భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలి, ఉద్యోగులందరికీ సెలవులు రద్దు

Hyderabad, Hyderabad Rains news, KTR Review Meeting, KTR Review Meeting Over Rainfall, KTR Review Meeting Over Rainfall In Hyderabad, KTR Review over Heavy Rains, Minister KTR Review over Heavy Rains, Minister KTR Review over Heavy Rains in the State, Rainfall In Hyderabad, Telangana Heavy Rains, Telangana Heavy Rains News

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలిక శాఖ మంత్రి కేటిఆర్ సోమవారం నాడు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు మరో రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కేటిఆర్ ఆదేశాలు ఇచ్చారు. రానున్న రెండు వారాల పాటుగా అధికారులు పూర్తిస్థాయిలో క్షేత్రంలో ఉండాలని, ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా సీనియర్ అధికారులకు బాధ్యత అప్పగించాలని, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు కమిషనర్లు సైతం ఆకస్మిక తనిఖీలు చేస్తూ పరిస్థితిని పర్యవేక్షణ చేయాలని మంత్రి కేటిఆర్ సూచించారు.

ప్రస్తుతం సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతుందని కేవలం హైదరాబాద్ నగరంలోనే గత పది రోజుల్లో యాభై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇంత పెద్ద ఎత్తున వర్షాలు గతంలో ఎప్పుడూ లేదని సమీక్ష సందర్భంగా మంత్రికి అధికారులు తెలియజేశారు. ఇంత భారీ వర్షపాతం రోజంతా కాకుండా కేవలం 1, 2 గంటల్లోనే కుండపోతలా వర్షం పడటం వలన అక్కడక్కడ నీళ్లు పేరుకుపోతున్న విషయాన్ని తెలియజేశారు. ఇంత భారీ వర్షాలలోనూ పురపాలక శాఖ అధికారులు వెంటనే స్పందించి సాధ్యమైనంత సహాయక చర్యలు చేపడుతున్న విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. ఇప్పటిదాకా వర్షాల వలన జరిగిన 2 సంఘటనల్లో ప్రాణ నష్టం సంభవించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. దీంతో మంత్రి కేటిఆర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

కూలిపోయేందుకు సిద్ధంగా లేదా బలహీనంగా ఉన్న భవనాలను వెంటనే గుర్తించాలని, ఇలాంటి భవనాలను కూల్చివేయాలని అధికారులకు సూచించారు ఇప్పటికే గుర్తించిన ఇలాంటి భవనాలను మరింత వేగంగా కూల్చాలని సూచించారు. దీంతోపాటు భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండేలా ప్రైవేట్ కాంట్రాక్టర్ లకి మార్గదర్శకాలు జారీ చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన కార్యక్రమాల నేపథ్యంలో తవ్విన గుంతల చుట్టూ కంచె వేయాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన వాటర్ లాగింగ్ పాయింట్లలో ప్రత్యేక బృందాలను పెట్టి చర్యలు తీసుకోవాలని మంత్రి కేటిఆర్ సూచించారు.

ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 170 వర్షాకాల అత్యవసర బృందాలు పని చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలియజేశారు. వర్షాల వలన పాడవుతున్న రోడ్లను వెంట వెంటనే మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని, వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత యుద్ధప్రాతిపదికన రోడ్లన్నీ పూర్వస్థితికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని ఇందుకు సంబంధించి ఎంటమాలజీ విభాగాలను మరింత ఆక్టివేట్ చేయాలని మంత్రి కేటిఆర్ ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =