ఖ‌మ్మంలో పువ్వాడ వెంటే సీపీఐ?

CPI after Puvvada in Khammam,CPI after Puvvada,Puvvada in Khammam,Mango News,Mango News Telugu,Telangana State CPI Party,Minister Puvvada Ajay Kumar,BRS, comunist party, CPI, Khammam, khammam politics, Puvvada Ajay, Telangana Assembly Elections,khammam politics Latest News,Telangana Politics, Telangana Political News and Updates,Hyderabad News,Telangana News,Telangana Assembly Elections Latest Updates,Telangana Assembly Elections Live News
khammam, puvvada ajay, brs, cpi, comunist party, khammam politics, telangana assembly elections

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నా.. రాష్ట్రంలో క‌మ్యూనిస్టుల పొత్తులు ఇంకా కొలిక్కి రానే లేదు. కాంగ్రెస్ రెండో జాబితా నేడో రేపో వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ సీట్ల అంశం తేల్చ‌కుండా కాంగ్రెస్ తాత్సారం చేస్తోంది. దీనిపై క‌మ్యూనిస్టులు అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. చివ‌ర‌కు పొత్తు పొడిచినా ఒక‌రి స‌హ‌కారం.. మ‌రొక‌రికి ఎక్క‌డ ఎలా ఉంటుందో తెలియ‌ని ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాలు ఉత్కంఠ‌గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా క‌మ్యూనిస్టులు.. ప్ర‌ధానంగా సీపీఐ కాంగ్రెస్ తో న‌డిచినా.. ఇక్క‌డ మాత్రం మంత్రి పువ్వాడ అజ‌య్ వెంటే న‌డ‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆ పార్టీ కేడ‌ర్ పువ్వాడ‌కు చాలా సంద‌ర్భాల్లో అండ‌గా ఉంటూ వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో అజ‌య్ గెలుపులో సీపీఐ పాత్ర  మ‌రువ‌లేనిది. అయితే.. ఈసారి రాజ‌కీయ ఒప్పందాల ప్ర‌కారం వారి మ‌ద్దతు కాంగ్రెస్ కే అయిన‌ప్ప‌టికీ.. ఖ‌మ్మం వ‌ర‌కూ సీపీఐ మ‌ద్ద‌తు ఆయ‌న‌కే ఉంటుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ఖ‌మ్మం గుమ్మంలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయాలు

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఖ‌మ్మంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ ఎస్ అభ్య‌ర్థి, మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ పార్టీల‌క‌తీతంగా అంద‌రినీ క‌లుపుకుంటూ ముందుకు సాగుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక్క‌డ త‌న తండ్రి పువ్వాడ నాగేశ్వ‌ర‌రావు కున్న రాజ‌కీయ నేప‌థ్యంలో.. ప్ర‌ధానంగా సీపీఐ తో ఆయ‌న‌కున్న అనుబంధం అజ‌య్ పై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సైద్దాంతికంగా ఎలాగున్నా.. సామాజికంగా అజ‌య్ కే సీపీఐ మద్ద‌తు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఉమ్మ‌డి ఖ‌మ్మం లో బీఆర్ ఎస్ అభ్య‌ర్థిత్వం ప్ర‌క‌టించాక‌ లింగాల కమల్ లాంటి వారు రాజ‌కీయంగా సీనియ‌ర్‌, సీపీఐ జాతీయ నాయకులైన‌ పువ్వాడ నాగేశ్వరరావు ను క‌లిశారు. ఆయ‌న ఆశీస్సులు తీసుకున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న కుమారుడైన అజ‌య్ కు స్థానికంగా సీపీఐకు అండ‌గా ఉంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.  ఇటీవల ఖమ్మంలో బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో సైతం మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ సీపీఐ మద్దతు తనకే ఉంటుందని ప్రకటించ‌డం కూడా ఇందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌.

క‌మ్యూనిస్టు కుటుంబ భావ జాలం

మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ తండ్రి నాగేశ్వ‌ర‌రావు క‌రుడుగ‌ట్టిన క‌మ్యూనిస్టు నేత‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన జనాభా జీవ‌న శైలిలో మార్పు కోసం కృషి చేశారు. ప్రత్యేకించి గిరిజన జనాభాకు ఉచిత వైద్య సేవలను అందించడం కోసం అవిశ్రాంతంగా పాటుప‌డ్డారు. తన వృత్తిపరమైన సమయంలో, అతను ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక విద్య, త్రాగునీరు వంటి ప్రాథమిక అవసరాల పరంగా గిరిజన జనాభా ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొన్నారు, తన అభ్యాసాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరారు. పేద వైద్య సౌకర్యాల కారణంగా గిరిజన ప్రజలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారి సామాజిక ఆర్థిక నేపథ్యం కారణంగా పట్టణ కేంద్రాలకు వెళ్లలేని బాధలను ఆయన ప్రత్యక్షంగా చూసి వారి కోసం మమత జనరల్ ఆస్ప‌త్రిని స్థాపించారు. రాజ‌కీయంగా వేరే పార్టీలో కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ అజ‌య్ కూడా క‌మ్యూనిస్టు భావ‌జాలంతో పేద‌ల అభ్యున్న‌తికి పాటుప‌డుతున్నార‌న్న పేరు ఉంది. ఈ నేప‌థ్యం కూడా అజ‌య్ వెంటే సీపీఐ ఉంద‌నే వాద‌న‌కు బ‌లం చేకూరుస్తోంది.

ఖ‌మ్మంలో సీపీఐ మార్క్

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా క‌మ్యూనిస్టుల కంచుకోట‌. 1999కి ముందు ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లోనూ హేమాహేమీల్లాంటి నేతలుండేవారు. సీపీఐ నుంచి మహ్మద్ రజబ్ అలీ, నల్లమల్ల గిరిప్రసాద్, పువ్వాడ నాగేశ్వరరావు (అజ‌య్ తండ్రి) వంటి నేతలు. సీపీఎం నుంచి బోడేపూడి వెంకటేశ్వరరావు, మంచికంటి రామకిషన్ రావు, తమ్మినేని వీరభద్రం ప్రభావవంతమైన నేతలుండేవారు. వీరిలో పువ్వాడ, తమ్మినేనిలు ఇప్పుడూ క్రియాశీలంగానే ఉన్నారు. మొదట్లో రెండు పార్టీలూ బలంగా ఉండేది. వ్యక్తిగతంగా, రాజకీయంగా విలువలు పాటించే నాయకత్వం.. నిబద్ధత గల క్యాడర్ ఉంటూ వామపక్షాలు ప్రజల పార్టీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇవన్నీ ఈ పార్టీలు ప్రజల్లో పట్టు సాధించడానికి, నిర్మాణం బలంగా ఉండడానికి కారణమైంది. 1994లో ఖమ్మం జిల్లాలోని 9 స్థానాల్లో ఏడు వామపక్షాలే గెలుచుకున్నాయి. ఆ ఎన్నికల్లో సీపీఐ 4 స్థానాలు, సీపీఎం 3 స్థానాలు గెలిచాయి. మిగతా రెండు సీట్లలో టీడీపీ విజయం సాధించింది.

ఖమ్మం నియోజకవర్గంలో కూడా కమ్యూనిస్టుల ప్రాభ‌వం ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. వాస్త‌వానికి ఇది క‌మ్యూనిస్టుల కంచుకోటగా చెప్పాలి. 1952, 57లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న ఖమ్మంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా 11 సార్లు వామపక్షాల అభ్యర్థులే విజయం సాధించారు. సీపీఎం, సీపీఐ నాలుగేసి సార్లు.. పీడీఎఫ్ మూడుసార్లు గెలిచాయి. పువ్వాడ నాగేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ఖమ్మం ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేశారు.  రాష్ట్రమంతా ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించినప్పుడు కూడా వామపక్షాలు ఖమ్మంలో ఎదురొడ్డి నిలిచాయి. అయితే.. ఇప్పుడు అంత‌టి బ‌ల‌మైన ప‌రిస్థితులు లేవు. అయిన‌ప్ప‌టికీ.. వారి ప్ర‌భావం.. ప్ర‌ధానంగా ఎన్నిక‌ల్లో సీపీఐ ఇక్క‌డ ముఖ్య భూమిక పోషిస్తోంది. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పువ్వాడ అజయ్ కుమార్ మెజార్టీలో క‌మ్యూనిస్టుల పాత్ర ఉంద‌న‌డం అతిశ‌యోక్తి కాదు. అలాగే.. మునుగోడు ఉప ఎన్నిక‌లో కూడా బీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెలుపులో సీపీఐ ముఖ్య భూమిక పోషించింది. ఈ నేప‌థ్యంలో ఖ‌మ్మం లో అంత‌ర్లీనంగా సీపీఐ మ‌ద్ద‌తుతో అజ‌య్ మ‌రోసారి విజ‌య‌బావుటా ఎగ‌ర‌వేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఖ‌మ్మం రాజ‌కీయాల్లో మున్ముందు ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 18 =