అన్న బాటలో తమ్ముడు.. అక్కడి నుంచే పవన్ పోటీ?

Pawankalyan, ap, janasena, ap assembly elections, naga babu, megaster chiranjeevi
Pawankalyan, ap, janasena, ap assembly elections, naga babu, megaster chiranjeevi

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఎన్నికలకు మరో 50 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు.. షెడ్యూల్ ప్రకారం మరో ఆరు నెలల గడువు ఉంది. కానీ ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ఆరాటపడుతుంది. అటు వైసీపీని గద్దె దించాలని టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏపీలో ప్రస్తుత పరిణామాల చూస్తుంటే కాస్త ముందగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఇటు విడతల వారీగా వారాహి యాత్ర చేస్తూ జనసేనాని పవన్ కల్యాణ్ హోరెత్తిస్తున్నారు. అటు చంద్రబాబును పరామర్శించేందుకు వెళ్లి రాజమండ్రి జైలు ఎదుటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తామని ప్రకటించారు. దీంతో జనసేన, టీడీపీల మధ్య పొత్తు ఉంటుందా?.. లేదా? అనే ప్రశ్నకు పులిస్టాప్ పడినట్లు అయింది. పోయినసారి విశాఖలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేసి.. రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. మరి ఈసారి జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి.. సీఎం జగన్ పులివెందుల నుంచి పోటీ చేయనున్నారు. అయితే జనసేనాని పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం ఇప్పుడు ఏపీలో హాట్ హాట్ జరుగుతోంది. తిరుపతిలో బలిజలు ఎక్కువగా ఉన్నారు. ఈక్రమంలో ఆ స్థానం నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని తిరుపతికి చెందిన కార్యకర్తలు జనసేనానికి సూచిస్తున్నారట. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తిరుపతి నుంచే పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఇటీవల రెండు రోజుల పాటు నాగబాబు తిరుపతికి చెందిన కార్యకర్తలు, శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అక్కడి పరిస్ధితులు, గెలుపు అవకాశాలు ఇతర అంశాలపై చర్చలు జరిపారట. చివరికి తిరుపతి నుంచి జనసేనాని పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలిందట. మరి నిజంగానే పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తారా? లేదా ఓడిన చోటే గెలవాలన్నట్లు మళ్లీ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − six =