గత ఆరేళ్లలో రూ.8,113 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పన

Minister KTR Inaugurated Link Roads and Laid Foundation to Under Pass Bridge

గ్రేటర్ హైదరాబాద్ లో మెరుగైన జీవన ప్రమాణాల పెంపుకు గానూ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గత ఆరేళ్లలో రూ.8,113 కోట్ల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. సోమవారం నాడు శేరిలింగంపల్లి జోన్ పరిధిలో రూ.67.76 కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు లింక్ రోడ్లకు ప్రారంభోత్సవంతో పాటుగా, నందిహిల్స్ రోడ్ నెం-45 వద్ద అండర్ పాస్ నిర్మాణానికి మంత్రి కేటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా మరెప్పుడూ లేనివిధంగా హైదరాబాద్ నగరంలో రూ. 8,113 కోట్ల వ్యయంతో ఫ్లైఓర్లు, అండర్ పాస్ లు, రహదారుల నిర్మాణం, జంక్షన్ల సుందరీకరణ తదితర పనులను చేపట్టామని తెలిపారు. వీటిలో రూ. 6 వేల కోట్లతో ఎస్.ఆర్.డి.పి పనులు, హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.313 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం, సమర్థ రహదారుల నిర్వహణ కార్యక్రమం కింద రూ.1800 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్వహణ పనులను చేపట్టామని వివరించారు.

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరం హైదరాబాద్ అని, ఈ నగరాన్ని అభివృద్ది చేయడానికి శాస్త్రీయ పద్దతిలో ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ నగరాన్ని మేసర్స్ సంస్థ ప్రకటించిందని, మరో ప్రముఖ సంస్థ జె.ఎల్.ఎల్ కూడా వేగంగా అభివృద్ది చెందుతున్న నగరమని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. నగరంలోని రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.313 కోట్ల వ్యయంతో 137 లింక్ రోడ్లను అభివృద్ది చేపట్టామని మంత్రి కేటిఆర్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన పాలన సాధ్యమని తమ ప్రభుత్వం భావిస్తోందని, నగరంలో మరెక్కడైనా లింక్ రోడ్ల అభివృద్దికి అవకాశాలు ఉంటే సలహాలు, సూచనలు అందించాలని నగర ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ప్రత్యేక శ్రద్దతో నగరంలో 137 లింక్ రోడ్ల నిర్మాణాలను చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తప్పించడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

మూడు లింక్ రోడ్ల ప్రారంభం, బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన:

ఓల్డ్ బొంబాయి హైవే నుండి రోడ్ నెం.45 మార్గంలో రూ.23.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వెహికిలర్ అండర్ పాస్ నిర్మాణ పనులకు మంత్రి కేటిఆర్ శంకుస్థాపన చేశారు. నాలుగు లేన్ల ఈ అండర్ పాస్ నిర్మాణం వల్ల ఓల్డ్ బొంబాయి మార్గంలో గణనీయంగా ట్రాఫిక్ రద్దీ తగ్గనున్నది. ఓల్డ్ బొంబాయి హైవే నుండి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ మీదుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు రూ.19.51 కోట్ల వ్యయంతో 2.30 కిలోమీటర్ల మేర నిర్మించిన లింక్ రోడ్డును ప్రారంభించారు. వీటితో పాటు ఓల్డ్ బొంబాయి హైవే లెదర్ పార్కు నుండి రోడ్ నెం.45 హెచ్.టి లైన్ వరకు రూ.15.54 కోట్ల వ్యయంతో 1.20 కిలోమీటర్ల లింక్ రోడ్డు, మియాపూర్ రహదారి నుండి హెచ్.టి లైన్ వరకు రూ.9.61 కోట్ల వ్యయంతో కిలోమీటరు దూరంతో నిర్మించిన మరో లింక్ రోడ్డును మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 4 =