హైద‌రాబాద్ పార్ల‌మెంట్‌పై క‌మ‌లం క‌న్ను

BJP, Hyderabad, Parliament, Hyderabad Parliament, Lok sabha Elections, PM Modi, Telangana BJP, G Kishan Reddy, Telangana Latest Updates, Revanth Reddy, Telangana News Today, Narendra Modi, Telangana News Today In English, Mango News Telugu, Mango News
Hyderabad Parliament, BJP, Lok sabha Elections, PM Modi

ప్ర‌స్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తెలంగాణలోని హైద‌రాబాద్ పార్ల‌మెంట్‌ను కైవ‌సం చేసుకోవాల‌ని క‌మ‌లం పార్టీ విస్తృత వ్యూహాలు ర‌చిస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో బ‌ల‌మైన పునాదులు ఏర్ప‌ర‌చుకోవాల‌ని య‌త్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో పార్టీలో ఏర్ప‌డిన నిరుత్సాహాన్నిపోగొట్టి త‌మ బ‌లం నిరూపించుకోవ‌డం ఒక‌వైపు.. ఎంఐఎంకు చెక్ పెట్టాల‌న్న త‌ప‌న మ‌రోవైపు ఆ పార్టీలో క‌నిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో జ‌రిగే లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశ‌గా వ్యూహాలు ర‌చించాల‌ని ఢిల్లీ పెద్ద‌లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా గ‌తం కంటే పార్టీ ఎక్కువే స్థానాలే గెలిచింద‌న్న విష‌యాన్ని గుర్తు చేయాల‌ని భావిస్తున్నారు. బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరిగింద‌ని, గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 4 నాలుగు స్థానాల్లోనే గెలిచిన బీజేపీ.. ఈసారి వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్ర‌చారం చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయ‌డం ద్వారా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌వా ఎక్క‌డా త‌గ్గ‌లేద‌ని తేలింది. దీంతో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 స్థానాలు గెలవడమే లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌పై కూడా బాగా దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నవే అని ప్ర‌చారం చేయాల‌ని నేత‌లు నిర్ణ‌యించారు. దీంతో పాటు గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్ట‌మెంట్ ప‌రిధిలో క‌మ‌లానికి ప‌డ్డ ఓట్ల‌ను స‌మీక్షించే ప‌నిలో ఉన్నారు. హైద‌రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో మలక్ పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో గోషామ‌హ‌ల్ త‌ప్పా.. మిగ‌తా వ‌న్నీ సుదీర్ఘ‌కాలంగా ఎంఐఎం ప్రాతినిధ్యంలో ఉన్న‌వే. అక్క‌డ మాత్రం రాజాసింగ్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. ఇప్పుడు ఆయ‌నే హైద‌రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి హైదరాబాద్‌ పార్లమెంట్‌లో ఓటు బ్యాంక్  పెర‌గ‌డం క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తోంది. పాతబస్తీ పరిధిలో మజ్లిస్‌ గెలిచిన 7 నియోజకవర్గాల్లో కమలం ఓట్లు అమాంతం పెరిగాయి. 2018 ఎన్నికలతో పోలిస్తే 2023 నాటికి 22,775 ఓట్లు పెరగడం విశేషం. 2018 ఎన్నికల్లో 1,30,222 ఓట్లు రాగా, 2023లో 1,52,997 ఓట్లు వచ్చాయి. చార్మినార్‌లో 5,037, చాంద్రాయణగుట్టలో 1,336, యాకుత్‌పురాలో 5,746, మలక్‌పేటలో 2,851, కార్వాన్‌లో 3,985, బహుదూర్‌పురాలో 4,222 ఓట్లు పెరిగాయి. నాంపల్లిలో మాత్రం 406 ఓట్లు తగ్గాయి. హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే కార్వాన్‌, మలక్‌పేట, యాకుత్‌పురాలో పార్టీ బలంగా ఉంది. చార్మినార్‌, బహుదూర్‌పురాలో ఓటు బ్యాంక్‌ పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో కొంచెం కష్టపడితే పార్లమెంట్‌లో ఎక్కువ ఓట్లు రాబట్టుకోవచ్చన్నది పార్టీ యోచన. 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి భగవంతరావు 3.11,414 ఓట్లు ఽసాధించి పాతబస్తీలో పార్టీకి పట్టు ఉందని నిరూపించారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన 2,35,285 ఓట్లు సాధించడం విశేషం.

అటు దేశ వ్యాప్తంగా మోడీ హ‌వా.. ఇటు లోక్ స‌భ ప‌రిధిలో బీజేపీకి పెరిగిన ఆద‌ర‌ణ, గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన భ‌గ‌వంత్‌రావు తొలి రౌండ్ల‌లో ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డం వంటి కార‌ణాల‌తో గ‌ట్టిగా కృషి చేస్తే హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఐఎం కోట‌ను బ‌ద్ద‌లుకొట్ట‌డం క‌ష్టం కాద‌ని పార్టీ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే అమిత్ షా ఆ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో త్వ‌ర‌లోనే స‌మావేశం కానున్నారు. ముస్లింల‌ను కూడా ఆక‌ట్టుకునేలా త‌గిన ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చించేందుకు సిద్దం అవుతున్నారు. ఈసారి ఇక్క‌డి నుంచి రాజాసింగ్ ను కాదంటే భ‌గ‌వంత్ రావును నిల‌బెట్టే ఆలోచ‌న‌లో అధిష్ఠానం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − two =