ఇంజక్షన్ లు, వాక్సిన్, ఆక్సిజన్ కేటాయింపులో కేంద్రం వివక్ష : మంత్రి ఈటల రాజేందర్

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Eatala Rajender, Eatala Rajender held a Press Meet over Covid-19 Situation, Eatala Rajender Press Meet over Covid-19 Situation, Mango News, Minister Eatala Rajender, Minister Eatala Rajender held a Press Meet over Covid-19 Situation, Minister Eatala Rajender held a Press Meet over Covid-19 Situation in the State, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Health Minister, Telangana Health Minister Eatala Rajender

ఇంజక్షన్ లు, వాక్సిన్, ఆక్సిజన్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గురువారం నాడు ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. “కరోనా దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతుంది. మొదటి వేవ్ లో విజయవంతంగా ఎదుర్కొన్నాము. రెండవ వేవ్ సందర్భంగా ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో ఇతర రాష్ట్రాల సీఎంల మాట్లాడిన తీరు చూసి సీఎం కేసీఆర్ ముందుజాగ్రత్త పడాలని సూచించారు. పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఏపీ, కర్ణాటకలలో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున సమాయత్తం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ ప్రకారమే 4 లక్షల రెమెడెసీవీర్ ఇంజక్షన్ లకు ఆర్డర్ పెట్టాము. మన దగ్గరే ఇవి తయారు అవుతున్నాయి కాబట్టి మనకు ఎక్కువ డోసులు వస్తాయి అని ఆశించాము. కానీ కేంద్రం మొత్తం పంపిణీ వ్యవస్థను తమ కంట్రోల్ లోకి తీసుకొని తెలంగాణకు మొండి చెయ్యి చూపించింది. తెలంగాణలో మహారాష్ట్ర, ఏపీ, చత్తీస్ ఘడ్ పేషంట్లు ఎక్కువ మంది వచ్చి చేరుతున్నారు అని కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ కు చెప్పినా కూడా స్పందన లేదు” అని పేర్కొన్నారు.

ఆక్సిజన్ కొరత ఏర్పడితే దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది:

“4 లక్షల రెమెడెసీవీర్ ఇంజెక్షన్లు కోసం ఆర్డర్ పెడితే గత 10 రోజుల్లో కేంద్రం ఇచ్చింది 21,551 మాత్రమే. అదే గుజరాత్ కి 1.63 లక్షలు, మహారాష్ట్రకి 2 లక్షలు, ఢిల్లీకి 61 వేలు, మధ్యప్రదేశ్ కి 92 వేల ఇంజెక్షన్లు ఇచ్చారు. కేంద్రం చూపిస్తున్న ఈ వివక్ష పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి విపత్కర సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు పోవాల్సింది పోయి ఇలా చేయడం బాధ కలిగిస్తుంది. రాజకీయాలను పక్కన పెట్టీ మాకు ఇంజెక్షన్లు కేటాయించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కు లేఖ రాస్తున్నాం. ఆక్సిజన్ మన దగ్గర తయారు కాదు. బళ్ళారి, విశాఖ, ఇతర రాష్ట్రాల నుండి రావాలి. దగ్గర ఉన్న ప్లాంట్ నుండి కాకుండా 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరిస్సా నుండి ఇచ్చారు. చెన్నై నుండి 20 టన్నులు, పెరంబడూర్ లో 35 టన్నులు కేటాయించారు కానీ తమిళనాడు వాళ్ళు ఇచ్చేది లేదు అని ఎగ బెట్టారు. అందుకే విశాఖ నుండి కేటాయించాలని కోరినాం. కేటాయింపులు మార్చకపోతే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

“ఆక్సిజన్ కోసం నాతో సహా మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నాం కాబట్టే మన దగ్గర ప్రభుత్వ ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ టాంక్ లు ఉన్న దగ్గర ఇబ్బంది రావడం లేదు. సిలెండర్ ల విషయంలో కొంత కొరత ఉంది, కొంతమంది కావాలని కొరత సృష్టిస్తున్నాయి అని మా దృష్టికి వచ్చింది, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నవారు అయినా ప్రజలే, వివక్ష చూపవద్దు అని కేంద్రాన్ని కోరుతున్నామని మంత్రి అన్నారు. మా దగ్గర తయారయిన ఇంజెక్షన్లు, వాక్సిన్ లు మేమే వాడుకుంటాం అని చెప్ప వచ్చు కానీ మేము అంత సంకుచితంగా లేము. కరోనా నియంత్రణ వాక్సిన్ ద్వారానే అని తెలిసినప్పుడు ముందుగానే ఉత్పత్తి పెంచాల్సింది. కానీ కేంద్రం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు వ్యవహరించింది. మనం ఇచ్చిన సలహాలు సూచనలు పక్కన పెట్టింది. ముందే స్పందించి ఉంటే ఈ రోజు ఈ పరిస్తితి వచ్చేది కాదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మన దగ్గర ఉన్న అన్ని కంపెనీలతో వాక్సిన్ ప్రొడక్షన్ పెంచమని కోరినాం, కానీ వాటిని కేంద్రం నియంత్రించింది. ఇప్పటికైనా కేంద్రం స్పందించి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఆక్సిజన్, రెమెడెసీవీర్, వాక్సిన్ లు పంపిణీ చేయాలి, జఠిలం చేయవద్దు. మా కమిట్మెంట్ కి కేంద్రం తోడు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని మంత్రి పేర్కొన్నారు.

అవసరం అయితే రోజుకీ 2 లక్షల పరీక్షలు కూడా చేస్తాం:

“104 కేంద్రాల్లో 30 వేల ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేస్తున్నాం. మిగిలినవి అన్నీ రాపిడ్ చేస్తున్నాం. అవసరం అయితే రోజుకీ 2 లక్షల పరీక్షలు కూడా చేస్తాం. రాపిడ్ లో పాజిటివ్ అని వస్తే కచ్చితంగా పాజిటివ్ కాబట్టి లక్షణాలు లేని వారు అందరూ హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేయించుకోవాలి, ఏం కాదులే అని ఇంట్లో ఉంటే వారికి వైరస్ తీవ్రత ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు వెంటిలేటర్ దొరకడం, దొరికిన బ్రతకడం కష్టం అవుతుంది. కాబట్టి తాత్సారం చేయవద్దు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా చికిత్స అందించేందుకు 1120 హాస్పిటల్స్ కు అనుమతి ఇచ్చాము. ఈ ఆసుపత్రులు కొంతమందిని చివరి క్షణంలో గాంధీకి పంపిస్తున్నారు, అలా పంపించవద్దు. కొంత మంది కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు డబ్బులు కట్టలేని వారిని చివరి దశలో గాంధీకి పంపిస్తున్నారు. ఇలా ఈ సమయంలో శవాల మీద పేలాలు ఏరుకునే లాగా వ్యవహరించవద్దు. ఆక్సిజన్ ను, మందులను బ్లాక్ లో అమ్మవద్దు. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చాము” అని తెలిపారు.

గాంధీ ఆసుపత్రిలో 600 మంది కరోనా పేషంట్స్:

“చివరి నిమిషంలో గాంధీకి పంపించడం వల్ల అక్కడ వెంటిలేటర్ బెడ్ కి ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రస్తుతం 600 మంది పేషెంట్లు వెంటిలేటర్ మీద ఆక్సిజన్ మీద ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రమే ఆక్సిజన్ ఫెసిలిటీ ఉన్న బెడ్స్ ఏర్పాటు చేసాము. ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత లేదు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీఎస్ ఆధ్వర్యంలో 10 మంది ఐఏఎస్ అధికారుల బృందం ఆక్సిజన్ సప్లై, ఇంజెక్షన్ ల పంపిణీ, వ్యాక్సినేషన్ పంపిణీపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. తెలంగాణ, దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సమర్థవంతంగా పని చేస్తుంది. ప్రజలు కూడా ఈ సమయంలో సహకరించాలి. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు. పట్టణ ప్రాంతంలో ఎక్కువగా కేసులు వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పూర్తిస్థాయిలో పని చేస్తుంది. ప్రజలు అనవసరంగా బెంబేలెత్త వద్దు” అని చెప్పారు.

“తెలంగాణ రాష్ట్రంలో నమోదు అవుతున్న కేసుల సంఖ్యను బట్టి ఇక్కడికి ఇంజక్షన్లు కేటాయింపు కాకుండా, అంతర్జాతీయ పేషెంట్లు, వివిధ రాష్ట్రాల పేషెంట్ కూడా హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో ఎక్కువ ఇంజక్షన్లు , ఆక్సిజన్ కేటాయించాలని మరోసారి కేంద్రాన్ని కోరుతున్నాము. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను కేంద్రానికి 150 రూపాయలకు, రాష్ట్రాలకు నాలుగు వందల రూపాయలకు , ప్రైవేటు ఆసుపత్రులకు ఆరు వందల రూపాయలకు ఇవ్వడం కరెక్ట్ కాదు. దేశ ప్రజలందరికీ కాపాడే బాధ్యత కేంద్రం మీద ఉంది. రేట్లలో ఇంత వ్యత్యాసం ఉంటుందా? ఈ సమయంలో ఇలా వ్యవహరించవచ్చా? కేంద్రం సంకుచితంగా ఆలోచించవద్దు” అని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fourteen =