ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

KCR About TSRTC, KCR Orders To Start Cargo, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana CM KCR, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana State Road Transport Corporation, TSRTC Latest News

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 25, బుధవారం నాడు తెలంగాణ ఆర్టీసీపై ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో కార్గో మరియు పార్శిల్ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించినట్లే, అన్ని చోట్లకూ సరుకు రవాణా చేయాలని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించగా, ఈ సమీక్షలో ఈ బోర్డు కూర్పు, పనివిధానాన్ని కూడా ఖరారు చేశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ, ఇడిలు పాల్గొన్నారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించడం, సరుకు రవాణా విభాగాన్ని పటిష్టం చేయడం, కార్మికులకు ఇచ్చిన హమీల అమలు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. పలు నిర్ణయాలు ప్రకటించారు మరియు పలు సూచనలు చేశారు.

‘ఆర్టీసీ కార్గో అండ్ పార్శిల్ సర్వీస్’

‘‘ఆర్టీసీ బస్సులు ప్రతీ రోజు రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలను చుట్టి వస్తున్నాయి. లక్షలాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. అదే మాదిరిగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఏ మారుమూల ప్రాంతానికైనా సరుకు రవాణా చేయాలి. ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా జరిగే సరుకు రవాణాను ఇకపై ఖచ్చితంగా ‘ఆర్టీసీ కార్గో అండ్ పార్శిల్ సర్వీస్’ ద్వారానే చేస్తాము. దీనికి సంబంధించి అన్ని శాఖలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తాము. బతుకమ్మ చీరలు, విద్యా సంస్థలకు పుస్తకాలు, హాస్పిటళ్లకు మందులు ఇలా ప్రభుత్వ పరంగా జరిగే ప్రతీ సరుకు రవాణా ఇకపై ఆర్టీసీ ద్వారానే జరిగేట్లు చూస్తాం. ప్రజలు తమ సరుకులను రవాణా చేయడానికి ఇప్పటిదాకా ప్రైవేటు ట్రాన్సుపోర్టును ఉపయోగిస్తున్నారు. ఇకపై ఆర్టీసీలోనే తమ సరుకును రవాణా చేసేలా ప్రోత్సహించాలి. నగరాలు, పట్టణాల నుంచి మారుమూల ప్రాంతాలకు సరుకు రవాణా చేయడానికి అనుగుణమైన ఏర్పాట్లు చేయాలి. ఆర్టీసీ బస్సు పోని ఊరంటూ లేదు. ప్రతీ మారుమూలకూ పోతుంది. ఆర్టీసీ సురక్షితం అనే పేరుంది. కాబట్టి సరుకు రవాణా విభాగాన్ని పటిష్ట పరిస్తే ప్రజలు తమ సరుకులను ఖచ్చితంగా ఆర్టీసీ ద్వారానే రవాణా చేస్తారు. కేవలం రాష్ట్ర పరిధిలోనే కాకుండా తెలంగాణ ప్రజలు ఎక్కువగా నివసించే ముంబాయి, బీవండి, సోలాపూర్, నాగపూర్, జగ్దల్ పూర్ తదితర ప్రాంతాలకూ కూడా సరుకు రవాణా చేయాలి. సరుకు ఎగుమతి, దిగుమతి కోసం హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో చాలా చోట్ల స్టాక్ పాయింట్లు పెట్టాలి. సరుకు రవాణా ఎక్కువ చేయగలిగితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది, ఆర్టీసీకి లాభాలు వస్తాయి. ఆర్టీసీ లాభాల బాటన పయనిస్తే ఉద్యోగులకు బోనస్ కూడా ఇచ్చుకునే పరిస్థితి వస్తుంది. సరుకు రవాణా విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఉద్యోగులకు తగిన శిక్షణ ఇవ్వాలి. సరుకు రవాణాకు అనుగుణంగా బస్సులను సిద్ధం చేయాలి’’ అని సీఎం వివరించారు.

‘ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డు’

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, ఎప్పటికప్పుడు ఎదురయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు. బోర్డు కూర్పుకు సంబంధించి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ డిపో నుంచి, ప్రధాన కార్యాలయం నుంచి ఇద్దరు చొప్పున ఉద్యోగులు మొత్తం 202 మంది బోర్డులో సభ్యులుగా ఉంటారు. ఇందులో 94 మంది బిసిలు, 38 మంది ఎస్సీలు, 26 మంది ఎస్టీలు, 44 మంది ఓసీలు ఉంటారు. మొత్తం సభ్యుల్లో మహిళా ఉద్యోగులు 73 మంది ఉంటారు. బోర్డు సమావేశం డిపో పరిధిలో వారానికి ఒకసారి, రీజియన్ పరిధిలో నెలకు ఒకసారి, కార్పొరేషన్ పరిధిలో మూడు నెలలకు ఒకసారి జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను పరిష్కరిస్తారు. ఆర్టీసీని కాపాడడానికి, లాభాల బాట పట్టించేందుకు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ఉద్యోగులు కూడా తగిన స్పూర్తితో, చిత్తశుద్ధితో తమ బాధ్యతలు నిర్వర్తించేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రాబోయే పది రోజుల పాటు ఆర్టీసీ ఇడిలు, ఉన్నతాధికారులు డిపోల వారీగా సమావేశాలు నిర్వహించి, ఎక్కడికక్కడ తగిన వ్యూహం రూపొందించాలని చెప్పారు. హైదరాబాద్ లోని వివిధ డిపోల నుంచి నేరుగా చెన్నై, నాగపూర్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని సీఎం సూచించారు. పెళ్లిళ్లు, విహార యాత్రలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చే విషయంలో సరళమైన విధానం అనుసరించాలని చెప్పారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =