గ్రేటర్ లో బీజేపీకే జనసేన మద్దతు, పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం

GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections 2020 Nominations, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Jana Sena not fielding candidates in GHMC polls, janasena chief, janasena chief pawan kalyan, Janasena Extends Support to BJP in GHMC Elections, Janasena Out Of GHMC Polls, Mango News, pawan kalyan

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రక్షణగా నిలిచే వ్యవస్థ ఉండాలంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి, అందుకు జనసేన పార్టీ మద్దతుగా నిలుస్తుందని జనసేన పార్టీ అధక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోటీ నుంచి అభ్యర్థులను ఉపసంహరించుకొంటున్నట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ సమావేశమై జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కలసి పని చేయడంపై చర్చించారు. నాదెండ్ల మనోహర్ ఇంట్లో రెండు గంటలసేపు చర్చలు సాగాయి.

ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు:

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “విశ్వ నగరంగా హైదరాబాద్ ఎదుగుతున్న క్రమంలో పటిష్టమైన నాయకత్వం చాలా అవసరం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలు హైదరాబాద్ నగర ప్రజలకు అందాలి. విశాల దృక్పథం కలిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నగర అభివృద్ధిలో ఎంతో అండగా ఉంటుంది. కరోనా కష్ట కాలంలోనే భారీ వరదలు వచ్చాయి. నగర ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా విఫలమయ్యిందో ప్రజలు చూసారు. బిహార్ ఎన్నికలలోను, దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ వచ్చిన ఫలితాలను చూస్తే మోదీ నాయకత్వాన్ని ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో తెలుస్తుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి జనసేన, బీజేపీలు కలిసి చర్చించుకోవాలని భావించాయి. ఇంతలోనే షెడ్యూల్ వచ్చింది. ఇరు పార్టీల మధ్య పోటీ విషయంలో కొంత మేరకు గందరగోళం నెలకొంది. అయితే హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నాం. డా.లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. వారిద్దరితో విస్తృత చర్చలు సాగించాం” అని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా – పవన్ కళ్యాణ్:

“విశాల ప్రజా ప్రయోజనాలను కాంక్షిస్తూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరకూ ఆగాలని నిర్ణయించాం. భవిషత్తులోనూ కలసి పని చేస్తాం. 2008 నుంచి నాతో కలసి పనిచేసిన క్యాడర్ ఉంది. అలాగే 2014 ఎన్నికల సమయంలోను, 2019 ఎన్నికల్లోనూ పార్టీ వెంట ఉన్న క్యాడర్ ఉంది. వారు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. వారు కొంత మేరకు నిరుత్సాహానికి లోనవుతారు. అయితే విస్తృత ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఇది. విభజన రాజకీయాలు ఉండకూడదు. నగర ప్రజలశ్రేయస్సు, వారి రక్షణను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన నాయకత్వం రావాలని కోరుకున్నాం. మతాలూ, ప్రాంతీయ విభజనలు ఆస్కారం లేని విధంగా ఆ వ్యవస్థ ఉండాలి. ఆ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ మేయర్ గా బీజేపీ అభ్యర్థిని గెలిపించేలా జనసేన పార్టీ మద్దతు తెలుపుతుంది. ఒక్క ఓటు కూడా బయటకు పోకూడదు. ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. డా.లక్ష్మణ్ ప్రచార కమిటీ బాధ్యతలు చూస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎన్నో బాధ్యతలు ఉన్నా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ఇరుపార్టీలు కలిసి పనిచేయడంపై సమన్వయంతో ముందుకు వెళ్తాం. మీరంతా మద్దతు తెలపండి. నేనూ ప్రచారంలో పాల్గొంటాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =