ఆగస్టు నాటికి విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ ప్రారంభం – మంత్రి తలసాని శ్రీనివాస్

Minister Talasani Srinivas Inspected the Works of Vijaya Telangana Mega Dairy Plant at Raviryal Ranga Reddy District,Minister Talasani Srinivas,Inspected the Works,Vijaya Telangana Mega Dairy,Vijaya Telangana Mega Dairy Plant,Mega Dairy Plant,Raviryal Ranga Reddy,Raviryal Ranga Reddy District,Mango News,Mango News Telugu,Telangana Govt,World Economic Forum,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

ఆగస్టు నాటికి విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ ను ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 250 కోట్ల రూపాయల వ్యయంతో 40 ఎకరాల విస్తీర్ణంలో 8 లక్షల లీటర్ల సామర్ధ్యంతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, డెయిరీ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ప్లాంట్ మొత్తం తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనుల గురించి నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ ఇంజనీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పనులను మరింత వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పాడి రంగం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు ఎంతో ప్రజాదరణ ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా విజయ డెయిరీ నష్టాల పాలై మూసివేసే దశకు చేరుకుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షలాది మంది ఆధారపడి జీవనం సాగిస్తున్న పాడి రంగం అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. అందులో భాగంగా పాడి రైతులకు అనేక రకాల ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఫలితంగా నష్టాలలో ఉన్న విజయ డెయిరీ నేడు 700 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కు చేరిందని చెప్పారు.

తార్నాక లోని లాలాపేటలో ఉన్న డెయిరీ ప్లాంట్ చాలా కాలం క్రితం నిర్మించినది కావడంతో అత్యాధునిక పరిజ్ఞానం తో కూడిన నూతన డెయిరీ ప్లాంట్ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఎంతో ఆదరణ ఉన్న విజయ డెయిరీ పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, స్వీట్ లస్సీ, మజ్జిగ, నెయ్యి, వెన్న, పన్నీర్, దూద్ పేడ, మైసుర్ పాక్, కోవా, బాసుంది, ఐస్ క్రీములు వంటి ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందని తెలిపారు. పూణే, ముంబై తదితర ప్రాంతాలలో విజయ నెయ్యికి ఎంతో డిమాండ్ ఉందని చెప్పారు. విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనతో లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకంను అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలకు పైగా పాడి రైతులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 1500 లీటర్లు అంతకన్నా ఎక్కువ పాలు పోసే పాడి రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాలు, పాల క్యానులు, విద్యుత్ సబ్సిడీ, సబ్సిడీ ద్వారా దాణా, మినరల్ మిక్చర్ మరియు ఇన్సూరెన్స్ సబ్సిడీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవే కాకుండా 1962 నెంబర్ కు కాల్ చేస్తే జీవాల వద్దకే వచ్చి వైద్య సేవలు అందించే విధంగా సంచార పశువైద్యశాలలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

పాడి ద్వారా అర్ధికాభివృద్ధి సాధించేందుకు సన్న, చిన్నకారు రైతులకు మహిళా పాల ఉత్పత్తిదారులకు పాడి పశువుల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, శ్రీనిధి బ్యాంకు ద్వారా, నాబార్డ్ ద్వారా ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో విజయ పాడి రైతులకు ఋణాలు అందజేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో పర్యాటక ప్రాంతాలు, హైవేలు, ప్రముఖ దేవాలయాలు తదితర ప్రాంతాలలో నూతనంగా 2 వేల డెయిరీ ఔట్ లెట్ లు, మొబైల్ ఔట్ లెట్ లను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. త్వరలో మరో 2 వేల ఔట్ లెట్ లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని అవసరమైన చర్యలను చేపట్టినట్లు తెలిపారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఔట్ లెట్ లతో వేలాది మంది నిరుద్యోగ యువత ఉపాధి పొందుతున్నారని చెప్పారు. పాడిరంగానికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు కారణంగానే దళితబందు ద్వారా ఆర్ధిక సహాయం పొందిన లబ్దిదారులు కూడా పాడి పశువుల కొనుగోలుకే అత్యధిక శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వెంట ఎన్డీడీబీ ఇంజనీరింగ్ విభాగం జీఎం సునీల్ సిన్హా, శశి కుమార్ తదితరులు ఉన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eighteen =