ఆగస్టు 1న పాతబస్తీ బోనాల ఉత్సవాలు, ఏర్పాట్లకై రూ.7 కోట్లతో పనులు : మంత్రి తలసాని

Ashada Bonalu festivities, Beginning of Bonalu Festival, Bonalu Festival Arrangements, Bonalu festivities in Hyderabad, Golkonda Bonalu, Mango News, Minister Talasani Srinivas, Minister Talasani Srinivas Held Review Meeting, Minister Talasani Srinivas Held Review Meeting on Old City Bonalu, Minister Talasani Srinivas Yadav, Old City Bonalu, Talasani Srinivas, Talasani Srinivas Held Review Meeting on Old City Bonalu, Telangana Bonalu Festival, Telangana Bonalu Festival 2021, Ujjaini Mahankali Bonalu

ఆగస్టు 1వ తేదీన నిర్వహించే పాతబస్తీ బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం 7 కోట్ల రూపాయలతో వివిధ పనులను చేపట్టడం జరిగిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం నాడు సాలార్ జంగ్ మ్యూజియంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాత బస్తీ బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ఉత్సవాల నిర్వహకులు, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే ఆషాడ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. బోనాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. పాతబస్తీ బోనాల ఉత్సవాలలో భాగంగా వివిధ అభివృద్ధి పనులు, భక్తులకు కనీస వసతులు కల్పించడం వంటి 132 పనుల కోసం 7 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు. దర్శనం సమయంలో భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు త్రాగునీటిని అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా అదనపు ట్రాన్స్ ఫార్మర్ లతో పాటు మొబైల్ ట్రాన్స్ ఫార్మర్ లను కూడా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఆలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ ను మంత్రి ఆదేశించారు. రహదారుల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు. కరోనా నేపద్యంలో శానిటైజేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఆయా ఆలయాల పరిసరాలలో ఎలాంటి లీకేజీ లు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎయిర్ టెక్ మిషన్ ల సహాయంతో మ్యాన్ హోల్స్ శుభ్రం చేయాలని మంత్రి వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. భక్తులు ఉత్సవాలను వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రత్యేక హెల్త్ క్యాంప్ లను కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలను నిర్వహించడంలో పోలీసులపాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా అవసరమైన ప్రాంతాలలో మరికొన్ని బోనాల ఉత్సవాలు ముగిసే వరకు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బోనాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాపిక్ డైవర్షన్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రాపిక్ పోలీసులను ఆదేశించారు. ఉత్సవాల నిర్వహకులు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. ఇంకా ఆలయాల వద్ద ఏమైనా సౌకర్యాలు కావాలంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని ఉత్సవాల నిర్వహకులకు మంత్రి సూచించారు.

బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం కోసం వెంటనే కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ అధికారులకు తమ దరఖాస్తులను అందజేయాలని చెప్పారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలకు ముందే ఆర్ధిక సహాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఈ బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం మొత్తం 90 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని, ఇందులో 15 కోట్ల రూపాయలు వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం క్రింద, మరో 75 కోట్ల రూపాయలను బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ శంకర్ యాదవ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, సీజీఎం వినోద్ భార్గవ, ట్రాన్స్ కో సీజీఎం స్వామీ, డీసీపీ గజారావు, ట్రాపిక్ అడిషనల్ డీసీపీ రాములు నాయక్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, ఐ అండ్ పీఆర్ సీఐఈ రాధాకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ ఎస్పీహెఛ్ఓ లక్ష్మణ్, పర్యాటక శాఖ ఎస్ఈ అశోక్, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − twelve =