దుబ్బాక ఉపఎన్నిక: పోలీసుల సోదాలు, సిద్ధిపేటలో హైడ్రామా

Dubaka By-election, Dubbaka bypoll, Dubbaka Bypoll News, Dubbaka Elections, Dubbaka Elections News, High drama at Siddipet, police arrest BJP Leader, police arrest BJP president, Police raid on BJP, Police Raids and High Drama in Siddipet, TRS leaders in Siddipet

మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్‌ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ దుబ్బాక ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం నాడు పోలీసుల సోదాలు చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి రాత్రి వరకు హైడ్రామా నడిచింది. ముందుగా దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు మామ రాంగోపాల్‌రావు, ఆయన బంధువు అంజన్‌ రావు ఇళ్లలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు చేపట్టగా, అంజన్‌ రావు ఇంట్లో వారికీ రూ.18.67లక్షలు లభించాయి. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే రఘునందన్‌రావుతో పాటుగా పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అంజన్‌రావు ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది, అలాగే అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బులో కొంత మొత్తాన్ని బీజేపీ కార్యకర్తలు లాక్కొని, పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు కార్యకర్తలను చెదరకొట్టడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది.

అయితే సిద్ధిపేట ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌ నుంచి సిద్దిపేటకు వస్తుండగా, సిద్దిపేట శివారులో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కరీంనగర్‌ కు తరలించారు. అరెస్ట్ సమయంలో ఆయనకు గాయమయినట్టు తెలుస్తుంది. కరీంనగర్‌లో మీడియా సమావేశంలో సంజయ్‌ మాట్లాడుతూ, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనపై దాడి చేసిన తీరుపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పోలీసుల వైఖరికి నిరసనగా దీక్ష చేపడతానని ప్రకటించి, కరీంనగర్ ‌లోని తన కార్యాలయంలో ఆయన దీక్షకు దిగారు. అలాగే ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బండి సంజయ్ కు ఫోన్‌ చేసి, వివరాలు అడిగి తెలుసుకునట్టుగా తెలుస్తుంది.

ఇక సోమవారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి సిద్ధిపేట చేరుకొని రఘునందన్‌ రావు మామ ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని వారు మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. మధ్యాహ్నం మొదలైన నిరసనలు, ఆందోళనలు రాత్రివరకు కొనసాగాయి. ఈ ఘటనపై సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్ మాట్లాడుతూ, రెవెన్యూ అధికారులు, పోలీసులు చేసిన సోదాల్లో డబ్బు దొరికిందని పేర్కొన్నారు. పోలీసులతో వాగ్వాదం సమయంలో కార్యకర్తలు రూ. 12.80 లక్షలు తీసుకెళ్లారని, వీడియో ఫుటేజ్ ఆధారంగా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. మరోవైపు పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బులతో తనకేం సంబంధం లేదని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన విమర్శించారు. ఈ ఘటనపై టిఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ఉపఎన్నికల్లో గెలువలేక బీజేపీ నాయకులు అడ్డదారిలోప్రజల సానుభూతి పొందేందుకు చూస్తున్నారని అన్నారు. పట్టుబడిన డబ్బుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ నాయకులు అసత్య ప్రచారానికి దిగుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 19 =