ఎల్‌కే అద్వానీకి భారతరత్న పురస్కారం

Bharat Ratna award, LK Advani, BJP
Bharat Ratna award, LK Advani, BJP

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వాణీకి అరుదైన గౌరవం లభించింది. దేశంలోనే అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన భారతరత్న ఆయన్ను వరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అద్వానీని భారతరత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. భారతీయ జనతా పార్టీని స్థాపించినప్పటి నుంచి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అద్వానీ ఎంతో శ్రమించారన్న మోడీ.. దేశాభివృద్ధిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు.

అద్వాణీని భారతరత్న పురస్కారంతో గౌరవించనున్నామని.. ఆయనతో మాట్లాడి శుభాకంక్షలు తెలిపానని మోడీ పేర్కొన్నారు. దేశాభివృద్ధికి అద్వానీ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. గొప్ప రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరన్న మోడీ.. క్షేత్రస్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి.. ఉప ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని చెప్పుకొచ్చారు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేశారన్నారు. ఆయన రాజకీయ జీవితం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చని మోడీ పేర్కొన్నారు.

అద్వానీ అవిభక్త భారత్‌లోని కరాచీలో 8 నవంబర్ 1927న జన్మించారు. ప్రస్తుతం కరాచీ పాకిస్థాన్‌లో ఉంది. అక్కడే పాఠశాల విద్యను అద్వానీ అభ్యసించారు. కరాచీలోని డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్యను పూర్తి చేశారు. 1941లో ఆర్ఎస్ఎస్‌లో చేరిన అద్వానీ 1947లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కరాచీ విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. దేశ విభజన తర్వాత వారి కుటుంబం ముంబై వచ్చి ఇక్కడే స్థిరపడింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అద్వానీ 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

1980లో జనతా పార్టీని వీడిన అద్వానీ.. అదే ఏడాది వాజ్‌పేయ్‌తో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1996లో బీజేపీ అధికారంలోకి రావడంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. అయితే అప్పుడు కొద్దిరోజులకే బీజేపీ ప్రభుత్వం కూలిపోయినప్పటికీ.. 1998లో తిరిగి మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. 2009లో బీజేపీ ప్రధానిగా అభ్యర్థిగా అద్వానీ పోటీ చేశారు. కానీ ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. దీంతో ఆయన ప్రధాని కాలేకపోయారు. ఇక 2014 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి పోటీ చేసి అద్వానీ గెలుపొందారు. 2019 నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 1 =