ఇంటిపై దాడి నేపథ్యంలో ఎంపీ అరవింద్ ను కలిసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

ఎంపీ అరవింద్ విమర్శలు చేస్తే, వారి నివాసంపై, కుటుంబ సభ్యులపై దాడులు చేయడమేంటి? అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం ఆయన దాడికి గురైన హైదరాబాద్‌లోని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిని సందర్శించారు. దాడి జరిగిన పరిసరాలను పరిశీలించి, అరవింద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలలో విమర్శలు సహజమని, అయితే ఎమ్మెల్సీ కవిత నిన్న మీడియా సమావేశంలో ఎంపీని బూతులు తిట్టారని అన్నారు. ఆమె మాట్లాడిన తర్వాత వారి పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు, మద్దతుదారులు ఎంపీ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు.

ఎంపీ అరవింద్ ఇంటిపై జరిగిన సంఘటనపై న్యాయ పోరాటంతో పాటు క్షేత్ర స్థాయిలో ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా లేదా ఇళ్లపై దాడులను తాను ఎప్పుడూ ప్రోత్సహించనని, కానీ నిన్న ఎంపీ ఇంటిపై దాడి ఎందుకు చేశారో అర్థం కావడం లేదని అన్నారు. దాడి జరిగిన సమయంలో డీఎస్ ఇంట్లో లేకపోవడం అదృష్టమని, దాడి చేసినవారు పూజగదిని, దేవుళ్ళ పటాలను కూడా ధ్వంసం చేసారని మండిపడ్డారు. దుర్గా దేవి, తులసి మాతపై దాడి చేశారని, ఇంటిపై దాడి చేసినందుకు బాధ లేదని, దేవుళ్లపై దాడి చేసినందుకే బాధగా ఉందని తెలిపారు. హిందువులైతే దేవుళ్ళపై దాడి చేయరని, అయినా అరవింద్ ఎక్కడా బూతులు మాట్లాడలేదని అన్నారు. ఇంటిపై మా పార్టీ వాళ్ళు దాడి చేసినా నేను సహించను, ప్రాణాలు పోతే ఎవరు ఇస్తారు? అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అరవింద్ నివాసంపై దాడి ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 4 =