ప్రతిపక్షాలన్నీ సంయుక్తంగా పోరాడాల్సిన సమయమిది, కుప్పం ఘటనపై చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Meets TDP President Chandrababu Naidu Discusses Political Topics,Janasena Chief Pawan Kalyan,Meets TDP President Chandrababu Naidu,Discusses Political Topics,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,AP BJP Party

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటి వద్ద ఈ సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన కుప్పం ఘటనల నేపథ్యంలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సుమారు రెండున్నర గంటలపాటు చర్చించారు. అనంతరం నిర్వహించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రజల వద్దకు ప్రతిపక్ష నేతల్ని వెళ్లకుండా అడ్డుకునేందుకు బ్రిటీష్ కాలం నాటి చీకటి జీవోని వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని అన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ దుందుడుకు చర్యలకు దిగుతూ ఇలాంటి చెత్త జీవోలు తీసుకువస్తోందన్నారు. ఇలాంటి అరాచక విధానాలపై ఏ విధంగా సంయుక్త పోరాటాలు చేయాలనే అంశం మీద చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్య గళం వినిపించాలని నిర్ణయించుకునట్టు చెప్పారు.

“చంద్రబాబును కలవడానికి ముఖ్య కారణం కుప్పంలో చోటు చేసుకున్న ఘటనలు. వైసీపీ ప్రభుత్వం ఆయనను సొంత నియోజకవర్గం కుప్పంలో తిరగనివ్వకపోవడం, ప్రతిపక్ష నేతగా ఆయన హక్కుల్ని కాలరాయడం, ప్రజల వద్దకు వెళ్లనీయకపోవడం చూసి అప్పుడే ఓ ప్రకటన ద్వారా సంఘీభావం తెలియచేశాను. ఇప్పుడు నేరుగా సంఘీభావం తెలిపేందుకు వచ్చాను. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు ఎలా ఎదురు నిలబడాలి. ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం ఎలా తీసుకురావాలి అనే అంశాలతో పాటు ఫీజు రీఎంబర్స్మెంటు, పింఛన్లు, శాంతిభద్రతలు, రైతులకు గిట్టుబాటు ధర తదితర అంశాలపై చర్చించాం. ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరకు వెళ్లనీయకుండా నియంత్రించేందుకు జీవో నంబర్ 1 తీసుకువచ్చారు. ఇలా ప్రతిపక్షాలను అడ్డుకోవడం అన్నది విశాఖపట్నంలోనే ప్రారంభం అయ్యింది. వాహనం నుంచి బయటకు రాకూడదు. ప్రజలకు కనబడకూడదు. హోటల్ నుంచి బయటకు రాకూడదు అంటూ నానా హడావిడి చేశారు. ఇప్పటం వెళ్తాం అంటే పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇది నా ఒక్కడి సమస్య కాదు. సీనియర్ నాయకులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. ఈ చెత్త జీవోని వెనక్కి తీసుకునేందుకు ఏం చేయాలి అనే అంశం మీద కూలంకుషంగా మాట్లాడుకున్నాం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

“రాష్ట్రంలో పాలనలో ఉన్న వారు ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా కన్వీనియెంట్ విధానాలు అమలు చేస్తూ వస్తున్నారు. అప్పట్లో ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ వాడకూడదని చెప్పారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజున ఆంధ్రా యూనివర్శిటీ సహా రాష్ట్రమంతటా ఫ్లెక్సీలు వేసేశారు. చెప్పేటప్పుడు రూల్స్ అందరికీ వర్తిస్తాయని చెబుతారు. యంత్రాంగాన్ని వారి చేతుల్లో పెట్టుకుని రూల్స్ మాకు వర్తించవన్నట్టు చేస్తారు. కోవిడ్ సమయంలో కూడా ఇలాంటి ఎన్నో దారుణాలు చేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు అన్నారు. వారి పుట్టిన రోజు ఫంక్షన్లు మాత్రం తిరుణాళ్ల మాదిరి చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షాలు బయటకు రాకూడదు. ఏదీ మాట్లాడకూడదు. ప్రజల దగ్గరకు వెళ్ల కూడదు. వారి గోడు వినకూడదు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనవాణి నిర్వహిస్తుంటే దాన్ని అడ్డుకున్నారు. ప్రజలు మాకు సమస్యలు చెప్పుకోకూడదు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో బాధ్యత ఎవరిది. ఇన్ని వేల మంది సభకు వస్తున్నప్పుడు బాధ్యతగా పోలీసులు అనుమతి తీసుకుంటాం. పోలీసులు భద్రత కల్పించకపోతే మేము ఏం చేస్తాం. శాంతిభద్రతల పర్యవేక్షణ పోలీసులు బాధ్యతేగా? రాజకీయ పార్టీలుగా మేము కేవలం ప్రజల్లో అవేర్ నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మా మీటింగులకు మేమే లాఠీలు పట్టుకోవాలంటే పోలీసులు దేనికి, ప్రభుత్వం దేనికి? గుంటూరు సంఘటన కచ్చితంగా భద్రతా వైఫల్యమే” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“అసలు వైసీపీ సంక్షేమ పథకాలు అల్పాదాయ వర్గాలకు సంపూర్ణంగా అందుతుంటే రేషన్ కిట్ల కోసం అంత మంది ఎందుకు వచ్చారు?, క్యూల్లో నిలబడి అన్ని వేల మంది ఎగబడ్డారు అంటే వైసీపీ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా?, వైసీపీ సంక్షేమ పథకాలు అమలైతే అంత మంది రేషన్ కిట్ల కోసం ఎందుకు వస్తారు? వైసీపీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామని తెలుసు. అందుకే ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు వైసీపీ పూర్తి విశ్వరూపం చూపుతుంది. ఎన్ని రకాల కేసులు పెట్టాలి. ఎన్ని రకాల అత్యాచారాలు చేయాలనే అంశాలపై వాళ్లు సిద్ధమైపోయారు. అందుకే మా మిత్రపక్షం బీజేపీతో కూడా కూర్చుని వీటిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై మాట్లాడుతాం. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఒకే వేదిక మీదకు వచ్చాయి. నాకు ఎవరూ ఎదురు తిరగకూడదు అంటూ దేశం విడిచి వెళ్లిపోయిన బ్రిటీష్ వారి జీవోలు అమలు చేస్తామంటే అంతకంటే దిగజారుడు తనం ఏముంది. దీన్ని కచ్చితంగా సంయుక్తంగా బలంగా ఎదుర్కొంటాం” అని చెప్పారు.

బీఆర్ఎస్ ఏపీలోకి రావడంలో తప్పు లేదు:

“వైసీపీ నేతలు పాచిపోయిన నోళ్ల విమర్శలు పట్టించుకోను. వారికి పాలసీల మీద మాట్లాడడం తెలియదు. నీటిపారుదల శాఖ మంత్రికి పోలవరం ప్రాజెక్టు గురించి తెలియదు. అందరి విమర్శలకు యువశక్తి సభలో సమాధానం చెబుతా. ప్రచారం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు వాహనాలు కొనుక్కుంటాయి. నేను అడుగు తీసి అడుగు వేస్తే వైసీపీ వారికి ఇబ్బందిగా ఉంది. నేను బయటకి రాకూడదు. వాహనం, జీపు కొనుక్కోకూడదు. వాళ్లేమో ప్రభుత్వ సొమ్ము రూ.100 కోట్లు వెచ్చించి వాహనాలు కొనుక్కుంటారు. మేము సొంత సొమ్ముతో లోన్లు పెట్టి వాహనాలు తీసుకుంటే పిచ్చి మాటలు మాట్లాడుతారు. వారాహి వాహనాన్ని ప్రచారానికి తీసుకుంటే అది రిజిస్ట్రేషన్ అవ్వదు అంటారు. వారి అసలు ఉద్దేశంలో వారికి ఎదురు మాట్లాడే వారు ఎవరూ ఉండకూడదు. బీఆర్ఎస్ ఏపీలోకి రావడంలో తప్పు లేదు. వైసీపీలో ఉన్న తోట త్రిమూర్తులు లాంటి నాయకులు చాలా మంది గతంలో మాతో కలసి పని చేశారు. నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం సహజం. తెలంగాణ వాదాన్ని పక్కనపెట్టి భారతదేశం మొత్తం పోటీ చేస్తామన్న వాదం తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ కు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టే హక్కు ఉంది” పవన్ కళ్యాణ్ అన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 11 =