మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి కేంద్రం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వట్లేదు: మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli Dayakar Rao Held a Press Meet on Mission Bhagiratha

రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం, నిధులు విషయంలో కేంద్ర వివ‌క్ష‌ సహా ప‌లు అంశాల‌పై ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఇంటింటికి త్రాగునీరు అందించే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇటీవల ఇచ్చిన ర్యాంకింగ్ లో 98 శాతంతో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకాన్ని 46 వేల 123 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టామని, ఇందులో 80 శాతం నిధులను హడ్కో నాబార్డులతోపాటు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించామని చెప్పారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం ఇప్పటికి 33 వేల 400 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాం. 38 వేల కోట్ల రూపాయలతోనే ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే మిషన్ భగీరథ కోసం పరిపాలన అనుమతి ఇచ్చిన మొత్తంలో 8 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని చెప్పారు.

జాతీయ వాటర్ మిషన్-2019లో మిషన్ భగీరథకు మొదటి బహుమతి:

మిష‌న్ భ‌గీర‌థ ద్వారా రాష్ట్రంలో 23 వేల 787 ఆవాసాలలోని ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం. ఇంటింటికీ నీరు అందాల్సిన మరో 188 ఆవాసాలకు కూడా నీటిని అందించే ప్ర‌క్రియ మొద‌లు పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 18 వేల 175 వాటర్ ట్యాంకులలో, ఇప్పటికి 18 వేల 76 పూర్తయ్యాయి. మిగిలిన 99 ట్యాంకులు కూడా న‌వంబ‌ర్ 30 వరకు పూర్తవుతాయి. మొత్తం 124 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా మిషన్ భగీరథ నీరు అందుతోంది. సమర్ధ వంతంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా “స్టెబిలైజేషన్” కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని గజ్వేల్ సెగ్మెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 7, 2016 ప్రారంభించారు. తాగునీటి సరఫరాలో తెలంగాణ ప్రభుత్వం చొరవను అభినందించారు. 2016 మే 22 నాటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ప్రజలు సురక్షిత మంచినీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రశంసించారు. మిషన్ భగీరథ పథకం మౌళిక సదుపాయాల కల్పనలో వినూత్న పథకం అని ప్రశంసిస్తూ హడ్కో 3 సార్లు అవార్డు అందించింది. నీటి వినియోగ సామర్ధ్యం 20 శాతం పెంచినందుకు, జాతీయ వాటర్ మిషన్-2019లో మిషన్ భగీరథకు మొదటి బహుమతి ఇచ్చింది. ఈ పథకానికి ఆన్ లైన్ పర్యవేక్షణకు 2018 లో స్కాచ్ అవార్డు కూడా లభించింది” అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

మిషన్ భగీరథకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు:

ప్రధానమంత్రి, నీతి అయోగ్, 15వ ఆర్థిక సంఘంతో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, రాష్ట్రాల ప్రతినిధులు మిషన్ భగీరథ పథకాన్ని స్వయంగా పరిశీలించి ప్రశంసలు కురిపించారు. ఇంత గొప్ప ప‌థ‌కంగా సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి అభినందించ‌డ‌మేగాదు, దేశంలో జ‌ల్ శ‌క్తి మిష‌న్ ద్వారా ఇదే త‌ర‌హాలో చేట్ట‌డానికి కేంద్రం నిర్ణ‌యించింది. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి నిధులివ్వాల‌ని సీఎం కేసీఆర్, మంత్రిగా నేను, రాష్ట్రం ఎంపీలు కేంద్ర ప్ర‌భుత్వాన్ని అనేక‌సార్లు కోరాం. మిషన్ భగీరథ పథకానికి 19 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి కదలికా లేదు. మిషన్ భగీరథ నిర్వహణకు ప్రతి ఏటా 2 వేల 110 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. క‌నీసం ఈ నిర్వ‌హ‌ణ ఖర్చులనైనా ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర‌ ప్రభుత్వం కోరడం జరిగింది. దీనిపై స్పందన లేదు.

మిషన్ భగీరథ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కూడా ‘జల్ జీవన్ మిషన్’ను పథకాన్ని రూపొందించింది. దానికి కావాల్సిన టెక్నాలజీని ఇంజనీరింగ్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నోసార్లు వచ్చి స్టడీ చేయడం జరిగింది. కేంద్రం స‌హా, అనేక రాష్ట్రాలు మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్నే వేర్వేరు పేర్ల‌తో దాదాపు య‌థాత‌థంగా అమ‌లు చేస్తున్న ఈ ప‌థ‌కంపై, తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఎందుకు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌దో కేంద్రం చెప్పాలి. గుజ‌రాత్ కి జల్ జీవన్ మిషన్ కింద 883 కోట్లు ఈ సంవ‌త్స‌రానికి కేంద్రం కేటాయించింది. అలాగే ఉత్త‌ర ప్ర‌దేశ్ లాంటి రాష్ట్రంలో 5.78శాతం మాత్ర‌మే ప‌నులు పూర్తి కాగా ఇప్పటికి 2550 కోట్లు కేటాయించారు. తెలంగాణకు మాత్రం అడిగిన నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు కూడా న‌యా పైసా ఇవ్వ‌లేదు” అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − six =