తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా “మన ఊరు–మన బడి’’ ప్రణాళిక

Cabinet approves Mana ooru mana badi programme, Mana Badi Program, Mana Badi Program News, Mana Badi Program to Develop Govt Schools, Mango News, Telangana Cabinet Approved Mana Ooru, Telangana Education Minister, telangana education news today, Telangana Mana Ooru-Mana Badi, Telangana to introduce English medium in govt schools, Telangana to launch Mana Ooru-Mana Badi to strengthen govt schools, TS to enact law for regulating pvt school fee

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7289 కోట్లతో ‘‘మన ఊరు–మన బడి’’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.

మన ఊరు–మన బడి ప్రణాళిక:

ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం విద్యాశాఖలో ‘‘మన ఊరు–మన బడి’’ అనే వినూత్న కార్యక్రమానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతో పాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మౌలిక వసతుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ‘మన ఊరు–మన బడి’ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విధంగా రెండేండ్ల వ్యవధిలో రూ.4 వేల కోట్లతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనతో నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్రంలోని పాఠశాలల సమగ్రాభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడుతారు.

ఇందులో భాగంగా సాంకేతికత విజ్ఞాన ఆధారిత విద్యను అందించడం కోసం డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటు, వాటితో పాటు అదనపు తరగతి గదులు ఏర్పాటు, మరమ్మత్తులు, అవసరమైన మేరకు ఫర్నిచర్, మరుగుదొడ్లు మరియు ఇతర వసతుల కల్పన ఈ ప్రణాళిక ఉద్దేశ్యం. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం, ఈ కార్యక్రమ అమలు, విధివిధానాల రూపకల్పన కోసం మంత్రుల బృందం ఇప్పటికే 23 మార్చి 2021, 8 ఎప్రిల్ 2021, 17 జూన్ 2021 తేదీలలో మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, కెటిఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కూడిన మంత్రుల బృందం సమావేశమైంది. ‘‘మన ఊరు–మన బడి’’ అమలు కోసం మంత్రుల బృందం పలు అంశాలను పొందుపరిచి విధివిధానాలను రూపొందించింది.

మన ఊరు–మన బడి ప్రణాళిక ముఖ్యాంశాలు :

  • మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం గా చేపట్టి మూడు దశల్లో మూడు సంవత్సరాల వ్యవధిలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం.
  • 2021–22 విద్యా సంవత్సరం మొదటి దశలో, మండల కేంద్రాన్ని యూనిట్ గా తీసుకొని అన్ని రకాల (ప్రాథమిక పాఠశాల, మాద్యమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాలల్లో) అత్యధికంగా ఎన్ రొల్మెంట్ అయిన 9,123 (35% స్కూళ్లలో 65% విద్యార్థులను) ప్రభుత్వ మరియు స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో ముందుగా కార్యక్రమం అమలు చేయాలి.
  • మన ఊరు–మన బడి కార్యక్రమం క్రింద 12 రకాల విభాగాలను పటిష్టపరిచేందుకు ప్రతిపాదించడం జరిగింది.
    1.నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు
    2.విద్యుదీకరణ
    3.త్రాగు నీటి సరఫరా
    4.విద్యార్థులు మరియు సిబ్బందికి సరిపడు ఫర్నిచర్
    5.పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం
    6.పెద్ద మరియు చిన్న మరమ్మత్తులు
    7.గ్రీన్ చాక్ బోర్డులు
    8.ప్రహారీ గోడలు
    9.కిచెన్ షెడ్లు
    10.శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు
    11.ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్
    12.డిజిటల్ విద్య అమలు
  • మన ఊరు–మన బడి కార్యక్రమంలో పేర్కొన్న 12 విభాగాల అనుబంధ అంచనాల ఆధారంగా మొత్తం బడ్జెట్ రూ.7,289.54 కోట్లు అవసరమవుతాయి. ఇందులో భాగంగా మొదటి దశలో 9,123 పాఠశాలలకు (35%) అంచనా బడ్జెట్ రూ.3,497.62 కోట్లుగా ఉంది.
  • ఎంపిక చేయబడిన ప్రతి పాఠశాలలో చేపట్టే కార్యక్రమ అమలు కోసం అన్ని పనులకు పరిపాలనా అనుమతిని జిల్లా కలెక్టర్లు ఇస్తారు. ఒక మండలంలో కార్యక్రమాన్ని అమలుచేసే ఏజెన్సీ ఒకటే ఉండే విధంగా అందుబాటులో ఉన్న ఏజెన్సీల నుంచి తమ జిల్లాలో అమలు చేసే ఏజెన్సీని ఎంచుకోవచ్చు. అలాగే అమలు చేసే ఏజెన్సీ విభాగాల వారీగా సాంకేతిక అనుమతిని ఇస్తుంది.
  • ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పటిష్టత : మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా మరియు అన్ని పనులను వేగంగా అమలు చేయడం కోసం పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్.ఎమ్.సి.)లకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది.
  • మన ఊరు–మన బడి కార్యక్రమానికి నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను రాష్ట్ర ఐటి డిపార్ట్ మెంట్ పర్యవేక్షిస్తుంది.
  • పాఠశాల నిర్వహణ కమిటీలకు దశల వారీగా పారదర్శక పద్ధతిలో నిధులను విడుదల చేస్తారు.
  • సామాజిక తనిఖీ : గ్రామీణాభివృద్ధి శాఖ కింద పనిచేస్తున్న ‘‘సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్సపరెన్సీ’’ (ఎస్.ఎ.ఎ.టి.) అనే సంస్థ చేత సామాజిక తనిఖీ నిర్వహిస్తారు.
  • పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు: ప్రతి స్కూల్ లో పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేసి, ఇందులోని ఇద్దరు క్రియాశీలక సభ్యులను, సర్పంచ్, ఇద్దరు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. దాతలు, సిఎస్ఆర్ నిధులు తదితర మార్గాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.
  • ఆర్థికాంశాలు మరియు కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి నిర్ధిష్ట కాలపరిమితితో కూడిన అంశాలవారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారుచేసుకోవాలి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − four =