జల విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా తప్పకుండా కేటాయించబడిన నీటిని వినియోగించుకుంటాం. ఇదే విషయాన్ని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది కూడా. దీనికి వ్యతిరేకంగా ఎవరి అభిప్రాయాలనూ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోదు. తెలంగాణ వ్యవసాయం కోసం, రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడుతాం’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

నదీ జలాలమీద తన పొరుగు రాష్ట్రాలకు కేటాయించబడిన వాటాలను హక్కుగా వినియోగించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుందని, అయితే కేటాయింపులు లేని నికర జలాలను దౌర్జన్యంగా వాడుకుంటామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోబోరని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. దశాబ్దాలపాటు తెలంగాణ సాగునీటికి గోస పడ్డదనీ, స్వయంపాలనలోనూ అటువంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితిలో రానివ్వబోమన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏండ్లు కావస్తున్నా, తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటివాటాను నిర్ధారించకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బేసిన్ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతనే, ఇంకా సర్ ప్లస్ వాటర్ వుంటే, అవుటాఫ్ బేసిన్ అవసరాల మీద దృష్టి పెట్టాలనేది సహజ న్యాయమన్నారు. దీన్ని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. తెలంగాణ చేపట్టిన లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల నేపథ్యంలో జల విద్యుత్ ఉత్పత్తి అవసరం పెరిగిందన్నారు. జల విద్యుత్తుతో లిఫ్టులను నడిపి తద్వారా తెలంగాణ సాగునీటిని ఎత్తిపోసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.

సాగునీటితోపాటు, సాగునీటిని ఎత్తిపోసుకునేందుకు జలవిద్యుత్ ఉత్పత్తిని కూడా తెలంగాణకు కేటాయించిన నీటి ద్వారానే జరుపుకుంటుందని, ఇందులో ఎవరూ అభ్యంతరం తెలపడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ట్రిబ్యునళ్ల ముందు, కేఆర్ఎంబీ వంటి బోర్డుల ముందు, న్యాయస్థానాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ తెలంగాణ ప్రభుత్వం తన వాణిని వినిపిస్తుందన్నారు. ‘‘తెలంగాణలో ఆంధ్రా మాదిరిగా కాలు అడ్డం పెట్టుకొని నీళ్లు పారించుకునే పరిస్థితి లేదు. నీటిని లిఫ్టుల ద్వారా ఎత్తి పోసుకోవాలె. తెలంగాణలో 30 లక్షలకు పైగా బోరు మోటార్లున్నాయి. తెలంగాణ మొత్తం విద్యుత్తులో 40శాతం విద్యుత్తు సాగునీటి అవసరాలకే వినియోగించబడుతున్నది. తెలంగాణకున్న భూపరిస్థితుల దృష్ట్యా సాగునీరే కాదు, విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా నీరు అవసరం” అని సీఎం వివరించారు.

“ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పోతిరెడ్డిపాడుకు వరద జలాలను మాత్రమే వాడుకుంటామని అసెంబ్లీలో, అసెంబ్లీ బయట అనేకసార్లు ప్రకటించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కూడా నాడు అదే విషయం చెప్పారు. నేడు మాట మార్చి పోతిరెడ్డిపాడు పేరుతో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తామంటే తెలంగాణ ప్రజలు సహించబోరు’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సంయమనంతో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో చర్చలు జరిపి, వారికి ఇబ్బంది లేని విధంగా, సహకరిస్తూ నిర్మాణం చేసిందని, ఇదే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అవలంబించేందుకు తమ స్నేహ హస్తం సాచినామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అయినా వారు పెడచెవిన పెట్టడం పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమావేశం చేసిన తీర్మానాలు:

  • పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక, అక్రమ ప్రాజెక్టు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. పోతిరెడ్డి పాడు కాలువకు నీటిని ఎత్తిపోసే రాయలసీమ లిప్టు ఇరిగేషన్ స్కీం కూడా అక్రమ ప్రాజెక్టే.
  • కృష్ణా జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఎన్ బ్లాక్ అలొకేషన్స్ చేసినా, వాటిని నికర జలాల కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి. జులై 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహించబోయే త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలి. జులై 20 తర్వాత పూర్తిస్తాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలి.
  • పోతిరెడ్డిపాడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని అనుమతించబోమని, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేఆర్ఎంబీ సమావేశంలో తమ వాదనలను వినిపించాలని సమావేశం తీర్మానించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ ఎజెండా అంశాలను కెఆర్ఎంబీకి వెంటనే తెలపాలని నిర్ణయించింది.
  • ఆంధ్రా-తెలంగాణ నడుమ 66:34 నిష్పత్తిలో ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల వినియోగాన్ని సమావేశం తిరస్కరించింది. కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీల నికర జలాల కేటాయింపుల్లో ఆంధ్ర తెలంగాణ చెరి సగం అనగా, 405.5 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపేదాకా వినియోగించుకోవాలి.
  • రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాలి. విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కేఆర్ఎంబీకి లేదు. జల విద్యుత్ కు సంబంధించి ఇరు రాష్ట్రాల నడుమ ఎటువంటి ఒప్పందాల నిబంధనలు లేవు.
  • పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను వృథాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నదనే ఏపీ ప్రభుత్వ దుష్ప్రచారాన్ని సమావేశం తిప్పికొట్టింది.
  • పులిచింతల నుంచి విడుదలైన నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి తమ కృష్ణా జిల్లా అవసరాలను తీర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ కు సూచించింది. తద్వారా పట్టిసీమ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వినియోగించే విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని సమావేశం ఆంధ్రా ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.
  • సాగునీటిని ఎత్తిపోయడమే కాకుండా, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, మిషన్ భగీరథ అవసరాలకు రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఎంతగానో ఉన్నదని, ఈ నేపథ్యంలో ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొని చట్టబద్దంగా తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని సమావేశం స్పష్టం చేసింది.
  • థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నదని, ఈ నేపథ్యంలో 51% ‘క్లీన్ ఎనర్జీని’ ఉత్పత్తి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు విడుదల చేసిన మార్గదర్శకాలను, జల విద్యుత్ ఉత్పాదన ద్వారా తెలంగాణ రాష్ట్రం అమలు పరుస్తున్నదని, ఇక ముందు కూడా కొనసాగించాలని సమావేశం తీర్మానించింది.
  • విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ప్రత్యేకమైన శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటిని వాడుకుంటుంటే, విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఆంధ్రా ప్రభుత్వం కెఆర్ఎంబీకి ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదం అని సమావేశం అభిప్రాయపడింది.
  • పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిప్టు ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని గ్రీన్ ట్రిబునల్ స్టే ఇచ్చినా స్టేని ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైల్లో వేస్తామని ఎన్జీటీ ప్రకటించిందని అయినా మొండిగా సర్వేల ముసుగున పోతిరెడ్డి పాడు వద్ద పెద్ద ఎత్తున నిర్మాణ సామాగ్రిని డంప్ చేసి నిర్మాణాలు చేపట్టడం అన్యాయమని సమావేశం అభిప్రాయపడింది.
  • జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని వదిలి, చెరువులను, కుంటలను నింపాలని సమావేశం నిర్ణయించింది. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న సమ్మక్క బ్యారేజీ సహా సీతమ్మసాగర్ ప్రాజెక్టులను, ఇరిగేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులుగా పిలువాలని సమావేశం తీర్మానించింది.
  • శ్రీశైలం డ్యామ్ మీద తెలంగాణ భూభాగంలోకి గుర్తింపు కార్డులున్న విద్యుత్ ఉద్యోగులను తప్ప, వేరెవరినీ అనుమతించవద్దని, శ్రీశైలం సహా కృష్టా ప్రాజెక్టుల వద్ద పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
  • కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి, తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి రాజీలేని పోరాటం ఎంతవరకైనా కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, జెన్కో డైరక్టర్ (హైడల్) వెంకటరాజం, అడ్వకేట్ జనరల్ ప్రసాద్, అధనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సాగునీటిశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − four =