ఏపీ స‌ర్కారు చ‌ర్చ‌కు వెన‌కాడుతోందా? కావాల‌నే విప‌క్షం ఇబ్బంది పెడుతోందా?

AP Govt, CM Jagan, Chandrababu Naidu, AP Politics, BRS, Balakrishna, ICT, Andhra Pradesh government, Legislative Assembly, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, andhra pradesh, Mango News Telugu, Mango News
AP Govt, CM Jagan, Chandrababu Naidu, AP Politics

“కేసీఆర్‌కు సూటిగా సవాల్‌ విసురుతున్నా.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులు, జలాలపై చర్చ పెడదాం. ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. రెండు రోజులపాటు దీనిపై చర్చిద్దాం. చాలవంటే సమావేశాలను పొడిగిద్దాం. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, కవిత.. అందరూ రండి. అవసరమైతే.. ఉమ్మడి సమావేశాలు నిర్వహిద్దాం. మీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి. మీకు పూర్తి అవకాశం ఇస్తాం. ఒక్క నిమిషం కూడా మైక్‌ కట్‌ చేయం. నిజానిజాలేంటో నిరూపిద్దాం’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారో ఈ చర్చల్లో తేలిపోతుంది.” ఇదీ తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్షానికి ఇటీవ‌ల విసిరిన స‌వాల్‌. స‌స్పెన్స‌న్‌లు లేకుండా చ‌ర్చ‌ల‌కే ప్రాధాన్యం ఇస్తామ‌ని వెల్ల‌డించారు.

ఇప్పుడే కాదు.. తొలి అసెంబ్లీ స‌మావేశాల్లోనూ రేవంత్ ఇదే విష‌యం స్ప‌ష్టం చేశారు. ఓ అంశంపై విప‌క్షం రాద్దాంతం చేస్తూ స‌భ‌కు ప‌దే ప‌దే అడ్డం ప‌డుతున్న‌ప్పుడు.. బీఆర్‌ఎస్ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ స‌భ్యులంద‌రూ డిమాండ్ చేశారు. ఇంత‌లో రేవంత్ మైకు అందుకుని వ‌ద్దు.. వ‌ద్దు.. మేం స‌స్పెన్ష‌న్ లు చేయ‌బోం. స‌మాధానాలు చెబుతాం.. వారి త‌ప్పుల‌ను ఎత్తి చూపుతాం.. మా మాట‌ల‌న్నీ వారు వినాలి.. ఇదే విప‌క్షానికి స‌రైన శిక్ష.. అంటూ హుందాగా స్పందించారు. అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ కొన‌సాగిస్తామ‌న్న సందేశం ఇస్తూనే.. విప‌క్ష పార్టీ బీఆర్ ఎస్ కు చుర‌క‌లంటించారు. కానీ.. ఏపీలో అందుకు విరుద్ధంగా జ‌రుగుతోంది. స‌మావేశాలు ప్రారంభ‌మైన కొద్ది సేప‌టి నుంచే.. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల రాద్దాంతాలు మొద‌ల‌వుతున్నాయి. స‌మాధానం చెప్ప‌లేక స‌స్పెన్స‌న్‌లు చేయాలంటూ అధికార స‌భ్యుల డిమాండ్‌లు పెరుగుతున్నాయి. స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌లూ కొన‌సాగుతున్నాయి. ఈ రోజు కూడా అదే సీన్ క‌నిపించింది.

నిన్న ప్రారంభ‌మైన‌ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 8 వరకు కొన‌సాగ‌నున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశాన్ని విప‌క్ష పార్టీ టీడీపీ బహిష్కరించింది. గవర్నర్ ప్రసంగం సమయంలోనే టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ.. గవర్నర్ ప్రస్తావించిన అంశాలను పూర్తిగా విన‌కుండానే వాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మధ్యలోనే వెళ్లిపోయారు. అనంత‌రం టీడీపీ సభ్యులు లాబీల్లోనూ నినాదాలు చేసారు. ఆ తరువాత బీఏసీ సమావేశాన్ని బహిష్కరించారు. నిన్ని అలా జ‌రిగితే.. ఈరోజు స‌మావేశానికి వ‌చ్చిన టీడీపీ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మైన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించడంతో స్పీకర్‌ తమ్నినేని సీతారాం వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.  సమావేశాలు ప్రారంభమయ్యాక  గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు.  వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతుండగా,వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.

ధరల పెరుగుదలపై చర్చించాలని మరోమారు డిమాండ్‌ చేశారు.  పేపర్లు చింపి విజిల్స్‌ వేస్తూ  స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులను సభ నుంచి  ఒక రోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు సీతారాం ప్రకటించారు.అయినా వారు  సభ నుంచి బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్‌ వచ్చి వారిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సస్పెండైన వారిలో కింజరాపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, బెందాలం అశోక్, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, నిమ్మల రామానాయుడు, గణబాబు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, గద్దెరామ్మోహన్ ఉన్నారు.

ప్ర‌తిప‌క్షం అడిగిన అంశాల‌పై చ‌ర్చ‌కు అధికార ప‌క్షం సిద్ధంకావ‌డం లేదు. జ‌రుగుతున్న చ‌ర్చ‌లో స‌హేతుకంగా ప్ర‌తిప‌క్షం పాల్గొన‌డం లేదు.. ఆందోళ‌న‌లు, అభ్యంత‌రాల‌తో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. రాజ‌కీయంగా హైలెట్ కావాల‌నే ఉద్దేశంతో.. అధికార‌, విప‌క్ష పార్టీలు సామాజిక అంశాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే  విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రో రెండు రోజులు కొన‌సాగుతున్న స‌మావేశాల్లో అయినా.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స‌హేతుకంగా చ‌ర్చించాల‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 2 =