నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం దామోదరం సంజీవయ్య

damodaram sanjivayya, damodaram sanjivayya Birth anniversary, Special article on damodaram sanjivayya,AP
damodaram sanjivayya, damodaram sanjivayya Birth anniversary, Special article on damodaram sanjivayya

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం దామోదరం సంజీవయ్య. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి హరిజన ముఖ్యమంత్రిగా సంజీవయ్య సేవలందించారు. ముఖ్యమంత్రి హోదాలో సంజీవయ్య రిక్షాలో సచివాలయానికి వెళ్లి తన నిజాయితీని చాటుకున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడులోని ఓ దళిత కుటుంబంలో 14 ఫిబ్రవరి 1921న సంజీవయ్య జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మునెయ్య, సుంకులమ్మ. 10 జనవరి 1960లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సంజీవయ్యను ముఖ్యమంత్రిని చేయాలన్న జవహర్ లాల్ నెహ్రూ నిర్ణయాన్ని కాంగ్రెస్‌లోని కొందరు అగ్రకులాలకు చెందిన నేతలు, ఏపీ నాయకులు సహించలేకపోయారు. సంజీవయ్యపై అవినీతి ఆరోపణలు మోపారు. అక్రమంగా లక్షల రూపాయలు సంపాదించారని నెహ్రూకు ఫిర్యాదు చేశారు.

అయితే నెహ్రూ మాత్రం సంజీవయ్యపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులను కూడా పక్కకు పడేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు మొండిపట్టుపట్టడంతో.. సంజీవయ్యపై విచారణ చేపడుతామని నెహ్రూ వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు తన అంతరంగిక మిత్రుడు అయిన ఓ నాయకుడిని ఆంధ్రకు వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా నెహ్రూ కోరారు. దీంతో నెహ్రూ స్నేహితుడు హైదరాబాద్‌కు వెళ్లి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు అయిన చక్రపాణిని కలిశారు. సంజీవయ్యపై విచారణ చేయడానికి వచ్చానని సదరు వ్యక్తి చెప్పడంతో.. నివ్వెరబోయిన చక్రపాణి ఆ నాయకుడికి చివాట్లు పెట్టారు. అయినప్పటికీ.. ప్రధాని ఆదేశం కావడంతో వెళ్లాల్సిందేనని సదరు నాయకుడు పట్టుపట్టారు.

దీంతో ఇద్దరు కలిసి సంజీవయ్య గ్రామానికి వెళ్లారు. గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యిపై మట్టి కుండతో అన్నం వండుతున్నది. పొగ గొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది. “ఏమిటి ఇక్కడ ఆపారు?” ప్రశ్నించాడు నాయకుడు. “సంజీవయ్య గారి ఇల్లు ఇదే.  ఆ వృద్ధురాలు ఆయన అమ్మ. కారు దిగండి”  అన్నారు చక్రపాణి. నాయకుడు షాక్ అయ్యారు. ఆ తర్వాత చక్రపాణి ఆమెకు నమస్కరించి.. ప్రస్తుతం మంత్రిగావున్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. అదివిన్న ఆ వృద్ధురాలు ‘మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా బాబు.. కట్టెల పొయ్యిపై వంట చెయ్యడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు” అన్నది. అదివిన్న ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుడి నోట్లో నుంచి మాట రాలేదు. ఇది జరిగిన వారం రోజుల్లోనే సంజీవయ్య ఆంధ్రప్రదేశ్‌ తొలి హరిజన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఆయన మరణించే వరకు ఆయనకున్న ఆస్తి.. దస్తులు, భోజనం చేసేందుకు ఒక ప్లేటు, గ్లాసు తప్ప మరొకటి లేవు. జానపద గేయాలు, నాటకాలంటే సంజీవయ్యకు ఎంతో ఇష్టం. ఏపీకి రెండో ముఖ్యమంత్రిగా.. తొలి దళిత ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా సంజీవయ్య పనిచేశారు.  1964 జనవరి 22న పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి మంత్రి వర్గాల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1965 మే 29వ తేదీన పార్లమెంట్‌లో బోనస్‌ చట్టాన్ని ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికుల ప్రయోజనాలు సంరక్షించి ‘బోనస్‌ సంజీవయ్య’గా మన్ననలు అందుకున్నారు. అలాగే జెనీవా అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించి ఈఎస్‌ఐ చట్టంలో కుటుంబం అనే పదాన్ని చేర్చడమే కాకుండా, మహిళా కార్మికుల తల్లిదండ్రులను కూడా పరిధిలో చేర్పించారు సంజీవయ్య. రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

సంజీవయ్య రాష్ట్రంలో మొట్టమొదట పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1960లో దళితులకు 6 ఎకరాల బంజరు భూముల పట్టాలను అందించారు. జీఓ 559తో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఆయన హయాంలోనే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పోరేషన్, చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్, మైనింగ్‌ కార్పొరేషన్, మౌలిక సదుపాయల సంస్థ, బీహెచ్‌ఈఎల్‌ ప్రారంభమయ్యాయి. 1961లో నిర్భంధ ఉచిత ప్రాథమిక విద్య, మధ్యాహ్న భోజన పథకం, ఉపకార వేతనాలను సంజీవయ్య ప్రవేశపెట్టారు. తెలుగును రాష్ట్ర అధికార భాషగా.. ఉర్దూను రెండో భాషగా ఆయన ప్రోత్సహించారు. గ్రేటర్ మున్సిఫల్ ఆఫ్ హైదరాబాద్‌ను కూడా సంజీవయ్యే ఏర్పాటు చేశారు. 1962లో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత సంజీవయ్యకు దక్కింది. 7 మే 1972లో సంజీవయ్య ఆకస్మికంగా మరణించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =