దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ.. కేవలం ఒక్కరి ఆదాయాన్ని వెయ్యి రెట్లు పెంచారు – మంత్రి కేటీఆర్‌

Minister KTR Lashes Out Modi Govt Over Discriminating Against Telangana in Thorrur Public Meeting,Minister KTR Lashes Out Modi Govt,Modi Govt Over Discriminating Against Telangana,Thorrur Public Meeting,Mango News,Mango News Telugu,Minister KTR Serious Comments,Minister KTR In Thorrur Public Meeting,Minister KTR Public Meeting LIVE,Minister KTR Latest News and Updates,Minister KTR Live News,Minister KTR News Today,Minister KTR News

దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ.. కేవలం ఒక్కరి ఆదాయాన్ని వెయ్యి రెట్లు పెంచారని మండిపడ్డారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఈ మేరకు ఆయన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని బుధవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు రూ.750 కోట్ల వ‌డ్డీలేని రుణాల పంపిణీని ప్రారంభించారు. అలాగే అభ‌య హ‌స్తం నిధుల‌ను వడ్డీతో స‌హా తిరిగి ఇచ్చే కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్‌ శ్రీ‌కారం చుట్టారు. తద్వారా రాష్ట్రంలోని 21ల‌క్ష‌ల 32వేల 482 మంది స‌భ్యుల‌కు 545 కోట్ల 93 ల‌క్ష‌ల రూపాయ‌లు పంపిణీ ప్రారంభ‌మైంది. దీనితో పాటు కుట్టు శిక్ష‌ణా కేంద్రాల ద్వారా శిక్ష‌ణ పూర్తి చేసుకున్న 3వేల మంది మ‌హిళ‌ల‌కు 500 మందికి కుట్టు మిష‌న్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రూ.1,550 కోట్లను సీఎం కేసీఆర్‌ చిరుకానుకగా అందజేయడం జరుగుతున్నదని పేర్కొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భారతదేశంలోనే అత్యుత్తమ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అని, ఇది తాను చెబుతున్న మాట కాదని, కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అవార్డులు ద్వారా కేంద్రమే స్వయంగా చెబుతున్న మాటని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ‘సంసద్‌ ఆదర్శ గ్రామీణ యోజన’లో భారతదేశంలో అతి ఉత్తమమైన 20 గ్రామ పంచాయతీల లెక్క తీస్తే.. అందులో 19 మన తెలంగాణేలోనే ఉన్నాయని, ఈ మేరకు ఇటీవల విడుదలైన గత ఆరు నెలలకు సంబంధించిన ర్యాంకులే నిదర్శమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. త్రీ-స్టార్‌, ఫోర్‌-స్టార్‌ పేరుతో జిల్లాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్స్‌, రేటింగ్స్‌ వచ్చాయని, వీటిలో త్రీ-స్టార్‌, ఫోర్‌-స్టార్‌లో ఒకటి నుంచి ఆరు ర్యాంకులకు అవార్డులు ఇస్తే.. ఇందులో నాలుగు జిల్లాలు తెలంగాణావే ఉన్నాయని వెల్లడించారు.

ఇంకా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ.. నరేంద్ర మోదీ ప్రియమైన ప్రధాని కాదని, పిరమైన ప్రధాని అని అభివర్ణించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వివక్షకు గురవుతోందని, కాదని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ ఆడబిడ్డలకు ఏం చేశారు? తెలంగాణ గిరిజనులకు ఏం చేశారు? తెలంగాణ రైతులకు ఏం చేశారు? తెలంగాణలోని ఏ వర్గానికి ఏం చేశారో చెప్పే సత్తా వారికి ఉన్నదా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక గతంలో వరంగల్‌కు వచ్చిన సమయంలో ప్రధాని మోదీ, అందరు జన్‌ధన్‌ ఖాతాలు తెరిస్తే ధనాధన్‌ రూ.15లక్షలు వేస్తామని చెప్పారని, మరి అందరికి రూ.15లక్షలు వచ్చాయా? మరి కేసీఆర్‌ ఇచ్చిన రైతుబంధు వచ్చిందా? అని నిలదీశారు. బీజేపీకి ఓటేస్తే ప్రధాని అయ్యాక ఐదారేళ్లలోనే రైతుల ఆదాయం డబుల్‌ చేస్తానని నాడు మోదీ అన్నారని, కానీ కేవలం ఆయనకు సన్నిహితంగా ఉండే ఒకే ఒక్కరి ఆదాయం మాత్రం వెయ్యి రెట్లు అయిందని విమర్శించారు.

ఇంకా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌, వన్‌ నేషన్‌-వన్‌ ట్యాక్స్’ అని ప్రధాని మోదీ చెప్పారని, ఇప్పుడు కొత్తగా వన్‌ నేషన్‌ వన్‌ ఫ్రెండ్‌ తీసుకు వచ్చారని, దేశ సంపద మొత్తం ఆయన దోస్తుకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. శ్రీలంకకు పోయి పైరవీలు చేసి వాళ్ల దోస్తుకు ప్రాజెక్టు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వానికి చెప్పారని, గవర్నమెంట్‌ అని నమ్మబలికి అదానీకి రూ.6వేల కోట్లు ఇచ్చారని, మళ్ళీ అందులో నుంచి కొంత మొత్తం బీజేపీకి పార్టీ ఫండ్ రూపంలో తీసుకుంటున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ఇక ఆ దొంగ సొమ్ముతో బీజేపీ విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కొనడం ద్వారా రాష్ట్రాలలో ప్రజా ప్రభుత్వాలను కూల్చుతోందని, దీనికోసం అన్ని వ్యవస్థలను వాడుకుంటోందని మండిపడ్డారు. మోదీ వచ్చినప్పుడు రూ.400 ఉండే గ్యాస్‌ సిలిండర్‌ ధర, నేడు రూ.1200కు చేరిందని, రూ.70 పెట్రోల్‌ రూ.110కి పెరిగిందని, పప్పు, ఉప్పు, నూనె, నెయ్యి వంటి అన్ని నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. ఇక ఖాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ పెడుతామని చెప్పి.. గుజరాత్‌కు తీసుకుపోయారని, రూ.20వేల కోట్లతో వారి రాష్ట్రంలో కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నారని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − nine =