టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి : పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Appeals AP Govt to Increase Covid Testing Centers

దేశంలోను, తెలుగు రాష్ట్రాలలో నమోదవుతున్న కోవిడ్ రోగుల గణాంకాలు ఆందోళనకరంగానే వున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతో పాటు పోలీసులు, స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారని వస్తున్న వార్తలు విచారం కలిగిస్తున్నాయన్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు, రాజకీయవేత్తలు కూడా కోవిడ్ బారినపడుతుండడం దీని తీవ్రతను తెలియచేస్తోందని, తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని అన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

కోవిడ్ పరీక్ష కేంద్రాలు పెంచాలి, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అవసరం:

“ప్రస్తుత పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు మరింత అప్రమత్తతతో కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ పరీక్షలు పెంచడం ద్వారా వైరస్ సోకినవారిని గుర్తించి వైద్యం చేసే అవకాశం కలుగుతుంది. ఇందుకోసం పరీక్ష కేంద్రాలు పెంచాలి. మొబైల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది. అలాగే కరోనా మొదటి వేవ్ సమయంలో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుత తరుణంలో వాంఛనీయం కాదు. కోవిడ్ ఉధృతి తగ్గే వరకు తరగతులను వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. పిల్లలకు వాక్సినేషన్ పూర్తికాకపోవడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను” అని అన్నారు.

“ఈ క్లిష్ట తరుణంలో మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని వెల్లడిస్తోంది. ఈ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి, వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలి. అవి లేకుండా మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటి?, ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలి, మాస్క్ లేకుండా దయచేసి బయటకు రాకండి. భౌతిక దూరం పాటించండి. వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లల విషయంలో అప్రమత్తత పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + thirteen =