ప్రజాసమస్యల ప్రస్తావనలో నేటితరం నాయకులు నోములను చూసి నేర్చుకోవాలి: సీఎం కేసీఆర్

2021 Telangana Assembly Session, CM KCR Speech about Late Nomula Narsimhaiah, CM KCR Speech about Late Nomula Narsimhaiah in Telangana Assembly, KCR Telangana Assembly Session, Late Nomula Narsimhaiah, Mango News, Telangana Assembly, Telangana Assembly Budget Session, Telangana Assembly condoles demise of Nomula, Telangana Assembly Session 2021, Telangana Assembly Sessions News, Telangana CM KCR

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో రెండో రోజైన మంగళవారం నాడు ఇటీవల మరణించిన నాగార్జున సాగ‌ర్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్యతో పాటుగా ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాల‌ను ప్రవేశపెట్టారు. శాస‌న‌స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతి ప‌ట్ల స‌భ‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాప తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “ఉద్యమశీలి, ప్రజా నాయకుడు స్వర్గీయ శ్రీ నోముల నర్సింహయ్య సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపించిన వ్యక్తి. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే వారి జీవితాన్ని అంకితం చేశారు. విద్యార్థిగా, న్యాయవాదిగా, కమ్యూనిస్టు నాయకుడిగా, శాసన సభ్యునిగా నోముల నిరంతరం ప్రజా సేవలోనే గడిపారు” అని పేర్కొన్నారు

ప్రజాసమస్యల ప్రస్తావనలో నేటితరం నాయకులు నోములను చూసి నేర్చుకోవాలి:

“1956, జనవరి 9న నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, పాలెం గ్రామంలో పేద యాదవ కుటుంబంలో జన్మించిన నోముల నర్సింహయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. విద్యార్థి దశ నుండే ఉద్యమాలకు నాయకత్వం వహించారు. న్యాయవాదిగా పనిచేస్తున్న తరుణంలోనూ ఆయన పేదలపక్షం వహించి, ప్రజల న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. కమ్యూనిస్టు దృక్పథం కలిగిన నర్సింహయ్య సమాజంలో దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్మించారు. తన ఆశయాలకు అనుగుణంగా సీపీఎం పార్టీలో చేరారు. నకిరేకల్ ఎంపీపీ అధ్యక్షునిగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం శాసనసభా పక్ష నాయకుడిగా ఎదిగేదాకా సాగింది. శాసనసభలో తెలంగాణ నుడికారం ఉట్టిపడే విధంగా సామెతలు, ఛలోక్తులతో కూడిన నోముల నర్సింహయ్య ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్శించేవి. ప్రతిపక్ష నేతగా, శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలో, హుందాతనాన్ని ఎలా ప్రదర్శించాలో, ప్రజల సమస్యలను ప్రభావ పూర్వకంగా సభలో ఎలా ప్రస్తావించాలో నేటితరం నాయకులు నోముల నర్సింహయ్యను చూసి నేర్చుకోవాలి” అని చెప్పారు.

నోముల నర్సింహయ్య బడుగువర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమం కోసం నిరంతరం తపించారు:

“ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల సాగునీటి హక్కుల కోసం, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ రైతుల ప్రయోజనాల కోసం స్వర్గీయ నర్సింహయ్య నిరంతరం పోరాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికై ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. సీపీఎం పార్టీకి విశేష సేవలందించిన నోముల నర్సింహయ్య, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరితో విభేదించి ఆ పార్టీ నుంచి వైదొలిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయనే విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో టీఆర్ఎస్ తరఫున నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గం అభివృద్ధి కోసం చివరిశ్వాస వరకు కృషిచేశారు. పేద యాదవ కుటుంబంలో జన్మించిన నోముల నర్సింహయ్య బడుగువర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమం కోసం నిరంతరం తపించారు” అని సీఎం కేసీఆర్ చెప్పారు.

“64 ఏళ్ల వయస్సులో గత డిసెంబరులో గుండెపోటుతో ఆయన ఆకస్మికంగా మరణించడం తెలంగాణ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ప్రజా పోరాటాలను అభిమానించే వారందరికీ ఆయన మరణం తీరని దు:ఖాన్ని మిగిల్చింది. వ్యక్తిగతంగా నాకెంతో సన్నిహితులైన నోముల నర్సింహయ్య తెలంగాణ అభివృద్ధి కోసం తన ఆలోచనల్ని నాతో నిరంతరం పంచుకునేవారు. వారి ఆత్మీయతను, విలువల పట్ల వారి నిబద్ధతను నేనెప్పటికీ మరువలేను. నిజమైన ప్రజా నాయకుడిగా నోముల నర్సింహయ్య తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. వారి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ సభ తీర్మానిస్తున్నది” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ సమావేశాలను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − five =