70 ఏళ్లలో సాధ్యపడని అభివృద్ధిని ఏడేళ్లలో చేసి చూపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే: మంత్రి కేటీఆర్

Minister KTR Laid Foundation Stone to Siddapur Reservoir Works at Nizamabad

తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో అమలు చేస్తున్న కార్యక్రమాల వల్లనే తెలంగాణ గుణాత్మక మార్పు దిశగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ లో 119.41 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న రిజర్వాయర్ నిర్మాణం పనులకు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ బుధవారం స్థానిక శాసన సభ్యులు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు.

70 ఏళ్లలో సాధ్యపడని అభివృద్ధిని ఏడేళ్లలో చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే:

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, దేశంలోనే ఇతర ఏ రాష్ట్రాలలో లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఒక్కో నీటి బొట్టును వొడిసిపడుతూ, కోటిన్నర ఎకరాలలో ప్రతి గుంటకు రెండు పంటలకు సరిపడా సాగునీటిని అందించాలనే కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాలయను వెచ్చిస్తోందన్నారు. ఇందులో భాగంగానే సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 120 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గడిచిన డెబ్బై సంవత్సరాలలో సాధ్యపడని అభివృద్ధిని ఏడేళ్లలో చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామసాగర్, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం, నిజాంసాగర్ కు కాళేశ్వరం జలాల మల్లింపు తదితర పథకాలతో తెలంగాణా సస్యశ్యామలంగా మారి పచ్చదనంతో అలరారుతోందని అన్నారు. రాష్ట్రంలో 46 వేల చెరువులు, కుంటలకు మిషన్ కాకతీయ పథకం ద్వారా జీవం పోశామన్నారు. కేవలం వ్యవసాయ రంగాన్ని కాకుండా కులం, మతంతో సంబంధం లేకుండా తెలంగాణలోని అన్ని వర్గాల వారు సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు.

ఎవరూ సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ అభివృద్దే మా లక్ష్యం:

ఇదివరకు 200 రూపాయలకే పరిమితమైన ఆసరా పెన్షన్ ను రెండు వేల రూపాయలకు పెంచామని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లక్షా 116 రూపాయలు అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన భోజనం సమకూరుస్తున్నామని, వెయ్యి గురుకుల బడులను కొత్తగా నెలకొల్పి, ఒక్కో విద్యార్థిపై లక్షా 20 వేల రూపాయలను వెచ్చిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు. ఫలితంగానే ప్రభుత్వ గురుకులాల్లో చదువుకున్న అనేకమంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారని మంత్రి కేటీఆర్ హర్షం వెలిబుచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు సైతం 20 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను మెరుగుపర్చి నాణ్యమైన వైద్యం అందిస్తుండడం వల్ల మాతా శిశు మరణాల రేటు తగ్గిందని, యాభై శాతం కాన్పులు సర్కారు దవాఖానల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటింటికి రక్షిత మంచినీరు, ఆరోగ్యలక్ష్మి, చేనేత మిత్ర వంటి అనేకానేక పథకాలను అమలు చేస్తుండడంతో పొరుగున ఉన్న మహారాష్ట్రకు చెందిన సర్పంచులు తమను కూడా తెలంగాణాలో కలుపుకోవాలని కోరుతున్నారని అన్నారు. చివరకు కర్ణాటకలోని రాయచూర్ ఎమ్మెల్యే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపర్చారని, తెలంగాణలో గుణాత్మక అభివృద్ధి జరుగుతోందనడానికి ఇదే తార్కాణం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఏ ఉద్దేశ్యంతోనైతే తెలంగాణను సాధించుకున్నామో, ఆ లక్ష్యం దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే ముఖ్యమంత్రి ధ్యేయమని, ఎవరు సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ అభివృద్దే తమ లక్ష్యమని అన్నారు. కాగా, అందమైన గుట్టలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్న సిద్ధాపూర్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, బాన్సువాడ మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

స్పీకర్ పోచారంపై ప్రశంసల జల్లులు :

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లులు కురిపించారు. స్పీకర్ పోచారంకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గురించి ఉన్నంత అవగాహన మరెవరికి ఉండదని అన్నారు. పట్టుబట్టి మరీ నిధులను సాధించుకోవడంలో పోచారం సిద్దహస్తులని, ఆయన ఏ పని చేసిన నిత్యా విద్యార్థిలా ఎంతో ప్రణాళికాబద్ధంగా, అంకిత భావంతో చేస్తారని కొనియాడారు. ఆయన కృషి ఫలితంగానే సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 120 కోట్ల రూపాయలు, ఎత్తిపోతల పథకాలకు మరో 106 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అలాంటి నాయకుడు ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని అన్నారు.

పాతికేళ్ల చిరకాల వాంఛ నెరవేరుతోంది : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

సుమారు 20 తండాలు, పది గ్రామాల పరిధిలోని 14 వేల ఎకరాలకు రెండు పంటలకు సాగు నీటిని అందించి సస్యశ్యామలం చేయాలనే పాతికేళ్ల కల నెరవేరుతున్న శుభ తరుణం ఇది అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి తాను కోరిన మరుక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేయించారని కృతజ్ఞతలు ప్రకటించారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే 27 చెరువులలో ఎల్లవేళలా నీటినిల్వలు ఉంటాయని, తద్వారా భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందుతాయని అన్నారు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం అవసరమైన నిధులను మంజూరు చేయించుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చేదని, ప్రస్తుతం స్వరాష్ట్రంలో కోరిన వెంటనే కోట్లాది రూపాయలను మంజూరు చేస్తున్నారని అన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రపంచ దేశాల నుండి ఆహ్వానాలు అందుకుని అంతర్జాతీయ వేదికలపై తెలంగాణా ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని కొనియాడారు. బాన్సువాడకు మున్సిపాలిటీ హోదాను కల్పిస్తూ, పట్టణ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలను మంజూరు చేశారని కేటీఆర్ కు సభాముఖంగా కృతఙ్ఞతలు తెలిపారు.

బంగారు తెలంగాణా నిర్మాణానికి కేసీఆర్, కేటీఆర్ కృషి : మంత్రి వేముల

పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్ధేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అంకిత భావంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. రైతుల పట్ల కేసీఆర్ కు ఎనలేని ఆపేక్ష ఉండడంతో అన్నదాతల కోసం దేశంలోనే మరెక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నారని, సేద్యానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నారని అన్నారు. ప్రతి ఎకరాకు సాగు నీరందించాలని మహత్తర సంకల్పంతో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని, భూగర్భ జలాల పెంపు కోసం చెక్ డ్యామ్ లు, ఎత్తి పోతల పథకాల నిర్మాణాల కోసం వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారని తెలిపారు. ముఖ్మంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని, యావత్ దేశం చూపు తెలంగాణ వైపు ఉందని పేర్కొన్నారు. వాటర్ మెన్ ఆఫ్ ఇండియా గా పిలువబడే రాజేందర్ సింగ్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఎంతో అద్భుతమని కొనియాడారని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమాభివృద్ధి పనులు, కార్యక్రమాలను చూసి తమిళనాడు, కేరళ, హర్యానా, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు కూడా ఇక్కడికి అధ్యయనానికి వచ్చి ఆశ్చర్యపోతున్నారని, రైతుల మేలు కోసం ఇంత గొప్పగా పని చేసే ముఖ్యమంత్రి మరెవ్వరు లేరని కితాబిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు తదితర వాటిని అమలు చేస్తూ అన్ని రంగాల వారికి లబ్ది చేకూరుస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. ఇక్కడి సంక్షేమ, అభివృద్ధిని చూసి మహారాష్ట్ర వారు తెలంగాణలో కలిసేందుకు ఇష్టపడుతున్నారని అన్నారు. అలాగే మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణకు 17 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని, 2.35 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూరాయని, ఫలితంగా 16 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఐ టీ ఎగుమతులు 52 వేల కోట్లు వుంటే, వాటిని లక్షా 42 వేల కోట్ల రూపాయలకు పెంచిన ఘనత కేటీఆర్ దేనని అన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలను మెప్పించి మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి అతిపెద్ద ఐ.టీ సంస్థలు హైదరాబాద్ కు రావడానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్ధాపూర్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించగా, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి.పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ సిందే, షకీల్ ఆమిర్, జీవన్ రెడ్డి, జజాల సురేందర్, బిగాల గణేష్ గుప్తా, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ ఆకుల లలిత, నిజామాబాదు కలెక్టర్ సి.నారాయణరెడ్డి, కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రాతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 8 =