ఏపీకి ప్ర‌త్యేక హోదా.. మ‌ళ్లీ భాజా!

AP, Election Campaign, A special status topic for AP as an Election Campaign Tool, Election Campaign Tool, AP elections, Special Status for AP, TDP, Janasena, Congress, YCP, Andhra Pradesh, Election Day, Political Updates, Mango News Telugu, Mango News
AP elections, Special Status for AP, TDP, Janasena, Congress, YCP

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాలి.. ప‌దేళ్ల నుంచి ఈ డిమాండ్ అడ‌పాద‌డ‌పా తెర‌పైకి వ‌స్తూనే ఉంది. ఎవ‌రో ఒక‌రి నోట వెంట వినిపిస్తూనే ఉంది. అయితే.. ఎన్నిక‌ల ముందు తీవ్ర‌మైన స్థాయిలో మార్మోగుతూ ఉంటుంది. ఈసారి కూడా అదే జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఏపీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం అవుతున్నాయి. ఈ క్ర‌మంలో అధికార పార్టీ వైఫ‌ల్యాల‌పై విప‌క్షాలు, విప‌క్ష పార్టీల దుష్ప్ర‌చారాల‌పై అధికార ప‌క్షం కౌంట‌ర్లు వేస్తున్నాయి. మాట‌ల తూటాల‌తో ఎన్ కౌంటర్లు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌త్యేక హోదా అనేది మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌చార అస్త్రంగా మారిపోయింది.

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయ బాణంగా మ‌లిచిన చెల్లె ష‌ర్మిల‌.. కాంగ్రెస్ చీఫ్ అయిన‌ప్ప‌టి నుంచీ అన్న‌పైనే బాణాలు విసురుతున్నారు. ప్ర‌ధానంగా జ‌గ‌న్ టార్గెట్ గానే మాట్లాడుతున్నారు. ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప‌దే ప‌దే లేవ‌నెత్తుతున్నారు. దాని కోసం జ‌గ‌న్ చేసిన ఉద్య‌మాలు ఏమీ లేద‌ని, కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌డం మానేసి ఆ ప్ర‌భుత్వంతో కుమ్మ‌క్కయి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ తీవ్ర‌స్థాయిలో ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదా తీసుకురావాలన్న ఇంగితం జగన్‌కు గానీ, చంద్రబాబుకు గానీ లేనేలేదు. వారిద్దరూ బీజేపీ బానిసలు. బాబు ప్రత్యేక హోదా కోసమే అప్పట్లో పొత్తు అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక హోదా పేరెత్తిన వారిని జైల్లో కుక్కి కేసులు పెట్టారు. ఇప్పుడు వైసీపీ, టీడీపీ రెండూ హోదా గురించి పూర్తిగా మరిచాయి.. అంటూ ఎక్క‌డ ప్ర‌చారం చేసినా జ‌గ‌న్ తో పాటు అప్పుడ‌ప్పుడు చంద్ర‌బాబుపై కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల  విభ‌జ‌న స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాని మన్మోహన్ సింగ్ ఏపీ కి ప్ర‌త్యేక హోదా అంశంపై పార్ల‌మెంటు లో మాట్లాడారు. ఏపీకి ఐదేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌కటించారు. దీన్ని సమర్థించిన నాటి ప్రతిపక్షమైన బీజేపీ హోదా ఐదేళ్ళు కాదు పదేళ్లు ఇవ్వాలని మ‌రింత గ‌ట్టిగా చెప్పింది. ఏపీ కోసం హోదాను తెర‌పైకి తెచ్చి.. తెలంగాణ ప్ర‌క‌టించి రాష్ట్రాల‌ను విభ‌జించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గానే కొన‌సాగాల‌ని పోరాడిన ఏపీవాసుల ఉద్య‌మం ఫ‌లించ‌క‌పోయినప్ప‌టికీ.. హోదా అయినా వ‌స్తే.. నిధులు, ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డుల ద్వారా రాష్ట్రం మ‌ళ్లీ ఆర్థికంగా పురోగ‌మిస్తుంద‌ని ఆశించారు. విజ‌భ‌న ముందు ఈ అంశాన్ని కాంగ్రెస్‌, బీజేపీ కూడా బాగా ప్ర‌చారం చేశాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయ‌ని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30 శాతం నిధులను మొదట ఏపీకే ఇస్తుంద‌ని చెప్పారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర నిధులు 90 శాంతం గ్రాంట్లు గాను, 10 శాతం అప్పుగాను వస్తాయి. గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనక్కర్లేదు. అలాగే..  ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇస్తారు.

