రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

Congress dares KTR for open debate on employment issues, KT Rama Rao reiterates 1.3 lakh jobs, KTR, KTR Open Letter on Job Creation in Telangana, KTR releases list of jobs filled, KTR Writes Open Letter on Job Creation, KTR Writes Open Letter on Job Creation in Telangana, Mango News, telangana, Telangana Minister KTR, TRS Working President KTR

రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఉద్యోగాల కల్పనపై కీలక విషయాలు వెల్లడించారు. “నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందన్న మాట ఇవాళ తెలంగాణలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. తమకు అలవాటైన అర్థసత్యాలు, అసత్యాలతో ప్రజలను ముఖ్యంగా యువతను గందరగోళపరచడానికి ప్రతిపక్షాలు మరో కొత్త నాటకాన్ని మొదలుపెట్టాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన ఉద్యోగాల భర్తీ విషయంలో నిజాలను దాచి కాంగ్రెస్, బీజేపీలు చెపుతున్న జూటా మాటలు అందులో భాగమే. 2014 నుంచి వివిధ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యను మీడియా ముఖంగా ప్రజల ముందుంచాను. దీంతో పాటు మా ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను అంకెలతో సహా సాధికారికంగా వివరించాను. ఈ సమాచారం అంతా వివిధ శాఖల నుంచి తీసుకున్నదే. ఈ మేరకు 2014 నుంచి 2020 వరకు 1 లక్షా 32 వేల 899 ఉద్యోగాలను భర్తీ చేశాము. ఉద్యోగాల కల్పనపై మా ప్రభుత్వ నిబద్దతపై ఎవరికైనా అనుమానం ఉంటే ఆయా శాఖల్లో మరోసారి ధృవీకరించుకోవచ్చని మీడియా ముఖంగా తెలియచేశాను” అని మంత్రి కేటీఆర్ అన్నారు.

“అయితే ఈ నిజాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్యాలతో తెలంగాణ యువతను అయోమయానికి, గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలను నిన్నటి నుంచి చేస్తున్నాయి. జానారెడ్డి లాంటి సీనియర్ రాజకీయ నేత కూడా ఈ అసత్యాలను వల్లె వేసేందుకే మొగ్గు చూపడం బాధాకరం. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని టీఆర్ఎస్ చెప్పినట్టు జానారెడ్డి ఈ రోజు మీడియాతో అన్నారు. అవును మూమ్మాటికి జానారెడ్డి చెప్పింది నిజమే. ఇచ్చినమాట ప్రకారం మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగాలు కల్పిస్తూనే ఉన్నాము. ఇదే విషయాన్ని నిన్న నేను ప్రజల ముందుంచాను. ఇంతేకాదు తమ పదేళ్ల హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో త్వరలో చెప్తామన్న జానారెడ్డి గారు, అందులో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా చెప్పాలని కోరుతున్నాను. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులతో పాటు ప్రతిపక్షాలు మీడియా ముఖంగా అవాస్తవాలు మాట్లాడుతున్న నేపథ్యంలో వారి దుష్ప్రచరాన్ని ఎండగట్టేలా మా ప్రభుత్వం భర్తీ చేసిన లక్షా 32 వేల 899 ఉద్యోగాల వివరాలను అంకెలతో సహా అందిస్తున్నాను. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువతకి మరోసారి స్పష్టత ఇచ్చేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలతో వారు అయోమయానికి గురికాకుండా ఉండే ఉద్దేశంతో ఈ వివరాలు ఇక్కడ జతపరుస్తున్నాను. వీటిని మరోసారి చూసైనా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని మానుకుంటాయని ఆశిస్తున్నాను” అని కేటీఆర్ అన్నారు.

సంబంధిత శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు:

1. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – 30,594
2. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ -31,972
3. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు- 3,623
4. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ – హైదరాబాద్ – 179
5. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ – హైదరాబాద్- 80
6. డైరెక్టర్, మైనారిటీస్ వెల్ఫేర్ – 66
7. జూనియర్ పంచాయతీ సెక్రెటరీస్ – 9,355
8. డిపార్ట్మెంట్ అఫ్ ఆయుష్ – 171
9. టీఎస్ జెన్ కో- 856
10. టీఎస్ ఎన్పీడీసీఎల్ – 164
11. టీఎస్ ఎస్పిడిసిఎల్ – 201
12. టీఎస్ ట్రాన్స్ కో – 206
13. టీఎస్ ఆర్టీసీ – 4,768
14. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్-12,500
15. జెన్కో, ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్ పి డి సి ఎల్ – 6,648
16. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ – 22,637
17. హైదరాబాద్ జలమండలి- 807
18. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ – 243
19. డిసిసిబిలు – 1,571
20. భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు – 6,258

–> మొత్తం ఉద్యోగాల సంఖ్య – 1,32,899

“ఇలా ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే విప్లవాత్మకమైన టీఎస్ఐపాస్ విధానంతో ప్రైవేటు రంగంలో సుమారు 14 లక్షల ఉద్యోగాలను గత ఆరు సంవత్సరాల్లో తెలంగాణ యువతకు కల్పించాము. ఓ వైపు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన చేపడుతూనే, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీని అత్యంత పారదర్శకంగా మా ప్రభుత్వం చేపట్టింది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మా ప్రభుత్వం కొనసాగిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాల భర్తీ అంటేనే అత్యంత అవినీతిమయం అన్న అపప్రధ ఉండేది. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అప్పట్లో అవినీతి పబ్లిక్ సర్వీస్ కమీషన్ గా పేరుపొందింది. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భర్తీ చేసిన ఉద్యోగాల కన్న ఎక్కువ ఉద్యోగాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మా ప్రభుత్వం భర్తీ చేసింది. అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ నియామక ప్రక్రియ గురించి టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన ఏ ఒక్క నిరుద్యోగిని అడిగినా చెప్తారు. ఇదీ ఉద్యోగాల భర్తీ పై మా ప్రభుత్వానికున్న చిత్తశుద్దికి నిదర్శనం” అని మంత్రి కేటీఆర్ చెప్పారు.

“ఏ ప్రభుత్వానికి అయినా ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియనే. ఆమేరకు తాజాగా గౌరవ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారు మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేస్తామనడంలో ఎవరికి సందేహం అక్కర్లేదు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో గత ప్రభుత్వాల కంటే ఎక్కువ నిబద్దత, చిత్తుశుద్దితో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి యువత అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం కొన్ని పార్టీలు, నాయకులు పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాల ప్రభావానికి లోను కాకుండా యువత ఆలోచించాలని కోరుతున్నాను” అని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =