ఇప్పటికి 3 లక్షల మంది వరద బాధితులకు రూ.300 కోట్లు అందించాం: మంత్రి కేటిఆర్

Hyderabad Rains, Hyderabad Rains Effected People, Hyderabad Rains Effected Victims, Hyderabad Rains Relief Measures, KTR, KTR On Relief Works in Hyderabad, Minister KTR, Minister KTR High Level Meeting, Minister KTR Level Meeting, Relief Works in Hyderabad

హైదరాబాద్ నగరంలో గత వందేళ్ల చరిత్రలో ఎప్పుడు చూడనంతగా వచ్చిన భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలలో వారంరోజుల లోపే మామూలు పరిస్థితులు ఏర్పడే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన పునరుద్ధరణ, సహాయక చర్యలపై బుధవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల నాలుగు లక్షల మంది తీవ్రంగా ప్రభావితం అయ్యారని చెప్పారు. వీరందరికీ ఒక్కొక్కరికీ పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు రూ.400 కోట్లను విడుదల చేయగా, నేటి వరకు మూడు లక్షల మందికి మూడు వందల కోట్ల రూపాయలను అందించామని వివరించారు. వీటితో పాటు 37000 డ్రై రేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వర్షాల వల్ల నష్టపోయి, పరిహారం లభించని వారు సంబంధిత జీహెచ్ఎంసి అధికారులకు తగు ఆధారాలతో కూడిన ఫొటోలతో సహా వివరాలను అందించాలని తెలియజేశారు. నగరంలో 1572 ప్రాంతాలు వర్షాల వల్ల తీవ్రంగా ప్రభావితం కాగా వీటిలో 230 కాలనీలు, బస్తీలు పూర్తిగా నీట మునిగామని తెలిపారు.

మరోవైపు నగరంలో ప్రతీ రోజు సుమారు 5500 మెట్రిక్ టన్నుల మున్సిపల్ వ్యర్థాలను జీహెచ్ఎంసీ ద్వారా తరలిస్తుండగా, ఈ వర్షాల వల్ల భారీఎత్తున పేరుకుపోయిన వ్యర్థాలను రోజుకు రెండున్నర రెట్లు 10 వేల మెట్రిక్ టన్నులను తొలగిస్తున్నామని చెప్పారు. గత నాలుగు రోజుల్లోనే దాదాపు 18000 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించామని తెలిపారు. దాదాపు వంద వరకు అదనపు వాహనాలను ఏర్పాటు చేసామని తెలిపారు. రానున్న పది రోజుల పాటు ముమ్మర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టరాలని జీహెచ్ఎంసీ శానిటేషన్, ఎంటమాలజీ, ఈవీడీఎం అధికారులను ఆదేశించారు. పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, నాలాలలో పూడిక, పేరుకే పోయిన వ్యర్థాలను తొలగించడం, డిష్ఇన్ఫెక్టిన్ కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. ఎంటమాలజీ విభాగం ద్వారా 64 వెహికిల్ మౌంటెడ్ వాహనాలు, వెయ్యి స్ప్రేయర్లు, 843 నాప్తల్ స్ప్రేయర్లతో డిష్ ఇన్ఫెక్షన్ కార్యక్రమాలను చేపట్టామని మంత్రి కేటిఆర్ తెలిపారు.

యుద్ధప్రాతిపదికపై రోడ్ల పునరుద్ధరణ పనులు:

‘వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రహదారులను, ఫ్లై ఓవర్ల పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి కేటిఆర్ సూచించారు. రూ. 52 కోట్ల వ్యయంతో 99 కిలోమీటర్ల అంతర్గత రోడ్ల మరమ్మతులు, 83 కిలోమీటర్ల సి.ఆర్.ఎం.పీ రోడ్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. నగరంలో రూ.204 కోట్లతో సి.సి. రోడ్ల నిర్మాణాలు చేపట్టడానికి నిధులను మంజూరు చేయడం జరిగిందని, వీటిలో రూ.80 కోట్లతో వెంటనే సి.సి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. అదేవిధంగా రూ. 298 కోట్లతో బాక్స్ డైయిన్ల నిర్మాణానికి కేటాయించిన నిధులతో పనులను త్వరిత గతిన ప్రారంభించాలని మంత్రి తెలిపారు.

