నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా నియమించాలని ఏపీ గవర్నర్ ఆదేశాలు

ap governor biswabhusan harichandan, AP Govt to Appoint Nimmagadda Ramesh Kumar as SEC, AP News, AP SEC Nimmagadda Ramesh Kumar, Governor Biswabhusan Harichandan, Nimmagadda Ramesh Kumar, Nimmagadda Ramesh Kumar as SEC

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నియామక అంశం మరో మలుపు తిరిగింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు.

ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) తొలగింపు అంశంపై ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోలను రద్దు చేసి, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నే తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును అమలు చేయకుండా రాష్ట్రప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు , గవర్నర్‌ను కలిసి కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్‌ఈసీగా నియమించాలని కోరాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు సూచించింది.

ఈ నేపథ్యంలో జూలై 20 న గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పుపై చర్చించి, తిరిగి తనను ఎస్‌ఈసీగా నియమించాలంటూ గవర్నర్‌కు నిమ్మగడ్డ విజ్ఞాపన పత్రం అందజేశారు. నిమ్మగడ్డ  విజ్ఞప్తిపై రాజ్‌భవన్‌ తాజాగా స్పందిస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − six =