పల్లెలు, పట్టణాల అభివృద్ధికై మంత్రుల వద్ద 2 కోట్లు, కలెక్టర్ల వద్ద కోటి అత్యవసర నిధులు: సీఎం కేసీఆర్

CM KCR Held Preparatory Meeting Palle Pattana Pragathi Programs, Mango News, Palle and Pattana Pragathi Programmes, Palle Pragathi, Palle Pragathi Programme, Palle Pragathi Programme Guidelines, Pattana Pragathi, Pattana Pragathi Guidelines, Pattana Pragathi Programme, Pattana Pragathi Programme Guidelines, pattana pragathi telangana, Preparatory Meeting Palle Pattana Pragathi Programs, Telangana Palle Pattana Pragathi, Telangana Palle Pragathi Programme, Telangana Pattana Pragathi Programme

పల్లెలు, పట్టణాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా భావించి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, ప్రజా అవసరాలే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్నిరంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పాలనా వ్యవస్థ రూపుదిద్దుకోవాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. జులై 1 నుంచి పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను మరింతగా చైతన్యపరిచి నిర్దేశిత లక్ష్యాలన్నీటినీ చేరుకోవాలని సీఎం అన్నారు. పదిరోజుల కార్యక్రమం ముగిసిన తర్వాత పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా నిర్దేశించిన ఏ పనికూడా అపరిష్కృతంగా ఉండటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్ శాఖకు ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తున్నదనీ, అయినా కూడా పనులు వందశాతం పూర్తికాకుండా ఉండే అంశాన్ని పున:సమీక్ష చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం అత్యవసర నిధులుగా, మంత్రుల వద్ద రూ.2 కోట్లు, ప్రతి జిల్లా కలెక్టరు వద్ద ఒక కోటి రూపాయలు ఉంచేందుకు నిధులను కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ది (సీడీఎఫ్) నిధులను స్థానిక జిల్లామంత్రి నుంచి అప్రూవల్ తీసుకొని ఖర్చు చేయాలని సీఎం సూచించారు.

హరితహారంలో భాగంగా గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున డోర్ టు డోర్ పంపిణీ చేయాలి:

పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో జిల్లా కలెక్టర్లే కీలకమని, సమర్థవంతమైన వర్కింగ్ టీంను తామే ఎంపిక చేసుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల్లో ఇండ్లమీదనుంచి హెచ్ టీ విద్యుత్తు లైన్లను తొలగించాలని సీఎం ఆదేశించారు. పట్టణాలవారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున డోర్ టు డోర్ పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం జరిగింది.

రైస్ మిల్లుల సంఖ్యను పెంచాలి:

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘వ్యవసాయానికి, రైతుకు ప్రభుత్వం అండగా నిలబడింది. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా పరిణామం చెందింది. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా పంటలు పండుతూ ధాన్యాగారంగా మారింది. రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు తక్షణ అవసరం. రైస్ మిల్లుల సంఖ్యను పెంచాలి. ఇప్పుడు పండిన ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసుకోవడం పై దృష్టిసారించాలి. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్.ఇ.జెడ్ (సెజ్) లను 250 ఎకరాలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేసి, వాటి చుట్టూ బఫర్ జోన్లు ఏర్పాటు చేసి, ఆ పరిధిలో లే ఔట్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం తెలిపారు.

పదిరోజుల పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి :

రాష్ట్రంలో వ్యవసాయం దినదినాభివృద్ది చెందుతున్న నేపథ్యంలో కేవలం వ్యవసాయ శాఖ మాత్రమే కాకుండా అన్ని శాఖల అధికారులు దృష్టిసారించాల్సిన అవసరమున్నదని సీఎం తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా. రైతుకు వాణిజ్యపరంగా లాభదాయకమైన పంటలను అధికారులు ప్రోత్సహించాలని, నాటు పద్దతి కాకుండా వెద జల్లే పద్దతి ద్వారా వరి పండించే విధానాన్ని అవలంభించేలా రైతులను చైతన్యం చేయాలన్నారు. కంది, శనగ, పత్తి, ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్న్యాయ పంటలను ప్రోత్సహించాలని సీఎం అన్నారు. జూలై 1 నుంచి ప్రారంభం కానున్న పల్లె, పట్టణ ప్రగతి కార్య క్రమం కోసం సన్నాహక సమావేశాలను జిల్లా మండలాల వారీగా నిర్వహించాలని,ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేసి పదిరోజుల పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం సమావేశంలో పాల్గొన్న అధికారులకు పిలుపునిచ్చారు.

కల్తీ విత్తనాల అమ్మకాల మీద కఠినంగా వ్యవహరించాలని, వ్యవసాయశాఖ, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలను వినియోగించి కల్తీని నిరోధించాలని సీఎం అన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను అధిగమించడానికి పవర్ డే ను పాటించాలన్నారు. ప్రజలను చైతన్య పరిచి, శ్రమదానంలో పాల్గొనేలా చేసి, కరెంటు సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎం తెలిపారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాల ప్రకారం పల్లెలు, పట్టణాల్లో విక్రయించే ఫ్లాట్ల లే అవుట్లలో, ప్రజా అవసరాలకోసం కేటాయించిన భూమిని విధిగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్లమీద రిజిస్ట్రేషన్ చేయాలని సిఎం అన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించడానికి సమగ్ర నివేదిక తయారు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులను నిర్దిష్టంగా గుర్తించాలని అటవీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

పట్టణ ప్రగతి:

దిన దినాభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో చెత్తపేరుకు పోయే విధానంలో పట్టణానికో తీరు వ్యత్యాసముంటుందని, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణాలవారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో అన్నిశాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేసుకొని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. జులై చివరికల్లా శాఖల నడుమ వున్న పరస్పర బకాయిలను ‘బుక్ అడ్జస్ట్ మెంట్’ ద్వారా పరిష్కరించాలని, ఇక నుంచి అన్నిశాఖల నడుమ విధిగా చెల్లించాల్సిన బిల్లులను వెంట వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని, ప్రతి పట్టణంలో కనీసం ఐదు డంపు యార్డుల ను ఏర్పాటు చేసుకోవాలని, అందుకోసం పట్టణాలకు దగ్గరలో స్థలాలను సేకరించి పెట్టుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హెచ్ఎండీఏ పరిధిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, అందుకు అనుగుణంగా కాస్మొపాలిటన్ సిటీ అవసరాలను అందుకునే రీతిలో తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. వలస కార్మికుల సంక్షేమం కోసం పాలసీని రూపొందించాలని సీఎం ఆదేశించారు.

పట్టణాల్లో లక్ష జనాభాకు ఒకటి చొప్పున వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు:

నూతనంగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాలకు తరలుతున్న జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను, ఆస్తులను జిల్లా కలెక్టర్లు స్వాధీనం చేసుకుని, ఆ స్థలాలను ప్రజా అవసరాలకోసం వినియోగించాలని తెలిపారు. పట్టణాల్లో లక్ష జనాభాకు ఒకటి చొప్పున వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని, కనీసం రెండు, మూడు ఎకరాలకు తక్కువ కాకుండా స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా అందులో పార్కింగ్ తదితర సౌకర్యాలను కల్పించాలని సీఎం ఆదేశించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగే పది రోజుల సమయాన్ని అధికారులు సమర్థంగా వినియోగించుకోవాలని, ఇందుకోసం ‘మ్యాప్ యువర్ టౌన్’ ప్రకారం పట్టణ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ సమయంలో పట్టణాలలో లోపాలను సవరించుకుని సెట్ రైట్ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు వివిధ జిల్లాల్లో పర్యటనలు చేపట్టిన సందర్భాల్లో సమీక్షల కోసం ప్రతి జిల్లా కలెక్టరు కార్యాలయంలో “రాష్ట్ర చాంబర్” ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రతి జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రాంగణంలో జంట హెలిపాడ్ లను నిర్మించాలన్నారు.

ఫారెస్టు స్మగ్లింగును అరికట్టడానికి చెక్ పోస్టులను యాక్టివేట్ చేయాలి:

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూములు, స్థలాలు ఇతర ఆస్తుల వివరాలను (“ఇన్వెంటరీ”లను) జూలై నెలాఖరుకల్లా సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆస్తుల వివరాల రికార్డు చేయడానికి, సంరక్షణ, పర్యవేక్షణ కోసం జిల్లాకో ఎస్టేట్ ఆఫీసర్ ను నియమించాలని, వీరు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పని చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయి ఎస్టేట్ ఆఫీసర్ ను నియమించి సిఎస్ పర్యవేక్షణ లో విధులు నిర్వహించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అర్బన్ లాండ్ ను శాస్త్రీయంగా వినియోగించుకునే విషయంలో అధికారులు రియోడిజనీరో నగరాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం సూచించారు.

కొండలు, గుట్టలున్న ప్రాంతాల్లో విస్తృతంగా ప్లాంటేషన్ కార్యక్రమాలను చేపట్టాలని, మండలానికొకటి చొప్పున పది ఎకరాల స్థలంలో ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావసరాలరీత్యా భూమి అవసరమైన చోట చట్ట ప్రకారంగా భూసేకరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఫారెస్టు పునరుజ్జీవనం మీద కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించాలని, వివాదం లేని అటవీ భూముల్లో ముందు పునరుజ్జీవనం ప్రారంభించాలన్నారు. జాతీయ రహదారుల్లో పచ్చదనాన్ని పెంచే బాధ్యత ఆయా కాంట్రాక్టర్లదేనని వారిని చైతన్యపరిచి రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. ఫారెస్టు స్మగ్లింగును అరికట్టడానికి చెక్ పోస్టులను యాక్టివేట్ చేయాలన్నారు. రాష్ట్రంలో యువతను పక్కదారి పట్టించే విధంగా అసాంఘిక చర్యల పట్ల పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సరిహద్దు రాష్ట్రాలనుంచి గంజాయి వంటి మత్తు పదార్ధాల రవాణాను కఠినంగా అరికట్టాలని డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), 2019 బ్యాచ్ ఐఏఎస్ లు, డీఎఫ్ఓలు, కన్జర్వేటర్లు, డీపీవోలు, డీఆర్ డీవోలు, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eight =