అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు కాదు, అన్ని అంశాలపై కూలంకశంగా చర్చిస్తాం – సీఎం కేసీఆర్

KCr On Telangana Assembly Session, KCR Review over Assembly Session, KCR Telangana Assembly Session, Telangana Assembly, Telangana Assembly 2020, Telangana Assembly Session, Telangana Assembly Session 2020, Telangana Assembly Sessions News, Telangana CM KCR

రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అసెంబ్లీలో జరిగే చర్చ సందర్భంగా అన్ని వాస్తవాలను ప్రజలకు వివరించడం కోసం మంత్రులు సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, విప్ లతో గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు.

కరోనా వ్యాప్తి నివారణ, కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, రాష్ట్రంలో విస్తరించిన వైద్య సేవలు, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం–తీసుకోవాల్సిన చర్యలు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు-నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాలు, జిఎస్టీ అమలులో జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న నష్టం, రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణి, నియంత్రిత పద్ధతిలో పంట సాగుతో పాటు వ్యవసాయ రంగం, పీవీ శతజయంతి ఉత్సవాలు తదితర అంశాలను చర్చించాలని, ప్రభుత్వ పరంగా చర్చకు సిద్ధమైన అంశాలను బిఎసి సమావేశంలో ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డికి అసెంబ్లీలో మొదటి రోజే ఘన నివాళి అర్పించనున్నట్లు సీఎం తెలిపారు. అసెంబ్లీలో చర్చకు వచ్చే అన్ని అంశాలపై సంపూర్ణమైన సమాచారంతో మంత్రులు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

‘‘ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లేలా అసెంబ్లీ సమావేశాలు జరగాలి. ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చ జరగడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి చట్ట సభలకు మించిన వేదిక లేదు. ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలి. దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ శాసనసభను నిర్వహించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాలు అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందో సభ్యులు విశ్లేషించాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సభ్యులు ప్రస్తావించాలి. ప్రభుత్వం సభ్యులడిగే ప్రతీ అంశానికి సంబంధించిన వివరాలు చెపుతుంది. అధికార పక్ష సభ్యులు కూడా ప్రజలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని సభలో ప్రస్తావించాలి’’ అని సీఎం పిలుపునిచ్చారు.

‘‘అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు కాదు. పనికి మాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కారాదు. ఇలాంటి ధోరణిలో మార్పు రావాలి. తెలంగాణ అసెంబ్లీ నిర్వహణలో గుణాత్మక మార్పులు రావాలి. స్పూర్తి వంతమైన చర్చలు జరగాలి. చట్టాలు తయారు చేయానికి (శాసనాలు నిర్మించడానికి), బడ్జెట్ ఆమోదించడానికి, చట్టాలు, బడ్జెట్ అమలు ఎలా ఉందో విశ్లేషించుకోవడానికి శాసనసభలో చర్చ జరగాలి. చర్చలు గొప్పగా, వాస్తవాల ఆధారంగా జరగాలి. ప్రజలకు ఉపయోగపడే విధంగా సభ్యులు మాట్లాడాలి. అసెంబ్లీలో చర్చ ద్వారా అటు ప్రజాస్వామ్యం మరింత బలపడాలి. ఇటు ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు వెలువడాలి. ఈ విధంగా తెలంగాణ శాసనసభ జరగాలి. అదే ప్రభుత్వం కోరుకుంటున్నది. ఏ పార్టీ సభ్యులైనా సరే, ఏ విషయం గురించి అయినా సరే సభలో మాట్లాడవచ్చు. దానికి సమాధానం చెప్పడానికి, వివరణ ఇవ్వడానికి, ఆచరణాత్మకమైన సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సభ్యులు మాట్లాడే విషయాలు వాస్తవాలు ప్రతిబింబించాలి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలా ఉండాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత రెడ్డి, కెటి రామారావు, టి.హరీశ్ రావు, ఈటల రాజేందర్, జి.జగదీష్ రెడ్డి, ఎస్.నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శాసన మండలిలో చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ లు ప్రభాకర్, భాను ప్రసాద్, కె. దామోదర్ రెడ్డి, అసెంబ్లీలో చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, విప్ లు గంప గోవర్థన్, గొంగిడి సునిత, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, అరికపూడి గాంధీ, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =