విధుల్లో చేరమంటూ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెప్పిన సీఎం కేసీఆర్

CM KCR Takes Back 48000 TSRTC Employees, KCR About TSRTC Strike, KCR Hiked Ticket Prices, Mango News Telugu, Political Updates 2019, RTC Ticket Price Hiked, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSRTC Latest News

తెలంగాణలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం 52 రోజుల పాటు సమ్మె చేపట్టిన అనంతరం విధుల్లోకి చేరుతామని ప్రకటించిన ఆర్టీసీ కార్మికులుకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు తిరిగి అవకాశమిస్తున్నామని, శుక్రవారం ఉదయం అందరూ విధుల్లో చేరాలని ఆదేశాలిచ్చారు. కార్మికులు విధుల్లో చేరేందుకు ఎటువంటి షరతులు విధించడం లేదని చెప్పారు. గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆర్టీసీ అంశంపైనే కీలకంగా చర్చించింది. మంత్రివర్గం సమావేశమనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించి పలు వివరాలను వెల్లడించారు.

యూనియన్‌ నాయకుల కారణంగానే ఆర్టీసీ కార్మికులు నష్టపోయారని చెప్పారు. ఈ సమ్మెకు ఆర్టీసీ యూనియన్లదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు. భాజపా, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా ఆర్టీసీని విలీనం చేయలేదు. తెలంగాణలో మాత్రం విలీనం చేయాలని కోరుతున్నారు. విపక్ష నాయకులు ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టించారని అన్నారు. కార్మికుల సమ్మె చట్టవిరుద్ధం, ఈ విషయం లేబర్‌ కోర్టు డిక్లేర్‌ చేయాల్సిన అవసరంలేదు. సమ్మెపై లేబర్‌ కోర్టుకు వెళ్లమని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం భావిస్తే సమ్మెను లేబర్‌ కోర్టుకు పంపగలదని, అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు కోల్పోతారని, కానీ తాము అలా చేయడం లేదని తెలిపారు. కార్మికుల సమ్మె పట్ల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే సానుభూతి చూపించారని, సానుభూతితో కార్మికులను ఆదుకోవాలని కోరారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆర్టీసీకి తాత్కాలికంగా రూ.100 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే కిలోమీటరుకు 20 పైసలు పెంచితే ఏడాదికి రూ.750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని, సోమవారం నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రైవేటు రూట్లకు పర్మిట్లు ఇవ్వాలనుకున్న విధానం వేరని, అయితే ప్రతిపక్షాలు ఈ అంశంపై దుష్ర్పచారం చేశాయని అన్నారు. ఆర్టీసీలో ఎవరైనా ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకుంటే, వాళ్ళకే నలుగురైదుగురికి కలిపి ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలనే గొప్ప ఆలోచన చేశామని, అయినా బస్సుల ప్రైవేటీకరణపై ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఉందని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. ఇలా సమ్మెలు చేస్తే నష్టపోయేది కార్మికులే, ఆర్టీసీ పరిస్థితిని 49వేల మంది కార్మికులకు వివరిస్తాం. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ప్రగతిభవన్‌కు పిలిచి ఆర్టీసీ పరిస్థితిపై నేరుగా చర్చిస్తామన్నారు. ఇందులో యూనియన్లకు అవకాశం కల్పించే ప్రసక్తి లేదని చెప్పారు. తొందర్లోనే యూనియన్ల స్థానంలో ప్రతి డిపో నుంచి ఇద్దరు చొప్పున కార్మికులతో ‘వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌’ ఏర్పాటు చేసి, దానికి సీనియర్‌ మంత్రిని ఇన్‌చార్జిగా నియమిస్తాం. ప్రతి నెలా ఒక రోజున ఆర్టీసీపై సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమ్మె కారణంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. వారి కుటుంబంలో అర్హత కలిగిన వారికీ ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తాం. వెంటనే వారి కుటుంబాలకు సాయం చేస్తామని చెప్పారు. ఇన్ని రోజులు ప్రజలకు సేవలందించిన తాత్కాలిక ఉద్యోగుల విషయంలో కూడా సానుభూతితో వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 18 =