రాష్ట్రమంతటా లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి: సీఎం కేసీఆర్

CM KCR Held Review on Corona Situation in the State with All District Collectors,Mango News,Mango News Telugu,CM KCR Review Meeting On State Covid Situation,KCR Review Meeting,Telangana Lockdown,Lockdown In Telangana,CM KCR,CM KCR On Lockdown,KCR On Lockdown,Lockdown,Telangana CM KCR,Telangana News,Weekend Lockdown In Telangana,CM KCR About Telangana Lockdown,CM KCR Live,Telangana Lockdown Updates,Telangana State,CM KCR,CM KCR Review Meeting,KCR Review Meeting,CM KCR Conduct Review Meeting,CM KCR Hold Review Meeting,CM KCR To Hold Review Meeting,CM KCR Review,Review Meeting On Coronavirus,KCR Review Meeting Over Coronavirus Situation,CM KCR Review Meeting Live,CM KCR Review On Telangana Lockdown,KCR Review Meeting Live,CM KCR On Lockdown,CM KCR Held Review on Corona Situation

రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్‌డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న పరిస్థితుల్లో ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎంజీఎం దవాఖానా సమీపంలోనే ఉన్న సెంట్రల్ జైల్ ను తరలించి అక్కడ మాతా శిశు సంరక్షణ కోసం అత్యాధునిక సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ దవాఖానాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, విశాలమైన స్థలంలో చర్లపెల్లి ఓపెన్ ఎయిర్ జైలు మాదిరిగా జైలును నిర్మిస్తుందనీ సీఎం తెలిపారు.

ఎంత ఖర్చయినా సరే, రోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలి:

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో కరోనా చికిత్స అమలు తీరు, వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ పర్యటన చేపట్టారు. మధ్యాహ్నం హెలీకాప్టర్ లో వరంగల్ చేరుకున్న సీఎం, తొలుత ఎంజీఎం దవాఖానాను సందర్శించారు. ఐసీయూలో, జనరల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్ల ప్రతీ బెడ్డు వద్దకు కలియతిరిగి పేరు పేరునా వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. మందులు, భోజనం సరిగ్గా అందుతున్నదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. మీరంతా త్వరలోనే కొలుకుంటారనీ కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. సీఎంను ఉద్దేశించి, మీరే మా ధైర్యం, కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం.. అని ఆయన ఉద్వేగంతో నినదించారు. అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి పారిశుధ్య పరిస్థితులను, సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే, రోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. దవాఖాన సిబ్బందితో, నర్సులతో మాట్లాడిన సీఎం కేసీఆర్, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న సేవలను అభినందించారు.

వరంగల్ సెంట్రల్ జైలు సందర్శన:

మధ్యాహ్న భోజన విరామం తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైల్లో ఖైదీలు తయారు చేసిన చేనేత, స్టీలు తదితర ఉత్పత్తులను పరిశీలించారు. బ్యారకుల్లో కలియతిరిగి, శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడారు. వారు జైలుకు ఏ శిక్ష మేరకు వచ్చారు? వారి ఊరు ఎక్కడ? వారి కుటుంబ పరిస్థితి ఏంటిది? అని అడిగి తెలుసుకున్నారు. ఖైదీల సమస్యలను ఓపికతో ఆలకించారు. జైల్లో వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. వారి అభ్యర్థనలను స్వీకరించారు.

ఉదయం సడలించిన 4 గంటలు మినహా, మిగతా 20 గంటలు లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేయాలి:

అక్కడి నుంచి సీఎం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, అన్ని జిల్లాల కలెక్టర్లు,డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉంది? కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటి? అని అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణ వారం పదిరోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘రాష్ట్ర రెవెన్యూ నష్టం గురించి ఆలోచించకుండా లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజమెంట్ చట్టం నియమ నిబంధనల ప్రకారం, లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత డీజీపీతో సహా కలెక్టర్లకు ఉన్నది. ఉదయం సడలించిన 4 గంటలు మినహా, మిగతా 20 గంటలపాటు లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేయాలి. అత్యవసర సేవలను, పాస్ లు ఉన్నవాళ్ళని మినహాయించి, ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదు. అదే సమయంలో ధాన్యం సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి. నేను హెలీకాప్టర్ లో వస్తున్న సందర్భంలో రోడ్లమీద వడ్ల కుప్పలు ఆరబోసి కనిపించాయి. నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతరు. అందుకే ధాన్యం సేకరణ ప్రక్రియను సత్వరమే ముగించాలి’’ అని సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లను, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు.

రెండో విడత కూడా ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలి:

వీడియో కాన్ఫరెన్సులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో పేరు పేరునా సీఎం మాట్లాడారు. కరోనా, ధాన్యం సేకరణ, లాక్‌డౌన్ అమలు తదితర అంశాల మీద వారితో సమగ్ర చర్చ జరిపారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలు జరగక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కఠినంగా అమలు చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల్లో సర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతినిధులు లాక్‌డౌన్ ను స్వచ్ఛందంగా అమలు చేస్తున్నారని, నగరాల్లో, పట్టణాల్లో మాత్రం లాక్‌డౌన్ మరింత సమర్థవంతంగా అమలు కావాల్సి ఉందన్నారు. దీనిపై అందరూ దృష్టిపెట్టాలని సీఎం కేసీఆర్ కోరారు. లాక్‌డౌన్ సమయం ముగిశాక ఉదయం 10.10 గంటల తర్వాత పాస్ హోల్డర్స్ తప్ప మరెవ్వరూ రోడ్డు మీద కనిపించకుండా డీజీపీ కఠిన చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా జిల్లాల్లో మందుల సరఫరా ఎలా ఉంది?, ఆక్సిజన్ సరఫరా ఎలా ఉంది? అని సీఎం ఆరా తీశారు. మొదటి జ్వర సర్వేకు కొనసాగింపుగా, రెండో విడత కూడా ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని సీఎం సూచించారు. హాస్పిటళ్ల పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సహా అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్స్ జాబితాను రూపొందించాలి:

కోవిడ్ హాస్పిటళ్లలో సేవలందిస్తున్న అన్నిరకాల ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సీఎం కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్స్ (ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయాల వ్యాపారులు, సేల్స్ మెన్) తదితరులందరినీ గుర్తించి జాబితాను రూపొందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. వీరందరికీ వ్యాక్సినేషన్ చేసే విషయమై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. యాదాద్రి, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గడం లేదని, వెంటనే ఈ జిల్లాలకు స్వయంగా వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. అలాగే, ధాన్యం సేకరణ కార్యక్రమం వెంటనే ముగించాలన్నారు. ఈ క్లిష్ట సమయంలో దవాఖానాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =