అభ్య‌ర్థుల‌కు చంద్ర‌బాబు షాక్‌.. త్వ‌ర‌లో కొంద‌రి మార్పు త‌ప్ప‌దా?

Chandrababu naidu, AP Elections, tdp candidates, tdp,assembly elections,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Political updates,andhra pradesh,jenasena,pawan kalyan,Mango News Telugu,Mango News
Chandrababu naidu, AP Elections, tdp candidates, tdp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను తొలిజాబితాలోనే ప్ర‌క‌టించి బీఆర్ ‌స్ అధినేత సంచ‌ల‌నం సృష్టించారు. ఆ త‌ర్వాత కొన్ని స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చారు. ఇప్పుడు ఆంధ‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లోనూ దీనిపై చ‌ర్చ జ‌రుగుతోంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఒకేసారి మొత్తం 99 స్థానాలను ప్రకటించగా.. ఇందులో టీడీపీకి 94, జనసేనకు 05 స్థానాలు ఉన్నాయి. జనసేన అభ్యర్థులను పవన్ కల్యాణ్, టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించి ఉమ్మ‌డి కార్య‌చ‌ర‌ణ‌ను రూపొందించారు. సంయుక్తంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధం అవుతున్నాయి.

మ‌రోవైపు జాబితాలో పేర్లున్న అభ్య‌ర్థులు ఉత్సాహంగా ఉన్నారు. కార్య‌క‌ర్త‌లతో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ, ప్ర‌జ‌ల‌ను కూడా క‌ల‌వ‌డం మొద‌లుపెట్టారు. అయితే తాజాగా చంద్ర‌బాబునాయుడి వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప‌లువురు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జాబితా ప్ర‌క‌ట‌న త‌ర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొత్త అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తొలుత వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ 40 రోజుల్లో ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు. ఎంత సీనియర్‌ నేత అయినా నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా.. చివరి నిమిషం వరకు ప్రజల్లోనే ఉండి కష్టపడాలన్నారు. ‘నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోవాలి. ఎవరైనా అసంతృప్తితో ఉంటే ఒకటికి పదిసార్లు స్వయంగా వెళ్లి కలవాలి. అభ్యర్థినంటూ ఈగోతో వ్యవహరిస్తే కుదరదు. తొలి జాబితాలో సీట్లు పొందినవారి పనితీరు సరిగా లేకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనుకాడను. ప్రతి వారం మీ పనితీరు సమీక్షిస్తా. ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకోసారి సర్వే చేయిస్తా. తేడా వస్తే వేటు తప్పదు’ అని హెచ్చరించారు.

జాబితా ప్ర‌క‌ట‌న అనంత‌రం ప‌లుచోట్ల అసంతృప్తులు పెల్లుబికాయి. ఇంకా ప‌లుచోట్ల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈక్ర‌మంలో చంద్ర‌బాబు తాజా వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. అవ‌స‌ర‌మైతే ప‌లుచోట్ల అభ్య‌ర్థుల‌ను మారుస్తామ‌న్న సంకేతాలు ఇచ్చార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

రాష్ట్ర ప్రయోజనాలతో పాటు గెలుపే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెబుతూనే.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించ‌డంతో ఉత్కంఠ ఏర్ప‌డింది.  ‘గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరుగలేదు.  వచ్చే 40 రోజులు అత్యంత కీలకం. నిత్యం ప్రజల్లో ఉండి వారికి నమ్మకం, ధైర్యం కలిగేలా నాయకత్వం అందించాలి. ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రకటించాం. ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాం. ప్రజలతో ఓట్లు వేయించాల్సిన బాధ్యత మీపై ఉంది. మన మిత్రపక్షమైన జనసేన నేతలను గౌరవించి వారిని కలుపుకొని పోవాలి. రెండు పార్టీల నేతల సమన్వయంతో పనిచేస్తే నూటికి నూరు శాతం ఓట్ల బదిలీ జరుగుతుంది. జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిందే. లేక‌పోతే మార్పు త‌ప్ప‌దు’ అని వీడియో కాన్ఫ‌రెన్స్ లో చంద్ర‌బాబు హెచ్చ‌రించిన‌ట్లు తెలిసింది.

ఈక్ర‌మంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ చేసిన మార్పులు తెర‌పైకి వ‌స్తున్నాయి. మార్పు చేసిన స్థానాలు త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. అదే తీరును టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు కూడా ఏపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అనుస‌రించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అభ్యర్థుల ప్రకటనను ఉమ్మ‌డిగా ప్రకటించినట్లుగానే.. బహిరంగ సభలను కూడా ఉమ్మడిగా నిర్వహించేందుకు చంద్ర‌బాబు సిద్ధం అవుతూనే.. టీడీపీ అభ్య‌ర్థులపై కూడా ఓ క‌న్నేశారు. వారి ప‌నితీరు ప‌రిశీల‌న‌కు ప్ర‌త్యేక టీంల‌ను నియ‌మించిన‌ట్లు టీడీపీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో కొన్నిచోట్ల ఆశావ‌హులు ఇంకా త‌మ ప్ర‌య‌త్నాలు కూడా కొన‌సాగిస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపించే వేళ‌.. ఏమైనా మార్పులు ఉంటాయా, లేదా అనేది వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 1 =