రూ.3 కోట్లతో ఆజంపురా బ్రిడ్జి పునర్నిర్మాణం:

భారీ వరదల వల్ల మొత్తం కూలిపోయిన ఆజాంపుర బ్రిడ్జి నిర్మాణాన్నివెంటనే చేపట్టేందుకు మూడు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు మంత్రి కేటిఆర్ వెల్లడించారు. ఈ ఆజాంపుర బ్రిడ్జి కూలడంతో ఓల్డ్ సిటీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, యుద్ధప్రాతిపదికపై బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. అసంపూర్తిగా ఉన్న ట్యాంక్ బండ్ సర్ ప్లస్ నాలా పనులను పూర్తికి రూ. 68 కోట్లు కేటాయించడం జరిగిందని, ఈ పనులు కూడా వెంటనే చేపట్టాలని అన్నారు.

హుస్సేన్ సాగర్ చెరువు, కట్ట కాలువల పటిష్టతకై ప్రత్యేక కమిటీ:

హైదరాబాద్ కు కంఠాభరణం గా ఉన్న హుస్సేన్ సాగర్ చెరువు కట్ట పటిష్టత, హుస్సేన్ సాగర్ లోకి వచ్చే నాలాల పునరుద్ధరణకై చేపట్టాల్సిన చర్యలను ప్రతిపాదించేందుకై నీటిపారుదల శాఖ ఈ.ఎన్.సి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటిఆర్ ప్రకటించారు. జీహెచ్ఎంసి, జలమండలి, హెచ్ఎండీఏ సంబంధిత శాఖల చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉండే ఈ కమిటీ 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇటీవలి వర్షాలకు గ్రేటర్ లో 192 చెరువుల్లో 14 చెరువులు దెబ్బతినగా, ఆరు చెరువులకు గండ్లు పడ్డాయని వివరించారు. ఈ దెబ్బతిన్న చెరువులనన్నింటినీ రూ.41 కోట్ల జీహెచ్ఎంసి నిధులతో వెంటనే మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు.

మూసీలో వ్యర్థాల తొలగింపుకు పది ప్రత్యేక బృందాలు:

హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో వచ్చిన భారీ నీటితో మూసీలో పెద్ద ఎత్తున పేరుకు పోయిన వ్యర్థాలను తొలగించడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. మూసి ఇరువైపులా పేరుకు పోయిన వ్యర్థాలన్నింటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు.

రికార్డ్ సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్దరణ:

నగరంలో భారీవర్షాలు, వరదల వల్ల అంతరాయం కలిగిన విద్యుత్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరించామని మంత్రి అన్నారు. నగరంలో కేవలం నాలుగు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫారాలు మినహా 221 ట్రాన్సఫారాలను పునరుద్దరించామని అన్నారు. టీఎస్ఎస్పీడీసిఎల్ కు మూడున్నర కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. మరోవైపు జలమండలికి 900 లకు పైగా ఫిర్యాదులందగా వాటిని వెంటనే పరిష్కరించారని, ప్రతి రోజు 520 ఎం.ఎల్.డీ ల పరిమాణంలో నీటిని నగర ప్రజలకు అందచేస్తున్నామని వివరించారు. గ్రేటర్ శివార్లలోని 15 మున్సిపాలిటీల్లో 130 కాలనీలు నీట మునిగాయని తెలిపారు. వీటిలోనూ సహాయక, పునరుద్ధరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమీక్ష సమావేశానికి మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ పరిపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసి, జలమండలి, దక్షణ మండల విధ్యుత్ పంపిణి సంస్థ, హైదరాబాద్ మెట్రో రైల్, మూసీ రివర్ డెవలఫ్మెంట్ తదితర శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 7 =