మార్చి 8 నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం

Telangana Govt Decides To Held Arogya Mahila Program State-Wide From March 8Th,Telangana Govt To Held Arogya Mahila Program,Arogya Mahila Program State-Wide,Arogya Mahila Program From March 8Th,Telangana Arogya Mahila Program,Mango News,Mango News Telugu,Telangana Govt To Roll Out Arogya Mahila,Telangana Govt To Launch Aarogya Mahila,Telangana Latest News And Updates,Telangana News,Telangana Live News

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్బంగా మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. మార్చి 8 నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య మహిళ కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లుపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే ఆరోగ్య మహిళ, సీపీఆర్, కంటి వెలుగు కార్యక్రమాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఎంహెచ్ఓలు, ఎస్పీలు, పంచాయతీ, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం “ఆరోగ్య మహిళ” కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం, ఈ నెల 8 న ప్రారంభించే ఆరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతం చేయాలి. మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం సీఎం సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. మహిళలు ప్రధానంగా ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్యలకి వైద్యం అందిస్తుంది. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళలకు బహుమతిగా దీన్ని అందిస్తుంది. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమాన్ని మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో, అనంతరం మొత్తం 1200 కేంద్రాలకు విస్తరించాలని ఆలోచన చేస్తునట్టు తెలిపారు

ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు – ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్ – థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం – అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేయడం – మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు – మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో కూడిన అవగాహన కల్పించడం – నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందించడం, సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు – సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కల్పించడం, అవసరమైన వారికి వైద్యం అందించడం – బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగించడం చేయనున్నారు. ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు, ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్ ఉంటుందన్నారు.

తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారని, రెఫరల్ సెంటర్లు ప్రభుత్వ పెద్దాసుపత్రులు ఉంటాయని తెలిపారు. సంబంధిత మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు అందించే కార్యక్రమంగా కొనసాగుతుందని, రిఫరల్ ఆసుపత్రుల్లో మహిళలకు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఉంటాయని చెప్పారు. మొదటి విడతలో 100 ఆరోగ్య కేంద్రాల్లో, మొత్తంగా 1200 పీహెచ్సీ, యూ.పీ.హెచ్.సీ, బస్తి దవాఖనాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించాలని, ఈ ప్రత్యేక సేవల గురించి మహిళలకు అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. మహిళా సంఘాలు, మెప్మా వారికి అవగాహన కల్పించాలి. మహిళా సంఘాలలో ప్రచారం కల్పించాలి. ఇప్పటివరకు చెప్పుకోలేక ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు చెప్పాలని, ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పరీక్షలు, చికిత్స పొందాలని అందరికీ తెలియచేయాలి. మార్చి 8 రోజున ప్రారంభించే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిదులు పాల్గొనేలా చూడాలి. జిల్లా కలెక్టర్లు, డి.ఎం.హెచ్.ఓలు చొరవతో పర్యవేక్షించాలి. జిల్లాల్లో ఎక్కడ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము అనే వివరాలు ముందుగా ప్రజా ప్రతినిదులు, ప్రజలకు తెలియ చేయాలని మంత్రి పేర్కొన్నారు.

మరోవైపు సీపీఆర్ పై విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. కరోనా తర్వాత సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగినట్లు వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెబుతున్నారు. ఇలా అరెస్ట్ అయిన ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారు. అయితే వారికి సీపీఆర్ చేస్తే కనీసం 5 గురిని బతికించవచ్చు. అందుకే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంచి కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సకాలంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చేయడం వల్ల వీరి ప్రాణాలు కాపాడటం సాధ్యం అవుతుంది. ఇది ఎంతో ఆలోచించాల్సిన విషయం. మన కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తున్నాం. ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు. ప్రజల్లో అవగాహన తేవాలి. సీపీఆర్ పై శిక్షణ ఇచ్చి, జిల్లాకు 5 మాస్టర్ ట్రైనింగ్ చేసి పంపాము. వారితో వైద్య, పోలీసు, మున్సిపల్ , ఇతర విభాగాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్లు, డిఎంహెచ్ఓలు కృషి చేయాలి. ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలి. కార్డియాక్ అరెస్ట్ అయిన వారిని కాపాడేందుకు కృషి చేయాలి.

సీపీఆర్ చేసినా కొన్ని సార్లు గుండె స్పందించదు. ఆ సమయంలో ఆటోమేటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డెఫిబ్రిలేటర్స్‌– ఏఈడీ అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా చేయడం సాధ్యమవుతుంది. మొదటి దశలో 18 కోట్లతో 1200 ఏఈడీ మిషన్లు కొనుగొలు చేస్తున్నాం. అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గం, జిల్లాల్లో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు జరగాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.

ఇక కంటి వెలుగు అందరికీ చేరాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 63.82 లక్షల మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది. ఒక్కో క్యాంపు లో రోజుకు 100 నుండి 120 మందికి పరీక్షలు చేస్తున్నాం. 1420 వార్డులు అంటే 42 శాతం పూర్తి చేయడం జరిగింది. సగటున 14 శాతం మందికి అద్దాలు అవసరం పడుతున్నది. అయితే కొన్ని జిల్లాలో కంటి పరీక్షలు రాష్ట్ర సగటు కంటే తక్కువ జరుగుతున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు, డిఎంహెచ్ఓలు, డిప్యూటీ డిఎంహెచ్ఓలు దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు సమీక్షలు చేయాలి. తప్పకుండా క్యాంపులు విజిట్ చేయాలని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, అన్ని నియోజకవర్గాల్లో మహిళా దినోత్సవం గొప్పగా జరగాలి. ఆరోగ్య మహిళ మంచి కార్యక్రమం, సీఎం కేసీఆర్ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైద్యారోగ్య శాఖ సమగ్రంగా రూపొందించింది. కంటి వెలుగు బాగా జరుగుతున్నది. అధికారులు పూర్తి బాధ్యతతో పని చేస్తున్నారు. సాధారణ డెలివరీలు పెరగటంలో వైద్యారోగ్య కృషి బాగుంది. ఆసుపత్రుల్లో పని తీరు చాలా మెరుగైంది. జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అరోగ్య మహిళ విజయవంతం చేయాలి అని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డైరెక్టర్ పిఆర్ హన్మంత రావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =