ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న సమావేశం కానున్న సీఎం కేసీఆర్

CM KCR On TSRTC Issue, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana CM KCR Will Meet RTC Workers, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSRTC Latest Updates

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 1, ఆదివారం నాడు రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్ లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఆహ్వానించాలని, అందుకోసం వారికీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశానికి ప్రతి డిపో నుంచి హాజరయ్యే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని, అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సీఎం కోరారు. డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ కు తీసుకురావాలని, వారికి అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజనం అనంతరం కార్మికులతో నేరుగా కేసీఆర్ నేరుగా మాట్లాడనున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకశంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు, ఆర్టీసీ ఎండి, ఇ.డి.లు, ఆర్.ఎం.లు, డివిఎంలను ఆహ్వానించారు. అలాగే ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లో చేర్చుకోవడానికి అనుమతించి, ఆర్టీసీ మనుగడను కాపాడడానికి ప్రభుత్వం తరుఫున చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినందుకు, కార్మికులతో నేరుగా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నందుకు రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మరో వైపు తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘమైన టీఎంయూ కార్యాలయాన్ని బస్‌భవన్‌ అధికారులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరాలని పిలుపునిచ్చిన సందర్భంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు ప్రోత్సహించిన కార్మిక యూనియన్లను క్షమించేది లేదని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకే తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఏంయూ) కార్యాలయానికి అధికారులు తాళాలు వేసినట్టు తెలుస్తుంది. అలాగే ఆర్టీసీ యూనియన్ నేతల రిలీఫ్ డ్యూటీని కూడా ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం నాడు రద్దు చేసింది. 30 మంది కార్మిక నేతలకు ఇప్పటివరకు వర్తించిన రిలీఫ్ డ్యూటీలు ఇకపై ఉండవని స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసేందుకు వీలుగా యూనియన్ నేతలకు, డ్యూటీల నుంచి ఆర్టీసీ యాజమాన్యం మినహాయింపు ఇచ్చేది. విధులకు హాజరుకాక పోయినా కూడా కార్మిక నేతలకు జీతాలు చెల్లించేవారు. రాష్ట్రవ్యాప్తంగా డిపోల స్థాయిలో కూడా ఈ విధానానికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఈ రోజు స్వస్తి పలికింది.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − three =