ప్ర‌త్యేక హోదాతో పెద్ద సంఖ్య‌లో ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయి.  లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సమకూరుతాయి. పదేళ్ల ప్రత్యేకహోదాతో ఏపీలోని 13 జిల్లాలు ఒక్కో హైదరాబాదుగా మారతాయి.. అంటూ నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ ఏపీని మాయ‌మాట‌ల‌తో మ‌భ్య‌పెట్టాయి. కానీ.. ఎన్నిక‌ల అనంత‌రం అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ప్ర‌త్యేక హోదా అంశంపై ర‌క‌ర‌కాల ఊహాగానాల‌ను తెర‌పైకి తెచ్చింది. ప‌లు అడ్డంకుల‌ను చెబుతూ వ‌స్తోంది. 1969లో ఆర్థికంగా అననుకూలతలు గల రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర నిధుల కేటాయింపు, వివిధ రకాల పన్నులలో మినహాయింపు ద్వారా ఆ రాష్ట్రాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఐదవ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును ఆనాటి జాతీయ అభివృద్ధి మండలి అంగీకరించడంతో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా భావన అమలులోకి వచ్చింది.  ప్రస్తుతం మొత్తం 11 రాష్ట్రాలకు పైగా ప్ర‌త్యేక హోదా క‌లిగి ఉన్నాయి. ఏపీకి ప్ర‌క‌టించిన‌ట్ల‌యితే.. మ‌రిన్ని డిమాండ్లు తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయంటూ బీజేపీ కాల‌యాప‌న చేస్తూ వ‌చ్చింది.

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం తొలుత అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు, ఆ త‌ర్వాత వ‌చ్చిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కూడా ప్ర‌త్యేక హోదా అంశాన్ని ఎన్నిక‌ల ఎజెండాలో పెట్టారు. కేంద్రం మెడ‌లు వంచి హోదా సాధిస్తామ‌ని హామీలు గుప్పించారు. ఇదే అంశాన్ని ష‌ర్మిల ప‌దేప‌దే లేవ‌నెత్తుతూ.. ఇరు పార్టీల‌ను టార్గెట్ చేశారు. దీనిపై వైసీపీ ముఖ్య‌లు మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదాను అడుగుతూనే ఉన్నామ‌ని, దీని గురించే జ‌గ‌న్ అన్ని సార్లు ఢిల్లీ వెళ్లారు.. ఇన్నిసార్లు విన‌తిప‌త్రాలు ఇచ్చారు.. అంటూ లెక్క‌లు చెబుతూ వివ‌ర‌ణ‌లు ఇచ్చే ప‌నిలో ఉన్నారు. టీడీపీ – జన‌సేన కూట‌మి కూడా ప్ర‌త్యేక హోదాను మ‌రిచిపోయారంటూ… జ‌గ‌న్ పై ఆరోప‌ణలు చేస్తూ.. తాము అధికారంలోకి వ‌స్తే సాధిస్తామ‌ని హామీలు గుప్పిస్తున్నారు… ఇలా ఇప్పుడు అన్ని పార్టీలూ మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా అంశాన్ని మ‌ళ్లీ లేవ‌నెత్తుతూ భాజా ఊదుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =