తెలంగాణ వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా హార్టికల్చర్ విధానం: సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Holds Review on Comprehensive Planning, CM KCR Review on Comprehensive Planning, CM KCR Review on Development of Horticultural Crops, Comprehensive Planning for Development of Horticultural Crops, Development of Horticultural Crops, Development of Horticultural Crops In Telangana, Horticultural Crops, Horticultural Crops Development, Mango News, Mango News Telugu, Telangana CM KCR

తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఉద్యానవన పంటల సాగు మరింత విస్తరించే దిశగా పరిశోధనలు చేపట్టాల్సిన అవసరమున్నదని, ఈ నేపథ్యంలో హార్టికల్చర్ యూనివర్శిటీని బలోపేతం చేయాలని సీఎం సూచించారు. తెలంగాణ హార్టికల్చర్ అభివృద్ధి దిశగా, ఆధునిక పద్ధతుల్లో ఉద్యానవన పంటల సాగుకోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఉద్యానవన విశ్వవిద్యాలయం మౌలిక సౌకర్యాల రూపకల్పన అభివృద్ధి కోసం ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో నిధులను కేటాయిస్తుందని సీఎం స్పష్టం చేశారు.

వంటిమామిడి, రామగిరి ఖిల్లా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే 2,601 రైతు వేదిక నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇదే స్ఫూర్తితో సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రవ్యాప్తంగా వున్న మున్సిపాలిటీలు, ముఖ్య పట్టణాల సెంటర్లలో గజ్వేల్ తరహా సమీకృత కూరగాయల మార్కెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు వంటి వ్యవసాయ ప్రోత్సాహక చర్యలతో తెలంగాణ వ్యవసాయం గాడిలో పడిందని, రైతన్నల జీవితాలు గుణాత్మక అభివృద్ది దిశగా సాగుతున్నాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ హార్టికల్చర్ విధానాన్ని రూపొందించుకోవాలని సీఎం అన్నారు. ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక అంశంపై ప్రగతి భవన్ లో శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

తెలంగాణలో వ్యవసాయరంగాన్ని అంచనావేయడంలో గత పాలకులు వైఫల్యం చెందారు:

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మూస పద్ధతిలో సాగింది. ప్రాజెక్టుల కింద కాల్వల నీళ్లతో సాగయిన వరి పంటకే ఆనాటి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. తద్వారా సాగునీటి కొరత తీవ్రంగా నెలకొన్న తెలంగాణలో వ్యవసాయం బాగా వెనకబడిపోయింది. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అంచనా వేయడంలో గత పాలకులు వైఫల్యం చెందారు. వ్యవసాయ రంగానికి ఓ విధానం రూపొందించకపోవడం వల్ల నీటి కరువు ప్రాంతమైన తెలంగాణలో పండ్లు, కూరగాయలు, ఆకు కూరల్లాంటి తక్కువ నీటితో సేద్యమయ్యే ఉద్యాన వన పంటల సాగు చాలావరకు విస్మరించబడింది. కానీ స్వయంపాలనలో ఇప్పుడు వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి దిశగా ముందుకు సాగుతున్నది. మన నేలల స్వభావం, మన పంటల స్వభావం మనకు అర్థమవుతున్నది. సాగునీటి ప్రాజెక్టుల వలన నీరు పుష్కలంగా లభిస్తున్న నేపథ్యంలో తక్కువ నీటి వాడకంతో ఎక్కువ లాభాలు గడించేందుకు మన రైతాంగాన్ని ఉద్యాన వన పంటల సాగు దిశగా ప్రోత్సహించాల్సిన అవసరమున్నది. ప్రభుత్వ ఉద్దేశాలను అర్థం చేసుకుని ఉద్యానవన నర్సరీలను నెలకొల్పే రైతులకు, పంటలను సాగుచేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక రైతులకు రైతుబంధుతో పాటుగా ప్రత్యేక ప్రోత్సాహాకాలను అందించేందుకు వ్యవసాయ, ఉద్యానవనశాఖలు కార్యాచరణ రూపొందించాలి. పండ్లు, కూరగాయలు, పూల సాగులో ఉద్యానవన శాఖ ఇప్పుడెలా వుంది? భవిష్యత్తులో ఎలా ఉండాలో ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి’’ అని తెలిపారు.

ఉద్యానవన పంటలను తెలంగాణలో అద్భుతంగా పండించవచ్చు:

‘‘తెలంగాణలో మొత్తం 129 మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ సహా, మరో 12 కార్పొరేషన్లు, ఇండస్ట్రియల్ నగరాలు, పట్టణాలున్నాయి. వీటన్నింటిలో నివసించే ప్రజలకు అవసరమైన కూరగాయలు పండ్లు వంటి నిత్యావసరాలను అందించేందుకు ఆ పట్టణాల చుట్టూ ఉండే కొందరు రైతులను ఎంపిక చేసి, కూరగాయలు తదితర ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరముంది. తద్వారా తెలంగాణలోని పట్టణ ప్రజలు ఇతర రాష్ట్రాలు నుంచి కూరగాయలను దిగుమతి చేసుకునే పరిస్థితి వుండదు. అతి తక్కువ నీటి వినియోగం, అతి తక్కువ కాల పరిమితితో కూడిన ఉద్యానవన పంటల సాగుతో రైతులకు ఎక్కువ ఆదాయం మిగులుతుందని సమీక్షా సమావేశంలో పాల్గొన్న అధికారులు సీఎంకి వివరించారు. మనం కూరగాయలను దిగుమతి చేసుకునే స్థాయినుంచి ఎగుమతి చేసే దిశగా ఉద్యానవనశాఖ చర్యలు చేపట్టాలని, తద్వారా అంతర్గతంగానే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకునే వీలుందని తెలిపారు. తెలంగాణ నేల అద్భుతమైన సాగు స్వభావాన్ని కలిగి వున్నదని, ఇక్కడ కురిసే వర్షాలు, గాలి, వాతావరణం హార్టికల్చర్ పంటలకు అత్యంత అనుకూలమైనదని, ఉద్యానవన పంటలను తెలంగాణలో అద్భుతంగా పండించవచ్చని” అని సీఎం అన్నారు.

కొరత లాంటి కారణాలతో రైతులకు పంటల సాగులో విపరీతమైన ఖర్చు పెరిగిపోతున్నదని, సాంకేతిక పరిజ్జానాన్ని అందిపుచ్చుకుని సాగువిధానాలను రూపొందించుకుని రైతు సాగు ఖర్చు తగ్గించుకునే దిశగా వ్యవసాయ శాఖ విధివిధానాలు రూపొందించుకోవాలన్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై పనిచేస్తున్నారని, రైతులు ఏయే పంటలు పండిస్తున్నారనే సమాచారాన్ని నమోదు చేసి, రైతుల సెల్ ఫోన్లకు కూడా మెసేజీల ద్వారా పంపిస్తున్నారని, ఈ విధానం దేశంలో మరెక్కడాలేదని సీఎం అభినందించారు. ఉద్యానవన శాఖలో పని విధానాన్ని వికేంద్రీకరణ చేసుకోవాలని, ఇందుకు పని విభజన జరగాలన్నారు. ఇప్పుడు ఉద్యానవన శాఖకు ఒకే కమిషనర్ ఉన్నారని, ఇకనుంచి పండ్లు పండ్లతోటల సాగుకోసం, కూరగాయలు ఆకుకూరల సాగు కోసం, పామాయిల్ సాగు కోసం మొత్తంగా నలుగురు ఉన్నతాధికారులను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ దిశగా క్షేత్రస్థాయి ఉద్యోగి వరకు పని విభజన జరగాలన్న సీఎం, ఉద్యానవనశాఖలో తక్షణం పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని, తగినంతగా సిబ్బంది ఏర్పాటుకు విధివిధానాలు రూపొందించాలని, హార్టికల్చరిస్టులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.

అదే సమయంలో కేంద్రం అమలు చేస్తున్న నూతన సాగు చట్టాలకు సంబంధం లేకుండా మన మార్కెట్లను మనం కాపాడుకుందామని సీఎం అన్నారు. ‘‘మనకు అద్భుతమైన భూములున్నయి. సాగునీరు పుష్కలంగా అందుతున్నది. ఇప్పుడన్నా మన నీళ్లను, మన భూములను సాగుకు సరిగ్గా వినియోగించుకోకపోతే ఎట్లా? ఆ దిశగా దృష్టి కేంద్రీకరించాలి’’ అని ఈ సమావేశంలో అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వీలైనంత మేర పత్తి సాగు పెంచాలన్నారు. రైతుకు అత్యంత లాభం చేకూర్చే దిశగా దేశవ్యాప్తంగా సాగవుతున్న వివిధరకాల ఉద్యానవన పంటల సాగుపై సమీక్షా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామి రెడ్డి, హార్టికల్చర్ యూనివర్శిటీ వీసీ నీరజ, తదితర హార్టికల్చర్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 1 =